- Home
- Sports
- Cricket
- Umran Malik: నాకు నేనే పోటీ.. నాతో నాకే పోటీ.. అది నాకు సహజంగా వచ్చింది.. కశ్మీరి కుర్రాడి ఆసక్తికర వ్యాఖ్యలు
Umran Malik: నాకు నేనే పోటీ.. నాతో నాకే పోటీ.. అది నాకు సహజంగా వచ్చింది.. కశ్మీరి కుర్రాడి ఆసక్తికర వ్యాఖ్యలు
TATA IPL 2022: ఐపీఎల్ లో ప్రతిసారి ఓ కొత్త ఆటగాడిని భారత జట్టులో చూస్తాం. ఈసారి ఆ జాబితాలో వినిపిస్తున్న తొలిపేరు సన్ రైజర్స్ హైదరాబాద్ స్పీడ్ గన్ ఉమ్రాన్ మాలిక్. తాజాగా ఈ కుర్రాడు తన బౌలింగ్, వస్తున్న ప్రశంసల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్-15 సీజన్ లో బ్రేకుల్లేకుండా దూసుకుపోతున్నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్. మ్యాచ్ మ్యాచ్ కూ రాటుదేలుతున్న ఈ కాశ్మీరి కుర్రాడు.. త్వరలోనే భారత జట్టుకు ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వేగాన్ని నమ్ముకున్న ఉమ్రాన్.. నిలకడగా 145-150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతూ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు.
కాగా ఐపీఎల్ లో అదరగొట్టే ప్రదర్శనలతో ఉమ్రాన్ పై ప్రశంసల జల్లు కురుస్తున్నది. తనపై వస్తున్న ప్రశంసలు, అంచనాల నేపథ్యంలో ఉమ్రాన్ స్పందించాడు. వేగం తనకు సహజంగా వచ్చిందని, తనకు తానే రోల్ మోడల్ అని చెప్పుకొచ్చాడు.
తాజాగా అతడు ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడుతూ.. ‘వేగం నాకు సహజంగా వచ్చింది. సాధారణంగానే నేను బంతిని ఫాస్ట్ గా విసురుతాను. నాకెవరూ రోల్ మోడల్స్ లేరు. నాకు నేనే రోల్ మోడల్. భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆయన నుంచి చాలా నేర్చుకున్నాం.
అంతకుముందు నేను బంతులు వేగంగా విసిరేవాడిని తప్ప లెంగ్త్ సరిగా ఉండకపోయేది. కానీ ఇర్ఫాన్ మాకు పలు మెళుకువలు నేర్పించాడు. బంతిని సరైన చోట ఎలా వేయాలో ఇర్ఫాన్ దగ్గరే నేర్చుకున్నా..’ అని అన్నాడు.
ఇక తన గురించి వస్తున్న ప్రశంసలు, పలువురు ట్వీట్ల ద్వారా ఉమ్రాన్ ప్రదర్శనకు అభిమానులుగా మారడంపై కూడా ఉమ్రాన్ స్పందించాడు. ‘నేను భాగా ఆడాలి. చాలా మంది నా గురించి ట్వీట్స్ చేస్తుండటం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. అది గర్వించదగ్గ సందర్భం.
ఆటలో లెజెండ్స్ అయిన చాలా మంది నా బౌలింగ్ ను మెచ్చుకుంటున్నారంటే వాళ్లు నాలో ఏదో టాలెంట్ చూసే ఉంటారు కదా. నా వరకు నాకు జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీలు ప్రపంచంలో ఇప్పుడు ఉత్తమ బౌలర్లు’ అని చెప్పుకొచ్చాడు.
తాను బాగా ఆడి జమ్మూ కాశ్మీర్ కు, ఇండియాను గర్వపడేలా చేయడమొక్కటే తన లక్ష్యమని, ఆ దిశగా తాను కృషి చేస్తున్నానని ఈ యంగ్ గన్ స్పష్టం చేశాడు.
ఉమ్రాన్ బౌలింగ్ చూసి రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, మైఖేల్ వాన్, కెవిన్ పీటర్సన్ వంటి క్రికెట్ దిగ్గజాలే గాక శశి థరూర్, కేటీఆర్ వంటి రాజకీయ నాయకులు కూడా ప్రశంసలు కురిపించడం గమనార్హం.