మమ్మల్ని బలిపశువులు చేశారు : మాజీ సెలక్టర్ తీవ్ర ఆరోపణలు
బీసీసీఐ తమను బలిపశువులుగా చేసిందని.. సెలక్షన్ విషయాలలో బీసీసీఐ పెద్దలు జోక్యం చేసుకున్నారని.. వాళ్లు నిందలు మోయాల్సి వస్తుందని తమ మీద రాళ్లు వేయడం ఎంత వరకు సమంజసమని మాజీ సెలక్టర్ ఒకరు తీవ్ర ఆరోపణలు చేశాడు.

భారత క్రికెట్ జట్టు వరుసగా ఐసీసీ టోర్నీలలో వైఫల్యంతో బీసీసీఐ చేతన్ శర్మ సారథ్యంలోని సెలక్షన్ కమిటీపై వేటు వేసింది. నలుగురు సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీని తొలగించి కొత్త సెలక్టర్ల కోసం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో తొలగించబడిని ఓ సెలక్టర్ బీసీసీఐ మీద ఆరోపణాస్త్రాలు సంధించాడు.
బీసీసీఐ తమను బలిపశువులుగా చేసిందని.. సెలక్షన్ విషయాలలో బీసీసీఐ పెద్దలు జోక్యం చేసుకున్నారని.. వాళ్లు నిందలు మోయాల్సి వస్తుందని తమ మీద రాళ్లు వేయడం ఎంత వరకు సమంజసమని సదరు సెలక్టర్ విమర్శించాడు.
ఇన్‌సైడ్ స్పోర్ట్స్ లో వచ్చిన కథనం ఆధారంగా.. ‘బీసీసీఐ మామీద నిందలు వేయడం సరైంది కాదు. కెప్టెన్సీ నిర్ణయం మేమొక్కరమే స్వంతంగా తీసుకున్నది కాదు. జట్టు ఎంపిక విషయాల్లో కూడా బీసీసీఐ బాసుల జోక్యం ఉంది. ఒక ఏడాదిలో 8 మంది సారథులను మార్చడమనేది రొటేషన్ పాలసీలో భాగమే. కానీ వాళ్లు (బీసీసీఐ) ఇప్పుడు మా మీద నిందలు వేస్తున్నారు. మమ్మల్ని బలిపశువులను చేస్తున్నారు.
సెలక్టర్లకు దీర్ఘకాలిక ప్రణాళిక లేదని మామీద నిందలు వేస్తున్నారు. కానీ అది నిజం కాదు. షమీని టీ20ల నుంచి తప్పించింది అర్ష్‌దీప్ వంటి యువ బౌలర్ల కోసమే. అతడిప్పుడు గొప్పగా రాణిస్తున్నాడు. అక్షర్ పటేల్ జడేజా కు బ్యాకప్ గా ఉన్నాడు. కానీ ఎవరైనా అశ్విన్ కు బ్యాకప్ గా ఉన్నారా..? వాషింగ్టన్ సుందర్ పేరు వినిపించినా అతడెప్పుడూ గాయాల బారిన పడుతూనే ఉన్నాడు. అందుకే అశ్విన్ ను ప్రపంచకప్ లో ఆడించారు.
అయినా టీమ్ సెలక్షన్ కూడా మా చేతుల్లో లేదు. టీమ్ మేనేజ్మెంటే దాని మీద నిర్ణయాలు తీసుకునేది. టీ20 ప్రపంచకప్ కు ఎంపికైనా చాహల్ ను ఎందుకు ఎంపిక చేయలనేది మేనేజ్మెంట్ కే తెలియాలి. కెప్టెన్సీ వ్యవహారం కూడా మా చేతుల్లో లేదు.
వాస్తవానికి విరాట్ కోహ్లీని 2023 వన్డే ప్రపంచకప్ వరకు పరిమిత ఓవర్ల సారథిగా ఉంచాలనుకున్నాం. కానీ అతడిని తీసేశారు. బీసీసీఐలో ఉన్న చాలా మంది భారత జట్టు ప్రస్తుతం అనుసరిస్తున్న కెప్టెన్ల మార్పుకు మద్దతు తెలపడం లేదు..’ అని వ్యాఖ్యానించాడు.