వచ్చేవారంలో వరల్డ్ కప్ షెడ్యూల్..? ఆ దేశం కొర్రీలతోనే జాప్యం..
ICC ODI WC 2023: ఈ ఏడాది క్రికెట్ అభిమానులను అలరించడానికి మరో ఐసీసీ ట్రోఫీ సిద్ధం కానుంది. అక్టోబర్ నుంచి వన్డే వరల్డ్ కప్ జరుగనుంది.

క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పురుషుల వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమైంది. అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా జరుగబోయే ఈ మెగా ఈవెంట్ కు సంబంధించిన తుది షెడ్యూల్ ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) త్వరలోనే విడుదల చేయనున్నట్టు తెలుస్తున్నది.
బీసీసీఐ ఇదివరకే ఐసీసీకి పంపిన ముసాయిదా షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకూ ఈ మెగా టోర్నీని భారత్ లోని పలు వేదికలలో జరిపించేందుకు బీసీసీఐ సన్నద్దమవుతున్నది. ఈ మెగా టోర్నీ షెడ్యూల్ ను బీసీసీఐ.. గత నెల ఐపీఎల్ ఫైనల్ ముగిశాక విడుదల చేస్తుందని వార్తలు వినిపించాయి.
డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిశాక అయినా షెడ్యూల్ వస్తుందని ఫ్యాన్స్ భావించారు. కానీ డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసి కూడా రెండు వారాలు కావొస్తుంది. అయినా ఇంతవరకూ షెడ్యూల్ విడుదల కాకపోవడంతో దీనిపై గందరగోళం నెలకొంది. ఒకవైపు ప్రపంచకప్ సమరానికి సమయం ముంచుకొస్తుంటే ఐసీసీ మాత్రం ఇంకా షెడ్యూల్ విడుదల చేయకపోవడమేంటని విమర్శలూ వినిపిస్తున్నాయి.
అయితే వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల కాకపోవడానికి ప్రధాన కారణం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వైఖరేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. పీసీబీ.. వన్డే వరల్డ్ కప్ కు వచ్చేది లేనిది తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడిందని చెప్పడం.. అదీగాక అహ్మదాబాద్ లో అయితే తాము ఆడమని పట్టుబడుతుండటం షెడ్యూల్ విడుదలకు అవాంతరాలుగా మారుతున్నాయి.
ముసాయిదా షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ దీనిని పీసీబీ వ్యతిరేకిస్తున్నది. తాము ఆడబోయే మ్యాచ్ లను చెన్నై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరులో మాత్రమే నిర్వహించాలని కోరుతోంది. భారత్ తో మ్యాచ్ మాత్రమే గాక అఫ్గాన్, ఆసీస్ తో తలపడే మ్యాచ్ వేదికను కూడా మార్చాలని పీసీబీ పట్టుబడుతోందట.
అయితే పీసీబీతో ఐసీసీ మంతనాలు సాగిస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. అంతా సవ్యంగా సాగితే వచ్చే వారం రోజుల్లో వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ అధికారికంగా విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.