- Home
- Sports
- Cricket
- ఐసీసీ టోర్నీలలో అందుకే ఓడుతున్నాం.. 4 గంటల్లో 50 లక్షలు వస్తుంటే 5 రోజులు ఎవరాడతారు? యువరాజ్ షాకింగ్ కామెంట్స్
ఐసీసీ టోర్నీలలో అందుకే ఓడుతున్నాం.. 4 గంటల్లో 50 లక్షలు వస్తుంటే 5 రోజులు ఎవరాడతారు? యువరాజ్ షాకింగ్ కామెంట్స్
Yuvraj Singh: 2011 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత జట్టు 2013లో ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించింది. ఆ తర్వాత భారత జట్టుకు మెగా టోర్నీలలో అన్ని పరాజయాలే..

సుమారు మూడు దశాబ్దాల తర్వాత 2011లో వన్డే ప్రపంచకప్ ను భారత్ కు అందిచింది మహేంద్ర సింగ్ సారథ్యంలోని టీమిండియా. వన్డే ప్రపంచకప్ అనంతరం 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా నెగ్గింది.
దాని తర్వాత జరిగిన ఐసీసీ ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీలలో భారత జట్టుకు పరాజయాలే ఎదురవుతున్నాయి. 2019 వన్డే ప్రపంచకప్ లో సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన విరాట్ సేన.. గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో కూడా ఓడింది.
అయితే ఐసీసీ ఈవెంట్లలో భారత జట్టు ఓటమి పాలవడానికి కారణం మిడిలార్డర్ సరిగా లేకపోవడమే అంటున్నాడు టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్.
ఓ జాతీయ క్రీడా ఛానెల్ తో యువీ మాట్లాడుతూ.. ‘మేము 2011 ప్రపంచకప్ గెలిచినప్పుడు మేమంతా ఏ పొజిషన్ లో అయినా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఇదే పరిస్థితి 2019 ప్రపంచకప్ లో కనబడలేదు.
దానికి తగ్గట్టుగా జట్టు కూడా సన్నద్ధం కాలేదు. 2019 ప్రపంచకప్ లో అంతగా అనుభవం లేని విజయ్ శంకర్ ను నాలుగో స్థానంలో ఆడించారు. అప్పటికీ అతడు ఆడిందే ఐదారు వన్డేలే. ఆ తర్వాత ఆ స్థానాన్ని రిషభ్ పంత్ తో భర్తీ చేశారు. అప్పటికీ రిషభ్ ఆడింది నాలుగు వన్డేలే..
కానీ అప్పటికే అనుభవజ్ఞుడిగా ఉన్న అంబటి రాయుడును తుది జట్టులోకి తీసుకుని ఉంటే ఫలితాలు కచ్చితంగా మరో విధంగా ఉండేవి. 2003 వన్డే ప్రపంచకప్ ఆడే సమయానికి నేను, కైఫ్, దినేశ్ మోంగియా కనీసం 50 వన్డేలు ఆడి ఉన్నాం..’ అని చెప్పాడు.
అంతేగాక యువీ ఇంకా మాట్లాడుతూ.. ‘టీ20 ప్రపంచకప్ ఈవెంట్లలో కూడా మనం ఓడటానికి మిడిలార్డర్ సరిగా రాణించకపోవడమే కారణమని నా అభిప్రాయం. జాతీయ జట్టుతో పోల్చితే మన ఆటగాళ్లు ఫ్రాంచైజీ క్రికెట్ లో తాము ప్రాతినిథ్యం వహిస్తున్న జట్లకు ఎక్కువ పరుగులు చేస్తారు. తీరా ఇక్కడికి వచ్చేసరికి మాత్రం అట్టర్ ఫ్లాఫ్ అవుతున్నారు. గత టీ20 ప్రపంచకప్ లో మనం చూసిందిదే..’ అని తెలిపాడు.
టెస్టు క్రికెట్ చనిపోయే దశకు చేరిందని యువీ ఆందోళన వ్యక్తం చేశాడు. ‘ప్రజలు కూడా టీ20 క్రికెట్ చూడాలనే కోరుకుంటున్నారు. ఆటగాళ్లు కూడా అలాగే తయారయ్యారు.
ఐదు లక్షల (టెస్టు మ్యాచ్ ఫీజ్) కోసం ఏ ఆటగాడు ఐదు రోజులు కష్టపడతాడు. అదే నాలుగు గంటలు టీ20 మ్యాచ్ ఆడితే రూ. 50 లక్షలు వస్తున్నాయి.. అంతర్జాతీయ క్రికెట్ లోకి రాని ఆటగాళ్లు కూడా రూ. 10 కోట్లు పొందుతుండగా.. టెస్టు క్రికెట్ కు ఆడాలని ఆటగాళ్ల కోరుకుంటారనుకోవడం అతిశయోక్తే..’ అని యువీ చెప్పుకొచ్చాడు.