- Home
- Sports
- Cricket
- Jasprit Bumrah: హిట్ మ్యాన్ నన్ను గుడ్డిగా నమ్ముతాడు.. అతడికి నేనెంత చెబితే అంతే.. : బుమ్రా షాకింగ్ కామెంట్స్
Jasprit Bumrah: హిట్ మ్యాన్ నన్ను గుడ్డిగా నమ్ముతాడు.. అతడికి నేనెంత చెబితే అంతే.. : బుమ్రా షాకింగ్ కామెంట్స్
India vs Srilanka T20I: యార్కర్లతో ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను గజగజవణికించే బూమ్ బూమ్ బుమ్రా అంటే టీమిండియా సారథి రోహిత్ శర్మకు ఎంతో నమ్మకం. జట్టు ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి హిట్ మ్యాన్ బుమ్రా వైపే చూస్తాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తనను గుడ్డిగా నమ్ముతాడని, తాను బౌలింగ్ చేసేప్పుడు అతడు జోక్యం చేసుకోడని స్టార్ పేసర్, శ్రీలంకతో సిరీస్ లో వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న జస్ప్రీత్ బుమ్రా అన్నాడు.
లంకతో సిరీస్ సందర్భంగా ధర్మశాలలో ఉన్న బుమ్రాతో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. తన యూట్యూబ్ చానెల్ లో నిర్వహిస్తున్న ‘డీఆర్ఎస్ విత్ ఆష్’ కార్యక్రమంలో మాట్లాడాడు.
ఈ సందర్భంగా బుమ్రా మాట్లాడుతూ... ‘నేను ఐపీఎల్ (2013) లోకి వచ్చినప్పుడు రికీ పాంటింగ్ సారథిగా ఉన్నాడు. అప్పుడు నాకు పెద్దగా ఛాన్సులు రాలేదు.
కానీ రోహిత్ శర్మ ముంబై కి కెప్టెన్ అయ్యాక.. నాలో నమ్మకాన్ని పెంచాడు. నాకు పదే పదే అవకాశాలిచ్చాడు. రోహిత్ భాయ్ నేను నెట్స్ లో బౌలింగ్ వేస్తుంటే గమనించేవాడు.
నా దగ్గర ఏం స్కిల్స్ ఉన్నాయి..? నేనెలా బౌలింగ్ చేయగలను..? వంటి విషయాలను రోహిత్ గమనించాడు. అతడు నాపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. మ్యాచులలో నన్ను ఆడించడమే గాక కీలక ఓవర్లు వేసే అవకాశం కల్పించాడు.
దాంతో నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. రోహిత్ నన్ను చాలా నమ్ముతాడు. అది ఎక్కడిదాకా చేరిందంటే.. ఇప్పుడైతే నేనెప్పుడు బౌలింగ్ వేయాలన్నా వేయగలను.
రోహిత్ నా నుంచి ఏం ఆశిస్తున్నాడో నాకు తెలుసు. నాకు బాల్ ఇచ్చిన తర్వాత ఇలా వేయమని కూడా అతడు నాకచెప్పడు. నాకు నచ్చినట్టు ఫీల్డింగ్ సెట్ చేస్తాడు..’ అని బుమ్రా అన్నాడు.
ప్రస్తుతం టీమిండియా వైస్ కెప్టెన్ గా ఉన్న బుమ్రా.. తాను కెప్టెన్సీ పగ్గాల కోసం ఆశపడటం లేదని, కానీ బీసీసీఐ తనకు ఆ బాధ్యతలు అప్పజెప్పితే మాత్రం తప్పకుండా తీసుకుని శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పాడు.
జట్టులో ఒక సీనియర్ ఆటగాడిగా ఉన్నప్పుడు ఇలాంటి బాధ్యతలు వాటంతట అవే వస్తాయని.. అయితే వాటిని మనం ఎంతవరకు నిర్వర్తిస్తున్నామనేదే ముఖ్యమని బుమ్రా అన్నాడు.