ఇదే ఫామ్ కొనసాగిస్తే సచిన్‌ను అధిగమించడం కష్టమేమీ కాదు.. కోహ్లీపై సన్నీ కామెంట్స్
Virat Kohli: పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మళ్లీ వరుసబెట్టి సెంచరీలు చేస్తున్న నేపథ్యంలో సచిన్ వంద శతకాల రికార్డు చర్చ మరోసారి చర్చనీయాంశమైంది. తాజాగా ఇదే విషయమై సన్నీ కూడా స్పందించాడు.
సుమారు ఆరు నెలలుగా మునపటి ఫామ్ ను అందుకుని మళ్లీ సెంచరీల కరువు తీర్చుకుంటున్నాడు టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ. గత నాలుగు వన్డేలలో కోహ్లీ ఏకంగా మూడు సెంచరీలు చేశాడంటేనే అర్థం చేసుకోవచ్చు అతడి ఫామ్ ఏ స్థాయిలో ఉందో.. గతేడాది ఆగస్ట్ లో ఆసియా కప్ టోర్నీలో ఆఫ్గాన్ పై సెంచరీ తర్వాత బంగ్లాదేశ్ టూర్ లో సెంచరీ చేసి బ్యాక్ ఆన్ ట్రాక్ అయ్యాడు కోహ్లీ.
తాజాగా లంకతో రెండు సెంచరీలు చేయడంతో వన్డేలలో కోహ్లీ శతకాల సంఖ్య 46కు చేరింది. దీంతో అతడు సచిన్ వంద శతకాల రికార్డును బద్దలుకొట్టడం ఖాయమనే చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. మరీ ముఖ్యంగా వన్డేలలో కోహ్లీ.. మరో మూడు సెంచరీలు చేస్తే సచిన్ అత్యధిక వన్డే సెంచరీల రికార్డు (49 సెంచరీలు)ను సమం చేస్తాడు.
అయితే వన్డేలలో కోహ్లీ సచిన్ ను దాటేయడం సులువేగానీ టెస్టులలో మాత్రం అది అంత వీజీ కాదు. అయితే కోహ్లీ ఇదే ఫామ్ ను కొనసాగిస్తే మాత్రం అదేం పెద్ద కష్టమేమీ కాదని అంటున్నాడు టీమిండియా మాజీ సారథి సునీల్ గవాస్కర్. ఏడాదికి ఆరు శతకాల చొప్పున బాదితే ఐదేండ్లలో ఆ రికార్డును చేరుకోవచ్చని సూచించాడు.
లంకతో మూడో వన్డేలో కోహ్లీ శతకం తర్వాత మాట్లాడుతూ.. ‘విరాట్ ఇదే ఫామ్ ను కొనసాగిస్తే సచిన్ వంద శతకాల రికార్డును దాటడం కష్టమేమీ కాదు. ప్రస్తుతం కోహ్లీ వయస్సు 34 ఏండ్లు. అతడు మరో ఐదారేండ్లపాటు ఆడే సత్తా ఉన్నవాడు. అంటే ఏడాదికి కోహ్లీ ఆరు సెంచరీలైనా కొట్టాలి. అంతేగాక 40 ఏండ్ల వరకూ క్రికెట్ ఆడాలి.
సచిన్ కూడా 40 ఏండ్ల దాకా క్రికెట్ ఆడాడు. ఫిట్నెస్ విషయంలో కోహ్లీని శంకించాల్సిన పన్లేదు. వికెట్ల మధ్యలో అత్యంత వేగంగా పరిగెత్తడంలో అతడు ఇప్పటికీ యువకులకే పోటీ ఇస్తున్నాడు. గతంలో ధోని కూడా రిటైర్ అయ్యేదాకా ఫిట్ గా ఉన్నాడు. అలాగే కోహ్లీ కూడా మరో ఐదారేండ్లు ఇదే ఫిట్నెస్ తో ఉంటే సచిన్ రికార్డులు అసాద్యమేమీ కాదు..
సచిన్ వంద రికార్డుల గురించి పక్కనబెడితే వన్డేలలో మాస్టర్ బ్లాస్టర్ ను దాటేసే అవకాశం కోహ్లీకి ఐపీఎల్ కు ముందే దక్కొచ్చు. భారత్.. న్యూజిలాండ్ తో మూడు వన్డేలు, ఆసీస్ తో మూడు వన్డేలు ఆడనుంది. సచిన్ వన్డే శతకాలను సమం చేయడానికి కోహ్లీకి మరో సెంచరీలు మాత్రమే కావాలి. ఆరు వన్డేలలో మూడు సెంచరీలు చేస్తే చాలు..’అని తెలిపాడు.