ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సూర్య భాయ్ దూకుడు.. శుబ్‌మన్ గిల్, తిలక్ వర్మలకు ప్రమోషన్..
టీమిండియా మిస్టర్ 360 డిగ్రీస్, వన్ ఫార్మాట్ వండర్ సూర్యకుమార్ యాదవ్, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్నాడు. వెస్టిండీస్ టూర్‌లో మొదటి రెండు టీ20ల్లో ఫెయిలైనా మూడు, ఆఖరి టీ20 మ్యాచుల్లో హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన సూర్య, టాప్ ర్యాంకులో మరింత ఎగబాకాడు..

Suryakumar Yadav
మొదటి రెండు టీ20 మ్యాచుల్లో సూర్య భాయ్ ఫెయిల్యూర్‌తో అతని ఐసీసీ టాప్ ర్యాంకు ఎక్కడ జారిపోతుందోనని కంగారు పడ్డారు అభిమానులు. అయితే మూడో టీ20లో 83 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, ఆఖరి టీ20లో 61 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు..
ఈ రెండు పర్ఫామెన్స్‌లతో సూర్యకుమార్ యాదవ్ ర్యాంకింగ్స్ పాయింట్లు 907కు చేరాయి. రెండో స్థానంలో ఉన్న పాక్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 811 పాయింట్లతో ఉంటే బాబర్ ఆజమ్ 756, అయిడిన్ మార్క్‌రమ్ 748, రిలే రసో 724 పాయింట్లతో టాప్ 5లో ఉన్నారు..
సూర్యకుమార్ యాదవ్ తప్ప టీ20 బ్యాటర్ల, బౌలర్ల టాప్ 10 ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్లు ఎవ్వరూ లేరు. నాలుగో టీ20 మ్యాచ్‌లో 77 పరుగులు చేసి, యశస్వి జైస్వాల్‌తో కలిసి 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన శుబ్‌మన్ గిల్, 43 స్థానాలు ఎగబాకి 25వ ర్యాంకులోకి దూసుకొచ్చాడు..
విరాట్ కోహ్లీ 19వ స్థానంలో, రోహిత్ శర్మ 40వ ర్యాంకులో ఉన్నారు. విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో టీ20ల్లో 897 పాయింట్లు సాధించడమే టీమిండియా తరుపున బెస్ట్ ర్యాంకు పాయింట్స్‌గా ఉన్నాయి. ఈ రికార్డును సూర్యకుమార్ యాదవ్ బ్రేక్ చేసేశాడు.
వెస్టిండీస్ టూర్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 46వ స్థానంలో నిలవగా, నాలుగో టీ20లో హాఫ్ సెంచరీ బాదిన యశస్వి జైస్వాల్ 88వ ర్యాంకుతో కెరీర్‌ని ప్రారంభించాడు..
Babar Azam
వన్డే ర్యాంకింగ్స్‌లో మార్పులేమీ జరగలేదు. బాబర్ ఆజమ్ టాప్‌లో కొనసాగుతుంటే భారత యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ టాప్ 5 ర్యాంకును కాపాడుకున్నాడు. విరాట్ కోహ్లీ 9, రోహిత్ శర్మ 11 ర్యాంకుల్లో ఉన్నారు..