Sourav Ganguly: బీజేపీలోకి బీసీసీఐ ప్రెసిడెంట్..? దాదాను కలవనున్న అమిత్ షా
Amit Shah-Sourav Ganguly: టీమిండియా మాజీ సారథి ప్రస్తుత భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు బీజేపీలో చేరబోతున్నాడా..? ఈ ఏడాది అతడి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి.

బెంగాల్ లో పాగా వేయాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పట్నుంచే రూట్ మ్యాప్ సిద్ధం చేస్తుందా..? గతేడాది పశ్చిమబెంగాల్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గెలవాలని ఆశపడి భంగపడ్డ బీజేపీ ఈసారి మాత్రం ఐదేండ్ల ముందు నుంచే ప్రణాళికలు వేస్తున్నది.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తో సమావేశం కానుండటం కూడా ఇవే అనుమానాలకు తావిస్తున్నది. గంగూలీ పదవీ కాలం ఈ ఏడాది చివర్లో ముగియనుంది. దీంతో అతడిని బీజేపీలోకి ఆహ్వానించేందుకే షా.. గంగూలీ ఇంటికి వెళ్లనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం కోల్కతా పర్యటనలో ఉన్న అమిత్ షా.. అక్కడి బెహలాలో ఉన్న గంగూలీ ఇంటికి శుక్రవారం సాయంత్రం వెళ్లనున్నారు. షా.. గంగూలీ ఇంటికి మర్యాదపూర్వకంగా వెళ్లి కలుస్తారని బయటకు చెబుతున్నా.. వచ్చే ఎన్నికల నాటికి పక్కా వ్యూహంతోనే ముందుకెళ్లాలనే ప్రణాళికలోనే షా అతడిని కలుస్తున్నారని సమాచారం.
2021 అసెంబ్లీ ఎన్నికలలో దూకుడుగా వెళ్లిన బీజేపీ.. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ హవాకు దారుణంగా చతికిలపడింది. 200 స్థానాలకు పైగా సొంత ఆధిక్యం సంపాదించిన ఆమె.. మూడో సారి ముఖ్యమంత్రి అయ్యారు.
అయితే ఆ సమయంలో బెంగాల్ లో ప్రముఖ వ్యక్తులైన మిథున్ చక్రవర్తి, మమతా బెనర్జీ అనుచరులు సువేందు అధికారి, ముకుల్ రాయ్ లను బీజేపీలోకి చేర్చినా వాళ్లు ఆ పార్టీకి అధికారాన్ని ఇవ్వలేకపోయారు. గత ఎన్నికల సమయంలోనే గంగూలీని కూడా బీజేపీలోకి తీసుకురావడానికి ఆ పార్టీ గట్టి ప్రయత్నాలే చేసింది. కానీ దానికి దాదా ససేమిరా ఒప్పుకోలేదు.
అయితే వీరితో పోలిస్తే గంగూలీకి బెంగాల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. కోల్కతా ప్రిన్స్ గా పిలుచుకునే గంగూలీ.. బీసీసీఐ బాధ్యతలు ఈ ఏడాది అక్టోబర్ నాటికి (2019 నుంచి) ముగుస్తాయి. మళ్లీ అతడు ఆ పదవిలో కొనసాగుతాడా..? లేదా..? అనేది అనుమానమే. దీనిపై గంగూలీ కూడా ఇంతవరకు స్పందించలేదు.
ఈ నేపథ్యంలో గంగూలీని.. బీసీసీఐ పదవి ముగిసిన వెంటనే బీజేపీ తీర్థం ఇచ్చి తమ పార్టీలోకి చేర్చుకుని మమతా బెనర్జీని సమర్థంగా ఢీకొట్టాలని బీజేపీ భావిస్తున్నది. అయితే బీజేపీతో పాటు మమతా బెనర్జీతో కూడా గంగూలీకి సత్సంబంధాలున్నాయి. మరి తృణమూల్ ను కాదని గంగూలీ.. బీజేపీతో చేతులు కలుపుతాడా..? సమాధానం రావాలంటే అక్టోబర్ దాకా ఆగాల్సిందే.