- Home
- Sports
- Cricket
- అదే అతడికున్న వరం... ఐపీఎల్ వేలంలో కచ్చితంగా హాట్ కేక్ అవుతాడు : అండర్-19 క్రికెటర్ పై అశ్విన్ ప్రశంసలు
అదే అతడికున్న వరం... ఐపీఎల్ వేలంలో కచ్చితంగా హాట్ కేక్ అవుతాడు : అండర్-19 క్రికెటర్ పై అశ్విన్ ప్రశంసలు
IPL Mega Auction 2022: త్వరలో ప్రారంభం కాబోయే ఐపీఎల్ వేలంలో ఈసారి సీనియర్ క్రికెటర్లతో పాటు అండర్-19 ప్రపంచకప్, బిగ్ బాష్ లీగ్, ఇతర టీ20 లీగ్ లలో మెరిసిన యువ క్రికెటర్లను దక్కించుకోవాలని ఫ్రాంచైజీలు చూస్తున్నాయి.

మరికొద్దిరోజుల్లో ఐపీఎల్ వేలం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఫ్రాంచైజీలన్నీ.. తాము దక్కించుకోబోయే ఆటగాళ్ల కోసం ఎంతెంత ఖర్చు పెట్టాలని లెక్కలేసుకుంటున్నాయి. అయితే ఈసారి సీనియర్ క్రికెటర్లతో పాటు అండర్-19 ప్రపంచకప్, బిగ్ బాష్ లీగ్, ఇతర టీ20 లీగ్ లలో మెరిసిన యువ క్రికెటర్ల కోసం ఫ్రాంచైజీలు చూస్తున్నాయి.
ఈ జాబితాలో టీమిండియా అండర్-19 ప్రపంచకప్ లో మెరుస్తున్న యశ్ ధుల్ తో పాటు రఘువంశీ, రాజ్ బవ వంటి యువ ఆటగాళ్లు కూడా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని క్రికెట్ పండితులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఐపీఎల్ వేలంలో టీమిండియా అండర్-19 జట్టు ఆల్ రౌండర్ రాజవర్ధన్ హంగర్గేకర్ విలువైన ఆటగాడిగా మారడం ఖాయమని అశ్విన్ చెప్పాడు.
తన యూట్యూబ్ ఛానెల్ లో అశ్విన్ మాట్లాడుతూ.. ‘వచ్చే ఐపీఎల్ వేలంలో ఈ ఆటగాడు తప్పకుండా అమ్ముడుపోతాడు. ఏ ఫ్రాంచైజీ అతడిని దక్కించుకుంటుందో చెప్పలేను. అతడి పేరు రాజవర్ధన్ హంగర్గేకర్.
అతడు కుడి చేతి వాటం మీడియం పేసర్. అతడు ఇన్స్వింగర్ లు బాగా వేయగలడు. అది అతడికున్న వరం. ప్రస్తుతం భారత జట్టులో ఇషాంత్ శర్మ ఒక్కడే ఇన్స్వింగర్లు వేయగలడు. ఇన్స్వింగర్లు.. బ్యాటర్ల లోపలికి చొచ్చుకుని వచ్చి వారిని బోల్తా కొట్టిస్తాయి. అందుకే అతడి (రాజవర్ధన్)కి వచ్చే సీజన్ లో మంచి డిమాండ్ ఉంటుందని నేను భావిస్తున్నాను.
బౌలర్ గానే గాక హంగర్గేకర్ బ్యాటుతో కూడా రాణించగల సమర్థుడు. లోయర్ మిడిలార్డర్ లో బ్యాటింగ్ కు వచ్చే అతడు.. భారీ హిట్టర్ కూడా. అతడు సిక్సర్లు కొట్టినప్పుడు తన శక్తిని ఉపయోగించి కొట్టే సిక్సర్లు చూడముచ్చటగా ఉంటాయి...’ అని అశ్విన్ తెలిపాడు.
కాగా.. విండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ లో హంగర్గేకర్ ఆల్ రౌండర్ గా సేవలందిస్తున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచులు ఆడిన అతడు.. ఎనిమిది వికెట్లు తీసుకున్నాడు. ఐర్లాండ్ తో మ్యాచులో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. ఆ మ్యాచులో 39 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.