- Home
- Sports
- Cricket
- ఐపీఎల్ లో ఫెయిల్ అయ్యానని తక్కువ అంచనా వేయొద్దు.. అక్కడ నేనేంటో చూపిస్తా : సిరాజ్ వార్నింగ్
ఐపీఎల్ లో ఫెయిల్ అయ్యానని తక్కువ అంచనా వేయొద్దు.. అక్కడ నేనేంటో చూపిస్తా : సిరాజ్ వార్నింగ్
Mohammed Siraj: ఇటీవలే ముగిసిన ఐపీఎల్-15 సీజన్ లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయిన మహ్మద్ సిరాజ్.. వచ్చే ఇంగ్లాండ్ పర్యటనలో మాత్రం అదరగొడతానని అంటున్నాడు.

ఆనతి కాలంలోనే టీమిండియాకు ప్రధాన బౌలర్ గా ఎదిగిన మహ్మద్ సిరాజ్.. ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించలేకపోయానని, కానీ ఇంగ్లాండ్ లో మాత్రం తన సత్తా ఏంటో చూపిస్తానని అన్నాడు.
గతేడాది అర్థాంతరంగా ఆగిపోయిన ఇండియా - ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లోని ఆఖరి (5వ) మ్యాచు కోసం ఇటీవలే ఎంపిక చేసిన సభ్యులలో సిరాజ్ పేరు కూడా ఉంది. తాజాగా అతడు.. భారత్-ఆస్ట్రేలియా ల మధ్య 2020-21 లో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో తెరకెక్కిన ‘బందోన్ మే ధమ్’ వెబ్ సిరీస్ డాక్యుమెంటరీ ట్రైలర్ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా సిరాజ్.. తన ఐపీఎల్ ఫామ్, రాబోయే ఇంగ్లాండ్ పర్యటన గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సిరాజ్ మాట్లాడుతూ.. ‘ఈ ఐపీఎల్ సీజన్ లో నేను సరిగా ఆడలేకపోయాను. గత రెండు సీజన్లు బాగానే ఆడినా ఈ ఏడాది మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు.
నేను నా స్థాయి మేర కష్టపడి వచ్చే ఏడాది బలమైన పునరాగమనం చేస్తా. నా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నా బలాలపై నాకు నమ్మకముంది...
ఇంగ్లాండ్ లో జరుగబోయే చివరి టెస్టు కోసం సన్నాహకాల్లో పాల్గొంటున్నాను. అక్కడ టెస్టులకు డ్యూక్ బాల్ వాడతారు. నేను ప్రస్తుతం దానితోనే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంగ్లీష్ పరిస్థితులలో బౌలింగ్ చేయడం ఎప్పుడూ ఆస్వాదించదగినది.
ఈ సిరీస్ లో మేము (టీమిండియా) ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్నాం. మాదే పైచేయిగా ఉంది కాబట్టి మాకు ఆత్మవిశ్వాసం నిండుగా ఉంది. ఆ టెస్టులో మేము రాణిస్తామనే నమ్మకం కూడా ఉంది..’ అని తెలిపాడు.
ఐపీఎల్-15 లో సిరాజ్.. 15 మ్యాచులాడి 10.07 ఎకానమీ తో 9 వికెట్లు మాత్రమే తీశాడు. ఈ ఏడాది అత్యధిక సిక్సర్లు (31) ఇచ్చుకున్న బౌలర్ గా సిరాజ్ చెత్త ప్రదర్శన చేశాడు.