- Home
- Sports
- Cricket
- Harbhajan Singh: కేప్టౌన్ లో గెలిచేదీ మనమే.. సిరీస్ విజేతలమూ మనమే.. భజ్జీ ఆసక్తికర వ్యాఖ్యలు
Harbhajan Singh: కేప్టౌన్ లో గెలిచేదీ మనమే.. సిరీస్ విజేతలమూ మనమే.. భజ్జీ ఆసక్తికర వ్యాఖ్యలు
India Vs South Africa: కేప్టౌన్ లో గెలిచేది భారత జట్టేనని, మన విజయాన్ని ఆపడం ఎవరితరమూ కాదని అంటున్నాడు ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.

దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా.. సిరీస్ విజేతను నిర్ణయించే కీలకమైన మూడో టెస్టును ఈనెల 11 నుంచి కేప్టౌన్ వేదికగా ఆడనున్నది. ఈ మేరకు భారత జట్టు ఇప్పటికే కేప్టౌన్ చేరుకోవడమే గాక ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది.
ఈ సిరీస్ లో ఇప్పటికే ఇరు జట్లు చెరో గెలుపుతో సిరీస్ సమం చేశాయి. సెంచూరియన్ లో భారత్ గెలువగా.. జోహన్నస్బర్గ్ లో సఫారీలు విజయం సాధించడంతో మూడో టెస్టుపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది.
ఈ నేపథ్యంలో భారత మాజీ ఆఫ్ స్పిన్నర్, ఇటీవలే క్రికెట్ కు గుడ్ బై చెప్పిన దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేప్టౌన్ లో గెలిచేది భారత జట్టేనని, మన విజయాన్ని ఆపడం ఎవరితరమూ కాదని అన్నాడు.
హర్భజన్ మాట్లాడుతూ... ‘గతంలో టీమిండియా విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు గానీ లేదంటే మిగతా దేశాలు భారత్ కు వచ్చినప్పుడు గానీ మనకు ప్రస్తుతమున్నట్టు నలుగురు ఫేస్ బౌలర్ల బౌలింగ్ బెంచ్ లేదు.
వాళ్లు 145 కిలో మీటర్ల వేగంతో బంతులు విసరగల సమర్థులు. షమీ, బుమ్రా, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ వంటి వారితో మన బౌలింగ్ దృఢంగా ఉంది. వాళ్లు ప్రపంచ స్థాయి బౌలర్లు.
ఒకవేళ గతంలో మనకు ఇలాంటి బౌలింగ్ బెంచ్ ఉండి ఉంటే టీమిండియా తప్పకుండా అద్భుతాలు చేసి ఉండేది. ఇకపోతే.. దక్షిణాఫ్రికాలో సఫారీలను ఓడించి సిరీస్ నెగ్గేందుకు మనకు గొప్ప అవకాశం.
నా అంచనా ప్రకారం ఈ టెస్టులో భారత్ గెలుస్తుందని అనుకుంటున్నాను. ఈ మ్యాచులో మనదే ఆధిపత్యం అవుతుంది. కేప్టౌన్ లో గెలవడమే గాక సిరీస్ కూడా గెలుచుకుంటారని నేను ఆశిస్తున్నాను...’ అని భజ్జీ చెప్పాడు.
అంతేగాక గతంతో పోలిస్తే దక్షిణాఫ్రికా ఇప్పుడు బలహీనంగా ఉందని హర్భజన్ వ్యాఖ్యానించాడు. అప్పట్లో సౌతాఫ్రికాకు గ్యారీ కిర్స్టెన్, జాక్వస్ కలిస్, మార్క్ బౌచర్ వంటి బ్యాటింగ్ లైనప్ ఉండేదని, కానీ ఇప్పుడు సఫారీల బ్యాటింగ్ లో అంత లోతు కనిపించడం లేదని చెప్పాడు. దక్షిణాఫ్రికా కంటే భారత బ్యాటింగ్ లైనప్ బలంగా ఉందన్నాడు భజ్జీ.