- Home
- Sports
- Cricket
- Ind Vs SA: నయా వాల్ తో పాటు రహానే మళ్లీ అదే తడబాటు.. ఆ సీనియర్లిద్దరికీ ఇక మద్దతు కష్టమేనా..?
Ind Vs SA: నయా వాల్ తో పాటు రహానే మళ్లీ అదే తడబాటు.. ఆ సీనియర్లిద్దరికీ ఇక మద్దతు కష్టమేనా..?
Pujara and Rahane: టీమిండియా సఫారీ పర్యటనకు ముందే జట్టులోని సీనియర్ ఆటగాళ్లకు ఇదే ఆఖరు అవకాశమని వార్తలు వినిపించాయి. అయినా ఆ ఇద్దరు సీనియర్లు మాత్రం వారి ఆటతీరును మార్చుకోక అదే తడబాటు కొనసాగిస్తూ విమర్శల పాలవుతున్నారు.

టీమిండియా సీనియర్ క్రికెటర్లు అజింక్యా రహానే, నయా వాల్ ఛటేశ్వర్ పుజారా మళ్లీ తడబడ్డారు. జట్టులో యువ ఆటగాళ్లు దూసుకువస్తున్నా.. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతూ టీమ్ లో వారి స్థానానికి ముప్పు ముంచుకొస్తున్నా ఆ ఇద్దరిలో మాత్రం మార్పు లేదు.
గత కొన్నాళ్లుగా వరుసగా విఫలమవుతున్న పుజారా, రహానే లు ఈ సిరీస్ లో అయినా ఫామ్ ను అందుకుంటారని అభిమానులతో పాటు టీమ్ మేనేజ్మెంట్, సెలెక్టర్లు ఆశించారు. కానీ ఆ ఇద్దరు మాత్రం దానిని తప్పని ప్రూవ్ చేస్తున్నారు.
ఇటీవలే దక్షిణాఫ్రికాతో ముగిసిన సెంచూరియన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయి తీవ్ర విమర్శల పాలైన పుజారా తాజాగా రెండో టెస్టులో కూడా అదే విధంగా తడబడ్డాడు.
33 బంతులాడిన పుజారా.. 3 పరుగులే చేసి ఒలివర్ బౌలింగ్ లో బవుమా కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తాజా వైఫల్యంతో కలిపి పుజారా గత పది ఇన్నింగ్సులలో చేసిన స్కోర్లు ఇలా ఉన్నాయి.
3, 0, 47, 0, 22, 26, 61, 4, 91, 1 గా ఉన్న పుజారా అత్యధిక స్కోరు 91. అతడు సెంచరీ చేయక రెండేండ్లు దాటిపోయింది. ఇటీవల స్వదేశంలో ముగిసిన న్యూజిలాండ్ తో సిరీస్ లో అయినా పుజారా ఫామ్ అందుకుంటాడని ఆశించినా అతడు మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.
ఇక రహానేది అదే పరిస్థితి. గత ఏడాది కాలంగా అతడి బ్యాటింగ్ సగటు 19 మాత్రమే. 2021 సీజన్ లో 5 మ్యాచులు ఆడిన రహానే చేసిన పరుగులు 173. ఇందులో అత్యధిక స్కోరు 61.
2021-22 సీజన్ లో 3 మ్యాచులు ఆడిన రహానే 107 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో చేసిన 48 పరుగులు.
తాజాగా.. రెండో టెస్టులో పుజారా ఔటైన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన రహానే.. ఓలివర్ వేసిన మరుసటి బంతికే పీటర్సన్ కు క్యాచ్ ఇచ్చి డకౌటయ్యాడు.
ఇదిలాఉండగా.. వరుస వైఫల్యాలతో ఈ ఇద్దరు వెటరన్స్ కు దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత జట్టులో స్థానం దక్కడం కష్టమే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. సఫారీ సిరీస్ కు కూడా వీళ్లను ఎంపిక చేయరని వార్తలు వినిపించాయి.
కానీ జట్టు యాజమాన్యం, కోచ్ ద్రావిడ్, కెప్టెన్ కోహ్లిలు రహానే, పుజారాకు మద్దతుగా నిలిచారు. ఇదే విషయమై కొద్దిరోజుల క్రితం బీసీసీఐకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. రహానే, పుజారాలతో పాటు ఇషాంత్ శర్మకు కూడా సౌతాఫ్రికా సిరీసే ఆఖరు అవకాశమని, ఇందులో విఫలమైతే ఇక వాళ్లకు అవకాశాలు రావడం గగనమే అని చెప్పకనే చెప్పాడు. ఇన్ని హెచ్చరికలున్నా ఈ సీనియర్ ఆటగాళ్ల ఆటలో మాత్రం మార్పు రావడం లేదంటున్నారు టీమిండియా అభిమానులు.