- Home
- Sports
- Cricket
- Kapil Dev Birthday: టీమిండియా అలా చేస్తే కపిల్ దేవ్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చినట్టే : సన్నీ కామెంట్స్
Kapil Dev Birthday: టీమిండియా అలా చేస్తే కపిల్ దేవ్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చినట్టే : సన్నీ కామెంట్స్
India Vs South Africa: ప్రస్తుత భారత జట్టులో కూడా చాలా మంది క్రికెటర్లు కపిల్ దేవ్ ను ఆరాధిస్తారని చెప్పిన సునీల్ గవాస్కర్.. దక్షిణాఫ్రికాలో...

భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ పుట్టినరోజు (జనవరి 6) ను ఆయన అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగానే తెరకెక్కిన 83 సినిమా కూడా విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది.
అయితే అతడి మాజీ సహచరుడు, భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కపిల్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత భారత జట్టులో కూడా చాలా మంది క్రికెటర్లు కపిల్ దేవ్ ను ఆరాధిస్తారని, దక్షిణాఫ్రికాతో సిరీస్ తో గెలిస్తే అది హర్యానా హరికేన్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చినట్టేనని అన్నాడు.
రెండో టెస్టు సందర్భంగా మూడో రోజు లంచ్ సమయంలో సన్నీ మాట్లాడుతూ.. ‘భారత జట్టు ఇక్కడ (దక్షిణాఫ్రికా) టెస్టు సిరీస్ నెగ్గలేదు. గతంలో కూడా చాలా తక్కువ టెస్టుల్లో విజయం సాధించింది. 2018లో భారత్ ఇక్కడకు పర్యటనకు వచ్చినప్పుడు 2-1తో సిరీస్ కోల్పోయింది.
ఈ టెస్టు (టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య వాండరర్స్ లో జరుగుతున్న రెండో టెస్టును ఉద్దేశిస్తూ..) ను నేను ఎలా చూస్తున్నానంటే.. రేపు కపిల్ దేవ్ బర్త్ డే. టీమిండియాలో కూడా అతడిని ఆరాదించే ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు.
వాండరర్స్ టెస్టు గెలిచి భారత జట్టు కపిల్ కు పుట్టినరోజు బహుమతి అందించాలి. అలా చేస్తే అతడు ఎంతో సంతోషపడతాడు...’ అని గవాస్కర్ అన్నాడు.
భారత జట్టు గర్వించే ఆటగాళ్లలో కపిల్ దేవ్ ఒకడు. 1959 జనవరి 6న పంజాబ్ (అప్పటికీ ఇంకా హర్యానా విడిపోలేదు) లో జన్మించిన కపిల్ దేవ్.. 1978 అక్టోబర్ లో అరంగ్రేటం చేశాడు. పాకిస్థాన్ తో జరిగిన వన్డే, టెస్టులలో అతడు ఆడాడు.
1978 నుంచి 1994 వరకు సుదీర్ఘ కెరీర్ లో కపిల్ దేవ్.. 131 టెస్టులు, 225 వన్డేలు ఆడాడు. టెస్టులలో 5,248 పరుగులు చేసి 434 వికెట్లు తీసుకున్నాడు. వన్డేలలో 3,783 పరుగులు చేసి 253 వికెట్లు దక్కించుకున్నాడు. టెస్టులలో టాప్ స్కోరు 163 కాగా.. వన్డేలలో 175 అత్యుత్తమ స్కోరు.
భారత్ కు తొలి వన్డే ప్రపంచకప్ అందించిన నాయకుడిగా అతడు తన పేరును చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.
కాగా.. 1990 నుంచి దక్షిణాఫ్రికా పర్యటనలకు వెళ్తున్న భారత జట్టు ఇంతవరకూ అక్కడ టెస్టు సిరీస్ నెగ్గలేదు. 2018లో ఒకసారి వన్డే సిరీస్ గెలిచినా టెస్టులలో మాత్రం 2-1తో సిరీస్ కోల్పోయింది.
ఇక తాజాగా ఈ పర్యటనలో సెంచూరియన్ లో ముగిసిన టెస్టులో భారత జట్టు గెలిచింది. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులో గెలిచేందుకు ఇంకా భారత్ కు అవకాశాలు ఉన్నాయి.
రెండో ఇన్నింగ్సులో టీమిండియా.. 240 పరుగుల లక్ష్యాన్ని సఫారీల ముందు ఉంచింది. ఈ పిచ్ మీద సఫారీలు 2006లో న్యూజిలాండ్ మీద 217 పరుగులను ఛేదించారు. ఆ తర్వాత ఇక్కడ అది ఛేదనల్లో విఫలమైంది.
అంతేగాక వాండరర్స్ లో భారత జట్టు ఒక్క టెస్టు కూడా ఓడిపోలేదు. ఈ నేపథ్యంలో నాలుగో రోజు భారత బౌలర్లు ఏవిధంగా బంతులు విసరతారన్నది ఇప్పుడు టీమిండియా అభిమానుల మిలియన్ డాలర్ల ప్రశ్న. గెలవాలంటే సఫారీలకు ఇంకా 122 పరుగులు అవసరముండగా.. భారత్ కు 8 వికెట్లు కావాలి.
వర్షం కారణంగా నాలుగో రోజు ఆటకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే మొదలుకావాల్సిన మ్యచ్.. ఇంకా మొదలేకాలేదు. అయితే వర్షం తర్వాత వాతావారణ పరిస్థితులు బౌలర్లకు అనుకూలంగా మారితే మాత్రం సఫారీల పని అయిపోయినట్టే.