ఐపీఎల్ : ముంబై ఇండియన్స్ సీక్రెట్ చెప్పిన సూర్యకుమార్ యాదవ్
Suryakumar Yadav: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యధిక టైటిల్స్ గెలిచిన టీమ్ ముంబై ఇండియన్స్. బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ను కలిగి ఉంటుంది. సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, బుమ్రా, పాండ్యాలతో పాటు పలువురు విదేశీ స్టార్ ప్లేయర్లు ఉన్నారు.

ముంబై ఇండియన్స్ విజయ రహస్యం ఇదే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. తమ స్టార్ ఆటగాళ్లను సంవత్సరాలుగా కలిపి ఉంచడంలో విజయవంతమైన టీమ్. స్థిరమైన కోర్ గ్రూప్ కారణంగా ఐదుసార్లు టైటిల్ గెలుచుకున్న ఈ ఫ్రాంచైజీ, ఐపీఎల్‌లో అత్యంత బలమైన స్థిరంగా ఉన్న జట్టుగా నిలిచింది. రోహిత్ శర్మ, పోలార్డ్, లసిత్ మలింగ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పటికీ, అందరూ ఒకే తాటిపై ముందుకు సాగడం ముంబై ప్రత్యేకత.
అందుకే బిగ్ స్టార్లు ముంబై ఇండియన్స్‌ను వదలడం లేదు !
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవల ఎక్స్‌ప్రెస్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ, ముంబై ఇండియన్స్ జట్టులోని కుటుంబ వాతావరణమే స్టార్ ఆటగాళ్లను ఇక్కడ నిలిపి ఉంచుతుందని తెలిపారు. అందుకే స్టార్ ప్లేయర్లు ముంబై ఇండియన్స్ తో కలిసి ఉండాలని కోరుకుంటారని చెప్పారు.
“మేము డ్రెస్సింగ్ రూమ్‌లో, హోటల్‌లో, ప్రాక్టీస్‌లో.. ఇలా ఎక్కడ ఉన్నా కుటుంబంలా అనిపిస్తుంది. ప్రతి ఆటగాడు ఏ జట్టునైనా నడిపే సామర్థ్యం ఉన్నవారే. కానీ ముంబైలోని వాతావరణం వేరుగా ఉంటుంది. ఆ అనుభూతి జట్టులో ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఇది అన్ని విషయాలకు సిద్ధం చేస్తుంది, క్లిష్ట సమయాల్లో బలాన్నిస్తుంది” అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
2018 నుంచి ముంబైతో సూర్యకుమార్ యాదవ్
2018లో ముంబై ఇండియన్స్‌లో తిరిగి చేరిన సూర్యకుమార్, అప్పటి నుంచి జట్టులో కీలక ప్లేయర్ గా మారారు. ఇప్పటివరకు 111 మ్యాచ్‌ల్లో 3703 పరుగులు సాధించాడు. ఈ సమయంలో ఫ్రాంచైజీ తరఫున టాప్ స్కోరర్ గా నిలిచాడు. తన స్థిరమైన ప్రదర్శనతో జాతీయ జట్టులో చోటు సంపాదించి, ఆ తర్వాత భారత టీ20 కెప్టెన్‌గా ఎదిగాడు. సూర్యకుమార్ తిరిగి వచ్చిన తరువాత ముంబై 2019, 2020ల్లో రెండు ఐపీఎల్ టైటిళ్లు గెలుచుకుంది, ఇంకా రెండు సార్లు ప్లేఆఫ్స్‌కు చేరింది.
2018, 2023, 2025 సీజన్లలో ఆయన వరుసగా 512, 605, 717 పరుగులు సాధించాడు. ముంబై జట్టులో టాప్ లో నిలిచాడు. ఇప్పటివరకు రెండు మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు.
ఐపీఎల్ లో కేకేఆర్ జట్టుకు కూడా ఆడిన సూర్యకుమార్ యాదవ్
ముంబై ఇండియన్స్ కోసం గత కొన్నేళ్లుగా ఆడుతున్నప్పటికీ, సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) తరఫున కూడా ఆడాడు. 2014 సీజన్‌లో జట్టుకు టైటిల్ గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు.
అయితే, 2018 మెగా వేలానికి ముందు కేకేఆర్ కేవలం సునీల్ నరైన్, రస్సెల్‌లను మాత్రమే రిటైన్ చేసి, సూర్యకుమార్‌ను వేలానికి విడుదల చేసింది. దీనికి ముందు ముంబై ఇండియన్స్ తరఫున 2011 నుండి 2013 వరకు ఒకసారి ఐపీఎల్‌లో, రెండు సార్లు ఛాంపియన్స్ లీగ్ టీ20లో ప్రాతినిధ్యం వహించాడు. సూర్య పేరు వేలంలో వచ్చిన వెంటనే ముంబై ₹3.20 కోట్లకు దక్కించుకుంది.
కోల్‌కతా నైట్‌రైడర్స్ పై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్ వైరల్
ఇటీవల ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్యకుమార్ కేకేఆర్ నుంచి తను విడిపోవడం గురించి మాట్లాడారు. ఒక జర్నలిస్ట్ తమను విడిచి వెళ్లినందుకు కేకేఆర్ అభిమానులు బాధపడ్డారని చెప్పాడు. దీనిపై సూర్య చమత్కారంగా స్పందిస్తూ.. “నేను వాళ్లను వదిలి వెళ్లలేదు... వాళ్లే నన్ను వదిలేశారు” అన్నారు. 2014 నుంచి 2017 వరకు కేకేఆర్ తరఫున 60 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ 684 పరుగులు సాధించారు. ఆయన స్ట్రైక్ రేట్ 135.71 కాగా, సగటు 23.58. ఈ సమయంలో ఆయన ఒక హాఫ్ సెంచరీ చేశారు. 60 పరుగులు ఆయన అత్యధిక స్కోరు. అయితే, మళ్లీ ముంబై జట్టులో చేరిన తర్వాత సూర్య పరుగుల వరద పారిస్తున్నాడు.