టీమిండియా కొత్త చరిత్ర సృష్టించబోతోంది : మాజీ హెడ్‌కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా విజయం ఖాయమని.. ఆఖరి రోజు భారత జట్టు కొత్త చరిత్ర సృష్టించబోతున్నదని మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఓవల్ వేదికగా జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో టీమిండియా ఎదుట ఆస్ట్రేలియా 444 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి ఇండియా స్కోరు 164-3గా ఉంది. క్రీజులో విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే ఉన్నారు. భారత విజయానికి నేడు 280 పరుగులు అవసరం కాగా ఆసీస్ గెలుపునకు 7 వికెట్లు కావాలి.
ఎలా చూసినా ఈ మ్యాచ్ లో ఫలితం తేలడం అయితే పక్కాగానే ఉంది. అయితే అది ఎవరి వైపు నిలుస్తుందోనన్నదే ఆసక్తికరం. క్రీజులో ఛేదనలో మొనగాడు కోహ్లీ, మిడిలార్డర్ ఆపద్బాంధవుడు అజింక్యా రహానే ఉండటంతో పాటు జడేజా, శార్దూల్ ఠాకూర్, కెఎస్ భరత్ లు తలా ఓ చేయి వేస్తే అదేం పెద్ద టార్గెట్ కాదని టీమిండియా ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇదే క్రమంలో పిచ్ కూడా రాను రాను స్లో అవుతుండటం భారత్ కు కలిసొచ్చేదే. కానీ కోహ్లీ-రహానేలలో ఏ ఒక్కరు నిష్క్రమించినా కథ మరోలా ఉంటుంది. వికెట్లు పడితే మనోళ్లు తడబడే అవకాశాలూ లేకపోలేదు. అయితే ఆఖరి రోజు టీమిండియా విజయంపై అనుమానాలే అక్కర్లేదని.. భారత జట్టు కొత్తచరిత్ర సృష్టించబోతున్నదని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత కోహ్లీ మాట్లాడుతూ.. ‘ఆట ఆఖరి రోజు 280 పరుగులు చేయడం అసాధ్యమైతే కాదు. కాస్త కష్టపడితే అది ఛేదించొచ్చు. ఈ మ్యాచ్ లో మనం కొత్త రికార్డులను చూడబోతున్నాం. ఛేదనలో ప్రపంచ రికార్డు బ్రేక్ చేస్తామని చెప్పడంలో నాకు అనుమానమే లేదు..
ఫలితం గురించి పెద్దగా ఆందోళన చెందకుండా ఫస్ట్ సెషనల్ లో వికెట్లను కాపాడుకుంటే చాలు. ఎందుకంటే గత రెండురోజులుగా పిచ్ ను చూస్తే మీకు అసలు విషయం అర్థమవుతుంది. తొలి సెషనల్ లో కాస్త బౌలర్లకు అనుకూలించే పిచ్ తర్వాత నెమ్మదిస్తున్నది. తర్వాత బ్యాటర్లకు అనుకూలంగా మారుతున్నది...’ అని తెలిపాడు.
కాగా ఆట నాలుగో రోజు రోహిత్, పుజారాలు అనవసర షాట్లు ఆడి పెవిలియన్ కు చేరారని శాస్త్రి అన్నాడు. 47 బంతుల్లో 27 పరుగులు చేసిన పుజారా కమిన్స్ బౌలింగ్ లో కీపర్ అలెక్స్ కేరీకి క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. మంచి టచ్ లో ఉన్న రోహిత్.. నాథన్ లియాన్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు.