- Home
- Sports
- Cricket
- రోహిత్ ఐపీఎల్ నుంచి రెస్ట్ తీసుకుంటే మంచిదన్న గవాస్కర్.. అవసరం లేదంటున్న ముంబై హెడ్‌కోచ్
రోహిత్ ఐపీఎల్ నుంచి రెస్ట్ తీసుకుంటే మంచిదన్న గవాస్కర్.. అవసరం లేదంటున్న ముంబై హెడ్‌కోచ్
WTC Final 2023: టీమిండియా సారథి రోహిత్ శర్మ ఐపీఎల్ నుంచి కొన్నాళ్లు విరామం తీసుకోవాలని, అతడు తక్షణమే ఆ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని సునీల్ గవాస్కర్ అన్నాడు.

Image credit: Mumbai Indians
నేడు 36వ పుట్టినరోజు జరుపుకుంటున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి అతడు రెస్ట్ తీసుకుంటే మంచిదని వ్యాఖ్యానించాడు. కాగా ఈ వ్యాఖ్యలకు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు.
Image credit: PTI
ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టు ఇంగ్లాండ్ లో జూన్ 7 నుంచి 11 వరకు ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ ఆడనుంది. భారత జట్టుకు ఇది చాలా కీలకం. 2013 తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలవలేక తంటాలు పడుతున్న భారత జట్టు ఈ సారి ఎలాగైనా దానిని సాధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నది.
ఈ నేపథ్యంలో సునీల్ గవాస్కర్ స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ.. ‘నేనైతే రోహిత్ కొన్ని రోజులు ప్రస్తుత ఐపీఎల్ నుంచి బ్రేక్ తీసుకుంటే మంచిదని భావిస్తున్నా. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ను దృష్టిలో ఉంచుకుని రోహిత్ రెస్ట్ తీసుకోవడం చాలా కీలకం.
కొన్ని మ్యాచ్ లకు బ్రేక్ తీసుకుని ఆ తర్వాత తిరిగి టీమ్ తో చేరినా పెద్దగా ఇబ్బందిలేదు. ప్రస్తుతం రోహిత్ తన బ్యాటింగ్ తో కాస్త టచ్ లో ఉన్నట్టే కనిపిస్తున్నా అతడు మానసికంగా కూడా డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు సిద్ధమవ్వాలి. రోహిత్ కూడా ఇదే ఆలోచిస్తాడని అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు రెస్ట్ తీసుకుని లాస్ట్ మూడు నాలుగు మ్యాచ్ లు ఆడితే చాలు..’అని చెప్పాడు.
ఈ వ్యాఖ్యలపై ముంబై హెడ్ కోచ్ మార్క్ బౌచర్ స్పందించాడు. బౌచర్ స్పందిస్తూ.. ‘లేదు. అతడు విశ్రాంతి తీసుకుంటానని నన్నైతే అడగలేదు. రోహిత్ మా జట్టులో కీలక ప్లేయర్. మంచి ఆటగాడే గాక మంచి నాయకుడు కూడా.. ఒకవేళ రోహిత్ తనకు బ్రేక్ కావాలని నా దగ్గరకు వచ్చి చెబితే అందులో మరో సందేహం లేకుండా దానికి ఓకే చెబుతాను.
Image credit: Mumbai Indians
టీమ్ మేనేజ్మెంట్ దగ్గర దాని గురించి ప్రస్తావిస్తాను. అయినా ప్రస్తుతానికైతే రోహిత్ అలాంటిదేమీ నన్ను కోరలేదు. రాబోయే మ్యాచ్ లకు అతడు అందుబాటులోనే ఉంటాడు..’అని బౌచర్ కుండబద్దలు కొట్టాడు.
కాగా నేడు ముంబై ఇండియన్స్.. రాజస్తాన్ రాయల్స్ తో వాంఖెడే వేదికగా తలపడనుంది. ఈ మ్యాచ్ రోహిత్ శర్మకు చాలా స్పెషల్. నేడు రోహిత్ పుట్టినరోజు. అంతేగాక కెప్టెన్ గా అతడికి 150వ మ్యాచ్. 2013లో ఏప్రిల్ 24న ముంబై ఇండియన్స్ తరఫున ఫస్ట్ మ్యాచ్ ఆడిన రోహిత్.. కెప్టెన్ గా పదేండ్లు పూర్తి చేసుకున్నాడు.