10 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్‌తో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్... అప్పుడు యువీలా, ఇప్పుడు సూర్య కొడితే...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో సెమీ ఫైనల్ బెర్తులు కన్ఫార్మ్ అయిపోయాయి. గ్రూప్ 1 లో టేబుల్ టాపర్‌గా నిలిచిన న్యూజిలాండ్, గ్రూప్ 2లో రెండో స్థానంలో నిలిచిన పాకిస్తాన్‌తో సెమీ ఫైనల్ 1 ఆడబోతుంటే గ్రూప్ 2 టేబుల్ టాపర్ టీమిండియా, గ్రూప్ 1లో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్‌తో రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది. మరి ఈ జట్ల మధ్య గత మ్యాచుల లెక్కలు ఎలా ఉన్నాయి...
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఇంగ్లాండ్, టీమిండియా కేవలం మూడు సార్లు మాత్రమే తలబడ్డాయి. ఈ మూడు మ్యాచుల్లో టీమిండియా రెండింట్లో గెలవగా ఓ సారి ఇంగ్లాండ్‌ని విజయం వరించింది. 2012 టోర్నీలో చివరిసారిగా ఇంగ్లాండ్‌తో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ఆడిన టీమిండియా, 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ జట్టుతో ఆడనుంది...
Yuvraj Singh
2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా, ఇంగ్లాండ్ మధ్య గ్రూప్ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగుల భారీ స్కోరు చేసింది.. గంభీర్ 58, వీరేంద్ర సెహ్వాగ్ 68 పరుగులు చేయగా యువరాజ్ సింగ్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు...
Yuvraj Singh
స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో ఆరుకి ఆరు సిక్సర్లు బాది యువరాజ్ సింగ్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది ఈ మ్యాచ్‌లోనే! 219 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేయగలిగింది ఇంగ్లాండ్. ఈ విజయంతో సెమీస్ చేరి, 2007లో టీమిండియా టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది...
Dhoni
2009 టీ20 వరల్డ్ కప్‌లోనూ ఇండియా, ఇంగ్లాండ్ గ్రూప్ ఈలో తలబడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 7 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులకి పరిమితమైంది. 3 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకున్న ఇంగ్లాండ్, 2009 టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకి ఒక్క విజయం కూడా దక్కకుండా చేసింది...
Image credit: Getty
2012 టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ ఏలో తలబడ్డాయి ఇండియా, ఇంగ్లాండ్. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. గంభీర్ 45, విరాట్ కోహ్లీ 40 పరుగులు చేసి అవుట్ కాగా రోహిత్ శర్మ 33 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు..
ఈ లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ జట్టు 14.4 ఓవర్లలో 80 పరుగులకే ఆలౌట్ అయ్యింది. హర్భజన్ సింగ్ 4 వికెట్లు తీయగా పియూష్ చావ్లా,ఇర్ఫాన్ పఠాన్ రెండేసి వికెట్లు తీశారు. భారత జట్టు 90 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. ఈ మ్యాచ్ తర్వాత ఇండియా, ఇంగ్లాండ్ జట్లు ఎప్పుడూ టీ20 వరల్డ్ కప్‌లో తలబడలేదు...
Image credit: Getty
పదేళ్ల తర్వాత నవంబర్ 10న ఇంగ్లాండ్, ఇండియా మధ్య ఆడిలైడ్ వేదికగా సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అప్పుడు యువీ చేసిన ఫీట్‌ని ఈసారి సూర్యకుమార్ యాదవ్ క్రియేట్ చేస్తే... టీమిండియా ఫైనల్ చేరడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని అంటున్నారు ఫ్యాన్స్..
PAK vs NZ
మరోవైపు న్యూజిలాండ్‌పై పాకిస్తాన్‌కి తిరుగులేని రికార్డు ఉంది. 2003 వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్‌ని టీమిండియా ఐసీసీ టోర్నీల్లో ఓడించలేకపోయింది. అయితే కివీస్ మాత్రం టీ20 వరల్డ్ కప్‌లో పాక్‌పై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది...
2007 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్ చేతుల్లో ఓడిన న్యూజిలాండ్, 2009, 2012 టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లోనూ గ్రూప్ స్టేజీలో పరాజయం పాలైంది. 2021 టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా చిత్తుగా ఓడితే... పాకిస్తాన్ సునాయాసంగా కివీస్‌ని ఓడించి టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరింది.