- Home
- Sports
- Cricket
- IPL2022: ఐపీఎల్ సారథులు అందరికీ తెలుసు.. మరి ఓనర్లో..? పది ఫ్రాంచైజీల యజమానులు వీళ్లే..
IPL2022: ఐపీఎల్ సారథులు అందరికీ తెలుసు.. మరి ఓనర్లో..? పది ఫ్రాంచైజీల యజమానులు వీళ్లే..
TATA IPL2022- 10 Franchises Owners: మహారాష్ట్ర వేదికగా ఇటీవలే మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 సీజన్ లో అన్ని జట్లకు సంబంధించిన సారథులు ఇప్పటికే ఒక్కో మ్యాచ్ ఆడేశారు. మరి ఈ సారథులను నడిపిస్తున్న ఓనర్లు ఎవరు..?

ఐపీఎల్-15 సీజన్ షురూ అయింది. గత శనివారం ముంబై లోని వాంఖెడే వేదికగా మొదలైన ఈ క్యాష్ రిచ్ లీగ్ లో అన్ని జట్లు ఇప్పటికే తమ సీజన్ ను ప్రారంభించాయి. పది జట్లలో ఐదుగురు సారథులు గెలవగా.. ఐదుగురు ఓడారు. మరి ఈ సారథులను నడిపిస్తున్న ఓనర్లు ఎవరో మీకు తెలుసా..? అయితే ఇది చదవాల్సిందే.
1. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఐపీఎల్ లో అత్యంత ప్రాచుర్యం పొందిన జట్టు ఆర్సీబీ. 2008 లో లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా దీనికి ఓనర్ గా ఉన్నాడు. కానీ నిండుగా అప్పుల్లో కూరుకుపోయిన మాల్యా.. 2016లో అతడు యూనైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ సంస్థ చైర్మెన్ పదవికి రాజీనామా చేశాడు. గతంలో ఆ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన ప్రథమేశ్ మిశ్రా ఇప్పుడు యూనైటెడ్ స్పిరిట్స్ కు చైర్మెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఆర్సీబీ ఓనర్ కూడా అతడే. ఆర్సీబీకి గత సీజన్ దాకా కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లి తప్పుకోవడంతో ప్రస్తుతం ఆ జట్టు ఫాఫ్ డుప్లెసిస్ ను కెప్టెన్ గా ఎంచుకుంది.
2. ఢిల్లీ క్యాపిటల్స్ : రిషభ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీకి జేఎస్ డబ్ల్యూ (జిందాల్ సౌత్ వెస్ట్), జీఎంఆర్ (గ్రంథి మల్లిఖార్జున్ రావు) గ్రూప్ లు యజమానులుగా వ్యవహరిస్తున్నాయి. 2017 సీజన్ వరకు జీఎంఆర్ ఒక్కటే సోల్ ఓనర్ గా ఉన్నా తరర్వాత జేఎస్ డబ్ల్యూ వచ్చి చేరింది. ఇప్పుడు రెండు సంస్థలు 50 : 50 శాతం యాజమాన్యం కలిగి ఉన్నాయి. జేఎస్ డబ్ల్యూ మేనేజింగ్ డైరెక్టర్ పార్థ్ జిందాల్ ఢిల్లీ జట్టు కు సంబంధించిన వ్యవహారాల్లో చురుకుగా పాల్గొంటాడు.
3. సన్ రైజర్స్ హైదరాబాద్ : కేన్ విలియమ్సన్ కెప్టెన్ గా ఉన్న సన్ రైజర్స్ కు సన్ టీవీ గ్రూప్ యజమానిగా వ్యవహరిస్తున్నది. 2012 వరకు డెక్కన్ ఛార్జర్స్ గా ఉన్న హైదరాబాద్ జట్టు.. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ గా మారింది. ఆరు భాషల్లో సుమారు 33 ఛానెల్స్ ఉన్న సన్ నెట్వర్క్.. 67 ఎఫ్ఎం స్టేషన్లను కూడా కలిగి ఉంది. మీడియా ఫీల్డ్ లో దిగ్గజంగా వెలుగొందుతున్న సన్ నెట్వర్క్ యజమాని కళానిధి మారన్. అయితే ఆయన కూతురు కావ్య మారన్ ఎస్ఆర్హెచ్ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొంటుంది.
4. పంజాబ్ కింగ్స్ : సీజన్ సీజన్ కు సారథులను మార్చే జట్టు పంజాబ్ కింగ్స్ ఈసారి మయాంక్ అగర్వాల్ ను తమ కెప్టెన్ గా నియమించుకుంది. అయితే 2008 నుంచి ఐపీఎల్ లో ఉన్న ఈ జట్టు ఓనుర్లు మోహిత్ బర్మన్, నెస్ వాడియా, ప్రీతి జింతా, కరణ్ పాల్. మోహిత్ బర్మన్ ప్రముఖ ఎప్ఎంసీజీ బ్రాండ్ డాబర్ కు అధినేత. కరణ్ పాల్ అపీజయ్ సురేంద్ర గ్రూప్ కు చైర్మన్. ఇక నెస్ వాడియా బొంబాయి బర్మ ట్రేడింగ్ కార్పొరేషన్ కు మేనేజింగ్ డైరెక్టరర్ గా ఉన్నాడు. అంతేగాక అతడు బ్రిటానియా ఇండస్ట్రీస్ (ఎఫ్ఎంసీజీ) లో వాటాలు కూడా కలిగి ఉన్నాడు. ప్రీతి జింతా గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది.. బాలీవుడ్ గురించి తెలిసిన వాళ్లకు ఆమె పరిచయం అక్కర్లేదు.
5. రాజస్థాన్ రాయల్స్ : సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ జట్టులో 65 శాతం వాటా మనోజ్ బదలె ది. ఎమర్జింగ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కు ఆయన అధినేత. ఇక ఈ జట్టులో లచ్లన్ ముర్దోచ్ (13 శాతం వాటా), రెడ్ బర్డ్ క్యాపిటల్ పార్ట్నర్స్ (15 శాతం) కూడా సహా ఓనర్లుగా ఉన్నారు. 2009లో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా 11.7 శాతం వాటా తీసుకున్నాడు. కానీ 2015లో ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన తన వాటాలు అమ్ముకున్నాడు.
6. గుజరాత్ టైటాన్స్ : ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ను లగ్జంబర్గ్ కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్స్ పార్ట్నర్ దక్కించుకుంది. సీవీసీకి ఐపీఎల్ లో ఫ్రాంచైజీతో పాటు యూరోపియన్ ఫుట్బాల్ టోర్నమెంట్లలో ప్రముఖ లీగ్ అయిన లా లిగ లో 11 శాతం వాటాలున్నాయి. వీటితో పాటు రగ్బీ, ఎఫ్1 ఫార్ములా రేసింగ్, వాలీబాల్ కు సంబంధించిన క్రీడల లీగ్ లలో కూడా వీరి హస్తముంది. జీటీకి హార్థిక్ పాండ్యా సారథిగా ఉన్న విషయం తెలిసిందే.
7. లక్నో సూపర్ జెయింట్స్ : గుజరాత్ తో పాటు ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన మరో జట్టు లక్నో.. రూ. 7,090 కోట్ల భారీ బిడ్ వేసి లక్నోను దక్కించుకున్నాడు ఆర్పీఎస్జీ ఓనర్ సంజీవ్ గొయెంకా. పవర్ అండ్ ఎనర్జీ, కార్బన్ బ్లాక్ ఉత్పత్తి, ఎఫ్ఎంసీజీ, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ లలో సంజీవ్ గొయెంకాకు వ్యాపారాలున్నాయి. ఈయన గతంలో 2016-17 సీజన్లలో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ కు కూడా ఓనర్ గా ఉన్నాడు. లక్నోకు కెఎల్ రాహుల్ సారథి.
8. ముంబై ఇండియన్స్ : ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ సారథ్యంలోని ఈ జట్టుకు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఓనర్. భారత్ లో ఇదీ అదీ అని తేడా లేకుండా అన్ని రంగాల్లో పెట్టుబడులు పెడుతున్న సంస్థ రిలయన్స్. అయితే వేలం ప్రక్రియ, ట్రోఫీలు తీసుకునేప్పుడు మాత్రం ముఖేశ్ అంబానీ భార్య నీతూ అంబానీ ఎక్కువగా హాజరవుతారు.
9. చెన్నై సూపర్ కింగ్స్ : ముంబై ఇండియన్స్ మాదిరే ఐపీఎల్ లో విజయవంతమైన జట్టుగా పేరున్న చెన్నై జట్టుకు ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్. శ్రీనివాసన్ యజమాని. అయితే 2015లో ఆ జట్టు పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఆయన చైర్మెన్ పదవి నుంచి వైదొలిగి.. చెన్నై సూపర్ కింగ్స్ లిమిటెడ్ అనే సంస్థ పేరు మీద ఎనిమిది మంది డైరెక్టర్లను నియమించి వాళ్లనే ఆ జట్టుకు ఓనర్లుగా ప్రకటించారు. ఎన్ని చేసినా వాళ్లంతా ఉండేది శ్రీనివాసన్ ఆధ్వర్యంలోనే కావడం గమనార్హం. ఇక 2008 నుంచి కెప్టెన్ గా ఉన్న ధోని.. ఈ సీజన్ లో తప్పుకుని వాటిని జడేజా కు అప్పగించాడు.
10. కోల్కతా నైట్ రైడర్స్ : బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఈ జట్టుకు యజమాని. షారుఖ్ తో పాటు జూహాచావ్లా కూడా సహా యజమాని. కేకేఆర్ జట్టులో రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ (షారుఖ్ ఖాన్ దే) కు 55 శాతం వాటాలుండగా.. మెహతా గ్రూప్ ననకు 45 శాతం వాటా ఉంది. మెహతా గ్రూప్ జూహీ చావ్లా భర్త జై మెహతా ది. ఈ సంస్థ సుగుర్, సిమెంట్స్ వంటి వ్యాపారాల్లో ఉంది. జై మెహతాకు కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) లో ట్రినిడాడ్ నైట్ రైడర్స్ లో వాటా కూడా ఉంది.