IPL 2024 : లక్నో జట్టులో చేరిన కేఎల్ రాహుల్.. ఫిట్‌గా ఉన్నాడు కానీ..
KL Rahul : హైదరాబాద్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో క్వాడ్రైస్‌ప్స్‌కు గాయం కావడంతో వికెట్‌కీపర్-బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆటకు దూరంగా ఉన్నాడు. మళ్లీ ఇప్పుడు ఐపీఎల్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో చేరాడు.
KL Rahul
Lucknow Super Giants: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) ఐపీఎల్ సిరీస్ 22న ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్ లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ సహా మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చెన్నైలో జరగనుంది. ఐపీఎల్ 17 సీజన్ కోసం అన్ని జట్లూ ఇప్పటికే ముమ్మరంగా సిద్ధమవుతున్నాయి. గత కొంత కాలంగా క్రికెట్ కు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ మళ్లీ ఐపీఎల్ 2024తో గ్రౌండ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు.
తొడ గాయం కారణంగా ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ నుంచి సగంలోనే వైదొలిగిన భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ చికిత్స కోసం లండన్ వెళ్లాడు. ఆ తర్వాత ఇప్పుడు ఫిట్‌నెస్‌కు చేరుకుని ఐపీఎల్ తో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్ గా మైదానంలోకి దిగబోతున్నాడని భారత క్రికెట్ బోర్డు (బీసీసీ) అధికారి ఒకరు తెలిపారు. అయితే, ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లలో వికెట్ కీపింగ్‌కు దూరంగా ఉండాలని క్రికెట్ బోర్డు అతనికి సూచించినట్లు సమాచారం. దీంతో కేఎల్ రాహుల్ కొన్ని గేమ్‌లలో మాత్రమే బ్యాటర్‌గా వ్యవహరిస్తాడని సమాచారం.
లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జి) కెప్టెన్ కెఎల్ రాహుల్ రాబోయే 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో పాల్గొనడానికి నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సిఎ) ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో క్వాడ్రైస్‌ప్స్‌కు గాయం కావడంతో వికెట్‌కీపర్-బ్యాటర్ ఆటకు దూరంగా ఉన్నాడు. గాయం తీవ్రం కాకుండా లండన్ లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ తో ఆటను మొదలు పెట్టనున్న కేఎల్ రాహుల్ గురించి ఎన్సీఏ కీలక వివరాలు వెల్లడించింది. అతని ఫిట్‌నెస్ ప్రమాణాలను ఆమోదించినప్పటికీ, రాహుల్ ఇంకా వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టకూడదని పేర్కొంది. దీంతో సారథిగా ఉంటాడు కానీ, కీపింగ్ చేసే అవకాశలు లేవు. దీంతో కీపింగ్ బాధ్యతలు క్వింటన్ డి కాక్ లేదా నికోలస్ పూరన్ లు కీపింగ్ చేసే అవకాశముంది. గత రెండు సీజన్‌లలో పలు సందర్భాల్లో వీరు కీపింగ్ చేశారు.