- Home
- Sports
- Cricket
- IPL2022 Auction: ఈ పది మంది క్రికెటర్లు మోస్ట్ వాంటెడ్.. ఏ ఫ్రాంచైజీ దక్కించుకుంటుందో గానీ..
IPL2022 Auction: ఈ పది మంది క్రికెటర్లు మోస్ట్ వాంటెడ్.. ఏ ఫ్రాంచైజీ దక్కించుకుంటుందో గానీ..
10 Most Expensive Players in Fray: ఐపీఎల్ మెగా వేలానికి వేళైంది. ఈనెల 12,13 తేదీలలో జరుగబోయే వేలంలో ఈ పదిమంది ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడనున్నాయి.

క్యాష్ రిచ్ లీగ్ (IPL) వేలానికి సమయం దగ్గపరడుతున్న కొద్దీ అభిమానులతో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సైతం టెన్షన్ పెరుగుతున్నది. ఏ ఆటగాడిని ఎంతకు దక్కించుకోవాలి..? స్టార్స్ ఎవరు..? తాము పెట్టే డబ్బులకు న్యాయం చేసేదెవరు..? వంటి విషయాలపై కూలంకషంగా చర్చించుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో వివిధ దేశాల నుంచి టాప్-10 మంది క్రికెటర్లు తమ గత ప్రదర్శనలు, ప్రస్తుత ఫామ్ ఆధారంగా అత్యధిక ధర దక్కబోయే ఆటగాళ్ల రేసులో ఉన్నారు. బీసీసీఐ నిర్ణయించిన వీళ్ల బేస్ ప్రైస్ కంటే నాలుగైదింతలు ఎక్కువ కొల్లగొట్టే సమర్థులు ఉన్నారు. వాళ్లెవరంటే...
1. ముజీబ్ రెహ్మాన్ (ఆఫ్ఘనిస్థాన్) : అఫ్ఘాన్ కు చెందిన ఈ యువ స్పిన్నర్ ను దక్కించుకోవడానికి పలు ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆఫ్ఘానిస్థాన్ కు చెందిన మరో స్పిన్నర్ రషీద్ ఖాన్ ను ఇప్పటికే అహ్మదాబాద్ ఫ్రాంచైజీ రూ. 15 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. ఆ జట్టు టీ20 సారథి మహ్మద్ నబీ ఇటీవలే బిగ్ బాష్ లీగ్ లో ఆడినా పెద్దగా రాణించలేదు. కానీ రెహ్మాన్ మాత్రం కచ్చితంగా ప్రభావం చూపగల ఆటగాడు. రెహ్మాన్ గతంలో ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ సూపర్ కింగ్స్ తరఫున ఆడి 19 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతానికి అతడి బిడ్డింగ్ ప్రైస్ (రిజర్వ్ ధర) రూ. 2 కోట్లుగా ఉంది.
2. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) : సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ సారథి డేవిడ్ వార్నర్ ఈసారి కచ్చితంగా ఐపీఎల్ లో స్పెషల్ అట్రాక్షన్ అనడంలో సందేహమే లేదు. ఐపీఎల్ లో 150 మ్యాచులాడి 5,449 పరుగులు చేసిన ఈ ఆసీస్ ఓపెనర్ సారథిగా కూడా రాణించగలడు. వార్నర్ ను దక్కించుకోవడానికి ఆర్సీబీ, పీబీకేఎస్, సీఎస్కే లతో పాటు కొత్త జట్లు లక్నో, అహ్మదాబాద్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. వార్నర్ బిడ్డింగ్ ప్రైజ్ కూడా రూ. 2 కోట్లుగా ఉంది.
3. షకిబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) : కోల్కతా నైట్ రైడర్స్ లో కీలక ఆటగాడైన బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ హసన్ ను ఈసారి ఆ జట్టు రిటైన్ చేసుకోలేదు. ఐపీఎల్ లో 71 మ్యాచులాడిన హసన్.. 793 పరుగులు చేయడమే గాక 63 వికెట్లు కూడా తీశాడు. హసన్ కనీస ధర రూ. 2 కోట్లుగా ఉంది.
4. జానీ బెయిర్ స్టో (ఇంగ్లాండ్) : 2019లో ఐపీఎల్ అరంగ్రేటం చేశాడు. సన్ రైజర్స్ తరఫున మెరుపులు మెరిపించాడు. 28 మ్యాచులలో 1,038 పరుగులు చేశాడు. బెయిర్ స్టో బిడ్డింగ్ ప్రైజ్ రూ. 1.5 కోటిగా ఉంది.
5. ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్ ) : ఐపీఎల్ లో 62 మ్యాచులాడిన బౌల్ట్.. 76 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ అయిన బౌల్డ్ గతంలో ముంబై తరఫున ఆడాడు. కానీ ఈసారి ముంబై అతడిని రిటైన్ చేసుకోలేదు. ఈసారి వేలంలో బౌల్ట్ కనీస దర రూ. 2 కోట్లు.
6. కగిసొ రబాడా (దక్షిణాఫ్రికా) : బౌల్ట్ మాదిరిగానే రబాడా కూడా అంతర్జాతీయ స్టార్ క్రికెటరే. గతంలో ఢిల్లీ తరఫున దుమ్ము రేపిన రబాడా ఈసారి వేలంలో ప్రత్యేకంగా నిలువనున్నాడు. అతడి కనీస ధర రూ. 2 కోట్లుగా ఉంది.
7. వనిందు హసరంగ (శ్రీలంక) : లంకకు చెందిన ఈ యువ బౌలర్ గత సీజన్ లో ఆర్సీబీ తరఫున ఆడాడు. టీ20 ప్రపంచకప్-2021 తో పాటు శ్రీలంక ప్రీమియర్ లీగ్ లో కూడా మెరిశాడు. ఈసారి వేలంలో హసరంగ కు భారీ ధర దక్కడం ఖాయంగా కనిపిస్తున్నది. అతడి కనీస ధరను బీసీసీఐ రూ. 1 కోటిగా నిర్ధారించింది.
8. జేసన్ హోల్డర్ (వెస్టిండీస్) : వార్నర్ మాదిరే సారథ్య లక్షణాలున్న క్రికెటర్ హోల్డర్. నమ్మదగ్గ బౌలరే గాక ఉపయోగకర బ్యాటర్ కూడా. ఇన్నాళ్లు సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన అతడిని దక్కించుకోవడానికి పలు ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఉన్నాయి. వేలంలో అతడి కనీస ధర రూ. 1.50 కోట్లుగా ఉంది.
9. పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్) : ఐర్లాండ్ కు చెందిన భీకర ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ కు ఈసారి ఐపీఎల్ వేలంలో మంచి ధర దక్కే అవకాశముంది. ఇంతవరకు అతడు ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆడలేదు. కానీ టీ20 క్రికెట్ లో అతడు 2,525 పరుగులు చేశాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ తో పాటు ఇతర పలు లీగ్స్ లో ఆడిన అనుభవం అతడికి ఎంతో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ఐపీఎల్ లో అతడి కనీస దర రూ. 50 లక్షలుగా ఉంది.
10. శ్రేయస్ అయ్యర్ (ఇండియా) : టీమిండియా యువ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ సారథి శ్రేయస్ అయ్యర్ ఈ సారి వేలంలో హాట్ కేక్. నాణ్యమైన బ్యాటర్ గానే గాక అద్భుతమైన సారథ్య లక్షణాలున్న అయ్యర్ ను దక్కించుకోవడానికి ఆర్సీబీ, హైదరాబాద్, కేకేఆర్, పీబీకేఎస్ లతో పాటు కొత్త ఫ్రాంచైజీలు కూడా పోటీ పడుతున్నాయి. ఈసారి వేలంలో అత్యధిక ధర అయ్యర్ కే దక్కవచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి. వేలంలో అతడి కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించింది బీసీసీఐ.