టీమిండియాకి లక్కీ ఛాన్స్... వుమన్స్ ఆసియా కప్ 2022 సెమీ ఫైనల్ షెడ్యూల్ ఇదే..
వుమెన్స్ ఆసియా కప్ 2022 టోర్నీలో సెమీ ఫైనల్ షెడ్యూల్ ఖరారైంది. 6 మ్యాచుల్లో ఐదింట్లో నెగ్గిన భారత మహిళా జట్టు టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లింది. భారత్‌ని ఓడించిన పాకిస్తాన్ కూడా 6 మ్యాచుల్లో 5 విజయాలు అందుకుంది. అయితే టీమిండియా నెట్ రన్ రేట్ +3.141 ఉండగా పాక్ +1.806 రన్‌రేటుతో రెండో స్థానానికి పరిమితమైంది..

India vs Pakistan
6 మ్యాచుల్లో నాలుగు విజయాలు అందుకుని, రెండింట్లో ఓడిన శ్రీలంక జట్టు 8 పాయింట్లతో సెమీ ఫైనల్స్‌కి రాగా పాకిస్తాన్‌కి ఊహించని షాక్ ఇచ్చిన థాయిలాండ్ అమ్మాయిలు 6 మ్యాచుల్లో 3 విజయాలతో నాలుగో స్థానంలో నిలిచి సెమీస్‌కి దూసుకొచ్చారు...
బంగ్లాదేశ్ జట్టు 6 మ్యాచుల్లో 2 విజయాలు అందుకుని, 3 మ్యాచుల్లో ఓడింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం బంగ్లాపై తీవ్ర ప్రభావం చూపింది. యూఏఈతో జరిగిన ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలిచి ఉంటే +0.423 రన్‌రేటుతో ఉన్న బంగ్లాదేశ్, సెమీ ఫైనల్‌కి అర్హత సాధించి ఉండేది...
వుమెన్స్ ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ టాప్ 4లో నిలవకపోవడం ఇదే మొదటిసారి. బంగ్లా పురుషుల జట్టు 2014తో పాటు 2022లోనూ టాప్ 4లో నిలవలేక, సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధించలేకపోయింది...
మొట్టమొదటిసారి వుమెన్స్ ఆసియా కప్‌లో సెమీ ఫైనల్స్‌కి అర్హత సాధించిన థాయిలాండ్ వుమెన్స్ జట్టు, అక్టోబర్ 13న సెమీ ఫైనల్ 1లో టీమిండియాతో తలబడనుంది. అదే రోజు పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది...
గ్రూప్ స్టేజీలో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో థాయిలండ్ 37 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది భారత జట్టు. దీంతో మరీ అద్భుతం జరిగి, థాయిలాండ్ చరిత్ర సృష్టిస్తే మినహా టీమిండియా, వుమెన్స్ ఆసియా కప్‌లో ఫైనల్ చేరడం ఖాయం...
asia cup
2003లో మొట్టమొదటిసారి వరల్డ్ కప్ సెమీస్‌కి చేరిన కెన్యా, ఇండియాతో మ్యాచ్ ఆడగా... 2015లో మొట్టమొదటిసారి వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ కూడా టీమిండియాతోనే తలబడింది. 2017లో మొట్టమొదటిసారి ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ దాకా వచ్చిన బంగ్లాదేశ్, టీమిండియాతో ఆడి ఓడింది.
మొట్టమొదటిసారి వుమెన్స్ ఆసియా కప్ సెమీ ఫైనల్ చేరిన థాయిలాండ్ కూడా భారత జట్టుతో తలబడనుంది.