- Home
- Sports
- Cricket
- ఒక్కోడి పొట్ట గుట్టలా ముందుకొచ్చింది.. పది మీటర్లు కూడా పరిగెత్తేట్టు లేరు.. పాక్ జట్టుపై మిస్బా కామెంట్స్
ఒక్కోడి పొట్ట గుట్టలా ముందుకొచ్చింది.. పది మీటర్లు కూడా పరిగెత్తేట్టు లేరు.. పాక్ జట్టుపై మిస్బా కామెంట్స్
T20 World Cup 2022: పాకిస్తాన్ క్రికెట్ జట్టులోని ఆటగాళ్ల ఫిట్నెస్ పై మాజీ సారథి, గతంలో హెడ్ కోచ్ గా వ్యవహరించిన మిస్బా ఉల్ హక్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. పాక్ జట్టులో కొంతమందికి పొట్టలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించాడు.

పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆటగాళ్ల ఫిట్నెస్ పై బోర్డు వ్యవహరిస్తున్న తీరుపై ఆ జట్టు మాజీ హెడ్ కోచ్ మిస్బా ఉల్ హక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం పాక్ జట్టులో ఫిట్నెస్ అనేది ఓ జోక్ లా మారిందని.. టీమ్ లో కొంతమంది పొట్టలు ముందుకొచ్చినా బోర్డు పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించాడు.
మిస్బా మాట్లాడుతూ.. ‘ఇది (ఫిట్నెస్ సమస్యలు) దాచలేనిది. పిట్నెస్ ఇష్యూస్ కండ్ల ముందు కనబడుతున్నాయి. గతంలో వకార్ యూనిస్, నేను, షోయభ్ మాలిక్, యూనిస్ ఖాన్ వంటి ఆటగాళ్లు ఫిట్నెస్ సమస్యలతో పలుమార్లు జట్టు నుంచి తప్పుకున్నాం. మాకు మేముగా జట్టు నుంచి వైదొలిగి తిరిగి ఫిట్నెస్ సాధించాం..
కానీ ఇప్పుడు ప్రస్తుత పాకిస్తాన్ జట్టును చూస్తే కొంతమంది ఆటగాళ్ల పొట్టలు కనబడుతున్నాయి. వారి వెనుక భాగం కూడా భారీగా ఉంది. కనీసం పది అడుగులు వేయడానికి కూడా వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు.
దీనికి కారణం ఒకటే. అసలు జట్టులోకి వచ్చే ఆటగాళ్లకు ఫిట్నెస్ టెస్టులు నిర్వహించకపోవడం. ఒక ఆటగాడు జట్టులోకి రావాలంటే ఈ స్థాయిలో ఫిట్నెస్ సాధించాలనే బెంచ్ మార్క్ లేదు. దేశవాళీ క్రికెట్ లో ఫిట్నెస్ టెస్టులు నిర్వహిస్తున్నామని బోర్డు చెబుతుండటం హాస్యాస్పదం.
దీనిపై మేము గతంలో పలుమార్లు అర్థవంతమైన చర్చలు కూడా జరిపాం. దేశవాళీలో నిర్వహించే ఫిట్నెస్ టెస్టులు అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో ఉండవు. దేశవాళీలో కూడా అటువంటి ఫిట్నెస్ ప్రమాణాలను నెలకొల్పాలి..’ అని సూచించాడు.
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కు ఆదరణ, ఆకర్షణ పెరగడంతో ఆటగాళ్ల ఫిట్నెస్ తప్పనసరి అయింది. భారత్ తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా వంటి దేశాలు ఆటగాళ్ల ఫిట్నెస్ కు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి.