- Home
- Sports
- Cricket
- కపిల్ దేవ్ కోసం వెతుకులాట ఆపండి.. అది కష్టం.. ఉన్నవాళ్లతో...! బీసీసీఐకి గంభీర్ కీలక సూచన
కపిల్ దేవ్ కోసం వెతుకులాట ఆపండి.. అది కష్టం.. ఉన్నవాళ్లతో...! బీసీసీఐకి గంభీర్ కీలక సూచన
టీమిండియాను ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్య నిఖార్సైన ఆల్ రౌండర్. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి జట్లు వరుస విజయాలు సాధించడం వెనుక ఉన్న కీ పాయింట్ అదే.. కానీ మనకు మాత్రం...

భారత జట్టును దశాబ్దాలుగా వేధిస్తున్న సమస్య ఆల్ రౌండర్. కపిల్ దేవ్ వంటి నిఖార్సైన ఆల్ రౌండర్లు ఉంటే ప్రపంచకప్ టోర్నీలలో మన జట్టు ప్రదర్శన మరో విధంగా ఉండేదని గతంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వంటి వాళ్లు కూడా వ్యాఖ్యానించారు.
కపిల్ దేవ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాక ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి పలువురు క్రికెటర్లు వచ్చినా వాళ్లను పూర్తి స్థాయి ఆల్ రౌండర్లు అనడానికి లేదు. ఆ దిశగా రాబిన్ సింగ్, యువరాజ్ సింగ్ వంటి ఆటగాళ్లు కొంత ప్రయత్నించి సఫలమయ్యారు.
ఇక కొద్దికాలం క్రితం టీమిండియాకు హార్ధిక్ పాండ్యా రూపంలో ఓ ఆల్ రౌండర్ దొరికినట్టే కనిపించాడు. కానీ ఏడాదిన్నర క్రితం వెన్ను నొప్పి గాయంతో అతడు ఇప్పుడు ఏకంగా జట్టుకే దూరమయ్యాడు. పాండ్యా తిరిగి భారత జట్టులోకి వచ్చేది రానిది డౌటే..?
దీంతో భారత్ వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లను ఆల్ రౌండర్లు గా తయారుచేసేందుకు అష్టకష్టాలు పడుతున్నది.
ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కపిల్ దేశ్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వెతకడం మాని ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు.
గంభీర్ మాట్లాడుతూ... ‘మీ దగ్గర లేనిదాని కోసం పాకులాడకండి. ఆ నిజాన్ని అంగీకరించి మీరు ముందుకెళ్లాలి. తదుపరి కపిల్ దేవ్ ను వెతికే పని నుంచి భారత్ విరామం తీసుకోవాలి. మీరు సృష్టించలేనిదాన్ని సృష్టించడానికి ప్రయత్నించొద్దు.. సమస్య అంతా అక్కడే ఉంది.
అంతర్జాతీయ స్థాయిలో క్రికెటర్లు తమ ప్రదర్శనను బహిర్గతం చేయడానికి. అక్కడ తీర్చిదిద్దడానికి కాదు. ఒక క్రికెటర్ ను తయారుచచేయడం అనేది రంజీ లేదా భారత్-ఏ స్థాయిలో జరగాలి. అక్కడే అన్ని మెలుకువలు నేర్చుకుని జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించినపపుడు అక్కడ బాగా పర్ఫార్మ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి..
రంజీ స్థాయిలోనే ఆటగాళ్లను తీర్చిదిద్ది వాళ్లతోనే కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం. నిజంగా చెప్పాలంటే ప్రస్తుత భారత జట్టులో కపిల్ దేవ్ లేడు. కాబట్టి ముందుకు సాగండి. రంజీలలో అలాంటి క్రికెటర్లను తీర్చిదిద్దడానికి కృషి చేయండి.
వాళ్లు సిద్ధమైన తర్వాత వారిని జాతీయ జట్టుకు చేర్చి వాళ్లకు వరుసగా అవకాశాలను ఇవ్వండి. విజయ్ శంకర్, శివమ్ దూబే, వెంకటేశ్ అయ్యర్ వంటి చాలా మంది కుర్రాళ్లు అలా వచ్చినోళ్లే..’ అని గంభీర్ తెలిపాడు.