బీసీసీఐతో తెగదెంపులు.. ఫారెన్ లీగ్ ఆడనున్న రైనా
Suresh Raina: దశాబ్దకాలంపాటు భారత జట్టుకు సేవలందించి మిస్టర్ ఐపీఎల్ గా గుర్తింపు దక్కించుకున్న టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా బీసీసీఐతో తెగదెంపులు చేసుకున్నాడు. త్వరలోనే అతడు ఫారెన్ లీగ్ లో మెరవనున్నాడు.

జాతీయ జట్టుతో పాట ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మెరుపులు మెరిపించి అభిమానులను అలరించిన టీమిండియా మాజీ బ్యాటర్ సురేశ్ రైనా కొద్దిరోజుల క్రితమే దేశవాళీ క్రికెట్ తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు కూడా రిటైర్మెంట్ చెప్పాడు.
గతేడాది ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోకపోవడంతో నిరాశచెందిన రైనా.. ఫారెన్ లీగ్స్ లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. అయితే బీసీసీఐ నిబంధనల ప్రకారం దేశవాళీలో గానీ, జాతీయ జట్టు లేదా ఐపీఎల్ లో ఆడే భారత క్రికెటర్లు ఇతర లీగ్స్ లో ఆడేందుకు అవకాశం లేదు. ఒకవేళ వాళ్లు ఆడాలనుకుంటే మళ్లీ భారత్ తరఫున ఆడనని ‘నో అబ్జెక్షన్ లెటర్’ తీసుకోవాల్సి ఉంటుంది.
2020లో జాతీయ జట్టు నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రైనా.. రెండు నెలల క్రితం దేశవాళీ, ఐపీఎల్ కు కూడా గుడ్ బై చెప్పాడు. అప్పుడే రైనా పారెన్ లీగ్స్ ఆడతాడని అంతా అనుకున్నారు. వారి అంచనాలను నిజం చేస్తూ రైనా తాజాగా అబుదాబి వేదికగా జరిగే టీ10 లీగ్ లో ఆడేందుకు సిద్ధమయ్యాడు.
టీ10 లీగ్ లో రైనా.. డక్కన్ గ్లాడియేటర్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని టీ10 లీగ్ అధికారికంగా తన ట్విటర్ లో ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ ట్వీట్ చేస్తూ.. ‘వరల్డ్ కప్ విన్నర్ సురేశ్ రైనా టీమ్ డెక్కన్ గ్లాడియేటర్స్ తో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. భారత జట్టు గర్వించదగ్గ వైట్ బాల్ ప్లేయర్ అయిన రైనా అబుదాబిలో జరిగే టీ10 లీగ్ లో ఆడే ఆట కోసం మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం..’ అని ట్వీట్ లో పేర్కొంది.
ఇక టీ10 లీగ్ 2017లో ప్రారంభమైంది. ప్రస్తుతం జరుగుతున్న ఎడిషన్ ఆరోవది. ఈ ఏడాది నవంబర్ 23 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 4 వరకు జరిగే ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటాయి.
రైనా ఆడబోయే డెక్కన్ గ్లాడియేటర్స్ జట్టులో విండీస్ స్టార్ ఆటగాళ్లు నికోలస్ పూరన్, ఆండ్రూ రసెల్, ఒడియన్ స్మిత్ లతో పాటు బంగ్లా ఆటగాడు ముజీబ్ ఉర్ రెహ్మాన్ లు ఉన్నారు. ఈ జట్టు ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉంది. రైనా రాకతో ఈ జట్టు మరింత బలోపేతం కానుంది.