- Home
- Sports
- Cricket
- ఆ క్రెడిట్ వాళ్లిద్దరికే దక్కుతుంది : యువ ఆటగాళ్లకు అవకాశాలు రావడంపై పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు
ఆ క్రెడిట్ వాళ్లిద్దరికే దక్కుతుంది : యువ ఆటగాళ్లకు అవకాశాలు రావడంపై పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు
WI vs IND T20I: సీనియర్లు లేకున్నా.. అంతగా అనుభవం కలిగిన ఆటగాళ్లు ఆడకున్నా టీమిండియా అద్భుతాలు చేస్తున్నది. ఉన్న వనరులతో ఫలితాలు రాబడుతూ ఔరా..? అనిపిస్తున్నది. దీనికంతటికీ కారణం ఆ ఇద్దరిదే అని పాండ్యా అంటున్నాడు.

గడిచిన కొంతకాలంగా టీమిండియాలో జరిగినన్ని ప్రయోగాలు ప్రపంచ క్రికెట్ లోని ఏ జట్టులోనూ జరిగుండవు. కెప్టెన్సీ దగ్గర్నుంచి ప్లేయర్ల వరకు ప్రతి విభాగంలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓపెనింగ్ జోడీ, వన్ డౌన్ లో ఎవరు రావాలి..? మిడిలార్డర్ ఎవరు చూసుకోవాలి..? ఫినిషర్లు ఎవరు..? అని బ్యాటింగ్ విభాగంలో మేథో మధనం జరుగుతున్నది.
బ్యాటింగ్ తో పాటే బౌలింగ్ లో కూడా ఏ బౌలర్ సమర్థుడు..? వికెట్లు తీసేది ఎవరు..? ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసే స్పిన్నర్ ఎవరు..? డెత్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేయగలిగే వీరుడెవరు..? అంటూ ఈ విభాగంలోనూ ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. వికెట్ కీపర్ల సంగతి సరేసరి.
Image credit: Getty
అయితే సీనియర్లు లేకున్నా.. అంతగా అనుభవం కలిగిన ఆటగాళ్లు ఆడకున్నా టీమిండియా అద్భుతాలు చేస్తున్నది. ఉన్న వనరులతో ఫలితాలు రాబడుతూ ఔరా..? అనిపిస్తున్నది. దీనికంతటికీ కారణం కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అని అంటున్నాడు టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా.
Image credit: PTI
అంతగా ప్రాధాన్యం లేని సిరీస్ లకు పలువురు సీనియర్లు దూరంగా ఉంటుంటే.. రొటేషన్ పాలసీలో భాగంగా మరికొంతమంది సీనియర్ క్రికెటర్లు విరామం తీసుకుంటున్నారు. ఈ విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా బీసీసీఐ మాత్రం దీనిని నిరాటంకంగంగా కొనసాగిస్తున్నది. ఈ విధానం వల్లే ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, రుతరాజ్ గైక్వాడ్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, బిష్ణోయ్ వంటి ఆటగాళ్లకు అవకాశాలు దక్కుతున్నాయి.
తాజాగా హార్ధిక్ ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘దీనికంతటికీ (యువకులకు అవకాశాలు దక్కడంపై) క్రెడిట్ రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ లకే దక్కుతుంది. వాళ్లు టీమ్ లో పాజిటివిటీని నింపుతున్నారు. ఆటగాళ్లకు జట్టులో భద్రత ఉందని వాళ్లకు భరోసా కల్పిస్తున్నారు..
Image credit: PTI
ఫలానా మ్యాచ్ లో వారిని ఆడించేది, లేనిది ముందే వాళ్లకు చెబుతున్నారు. తీసుకోకుంటే ఎందుకు తీసుకోవడం లేదో కారణం కూడా వివరిస్తున్నారు. దీనివల్ల జట్టులోకి వచ్చే యువ ఆటగాళ్లు తాము బాగా ఆడితే తమ స్థానానికి డోకా లేదనే భావనలో ఉన్నారు..’ అని పాండ్యా తెలిపాడు.
ఇక హార్ధిక్ కు టీమిండియా వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్తారన్న వార్తలపై అతడు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. వైస్ కెప్టెన్సీ పేరెత్తకుండా.. ‘నాకు బాధ్యతలు అంటే ఇష్టం. వాటివల్ల నేను మరింత బాగా ఆడగలను. సాధారణ ఆటగాడి కంటే ఒక బాధ్యతతో కూడిన స్థానంలో ఉంటే నేను మరింత మెరుగ్గా రాణించేందుకు కృషి చేయగలను. ఆ పొజిషన్ లో ఉంటే నేను మరింత ఎక్కువ ఆలోచించగలను..’ అని వ్యాఖ్యానించాడు.