- Home
- Sports
- Cricket
- TATA IPL: అతడు కెప్టెన్ గా రాణించేది కష్టమే.. సీఎస్కే కొత్త సారథిపై కోహ్లి కోచ్ షాకింగ్ కామెంట్స్
TATA IPL: అతడు కెప్టెన్ గా రాణించేది కష్టమే.. సీఎస్కే కొత్త సారథిపై కోహ్లి కోచ్ షాకింగ్ కామెంట్స్
TATA IPL2022 Live Updates: ఉన్నట్టుండి సారథ్య బాధ్యతలను రవీంద్ర జడేజాకు అప్పగించిన ధోని.. ఈ సీజన్ లో అతడి వెన్నంటి నడుపనున్నాడు. అయితే జడేజా ను కెప్టెన్ చేయడంపై మాత్రం కొందరికి రుచించడం లేదు.

ఐపీఎల్-15లో చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతలను రవీంద్ర జడేజా సామర్థ్యంపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది జడ్డూ.. ధోని వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాడని ప్రశంసలు కురిపిస్తుంటే మరికొందరేమో పెదవి విరుస్తున్నారు.
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ కూడా జడేజా సారథ్య సామర్థ్యాలపై అంత నమ్మకంగా లేడు. జడేజా గొప్ప కెప్టెన్ కాలేడని కుండబద్దలు కొట్టేశాడు.
రాజ్ కుమార్ శర్మ తన యూట్యూబ్ ఛానెల్ ‘ఖేల్ నీతి’లో మాట్లాడుతూ.. ‘ప్రపంచంలో గొప్ప ఆల్ రౌండర్లలో జడేజా ఒకడు. అందులో సందేహమే లేదు. అయితే అతడికి గతంలో కెప్టెన్ గా చేసిన అనుభవం లేదు.
అదే అతడికి పెద్ద కొరతగా కనిపిస్తున్నది. కొన్ని సార్లు మంచి క్రికెటర్ గొప్ప కెప్టెన్ అవ్వాలని గ్యారెంటీ లేదు కదా..’ అని వ్యాఖ్యానించాడు.
రాజ్ కుమార్ శర్మ చెప్పినట్టు జడ్డూకు సారథిగా పెద్ద అనుభవం లేదు. అతడు టీమిండియాలోకి రాకముందు అండర్-19 కు ఆడుతున్నప్పుడు విను మన్కడ్ ట్రోఫీలో సౌరాష్ట్రకు కెప్టెన్ గా వ్యవహరించాడు. అనంతరం అతడికి ఆ అవకాశమే రాలేదు.
అయితే ఉన్నట్టుండి 2022 సీజన్ కు ముందు ధోని తప్పుకోవడంతో జడేజా కు సారథ్య బాధ్యతలు దక్కాయి. అయితే కొత్త బాధ్యతలపై జడ్డూ పెద్దగా ఆందోళన చెందడం లేదు. తన వెనుక ధోని ఉన్నాడని, అసలు వాటి గురించి భయపడాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశాడు.
శనివారం సాయంత్రం 7.30 గంటల నుంచి వాంఖెడే వేదికగా జరుగబోయే ప్రారంభ మ్యాచులో రవీంద్ర జడేజా సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్.. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని కోల్కతా నైట్ రైడర్స్ ను ఢీకొట్టనున్న విషయం తెలిసిందే.