బీసీసీఐ కొత్త అధ్యక్షుడి ఎంపికపై స్పందించిన గంగూలీ.. ఏం చెప్పాడంటే...!
Sourav Ganguly - Roger Binny: మూడేండ్ల పాటు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ ఇప్పుడు మాజీ అయ్యాడు. అతడి స్థానంలో రోజర్ బిన్నీ వచ్చాడు. ఈ నేపథ్యంలో దాదా స్పందించాడు.

ముంబై వేదికగా ముగిసిన బీసీసీఐ 91వ సాధారణ వార్షిక సమావేశం (ఏజీఎం) లో కొత్త అధ్యక్షుడితో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. మిగతా విషయాలు పక్కనబెడితే అందరి దృష్టిని ఆకర్షించిన అంశం అధ్యక్ష పదవి. సుప్రీంకోర్టులో బీసీసీఐ రాజ్యాంగ సవరణలను ఆమోదించుకున్నా.. గంగూలీకి చివరికి నిరాశే మిగిలింది.
దేవుడు కరుణించినా పూజారి వరమివ్వలేదు అన్న చందంగా తాను రెండోసారి బీసీసీఐ అధ్యక్షుడవడానికి సుప్రీంకోర్టు అనుమతించినా బీసీసీఐ రాజకీయాలతో దాదా బలయ్యాడు. దీంతో వెళ్లడానికి ఇష్టం లేకున్నా బలవంతంగానే గంగూలీ బీసీసీఐని వీడుతున్నాడు. అయితే కొత్త అధ్యక్షుడి ఎంపికపై దాదా ఏం చెబుతాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన వేళ అతడు స్పందించాడు.
రోజర్ బిన్నీ ఎంపికపై దాదా మాట్లాడుతూ.. ‘కొత్త అధ్యక్షుడిగా ఎంపికైన బిన్నీకి శుభాకాంక్షలు. బిన్నీతో పాటు కొత్త పాలకవర్గానికి ఆల్ ది బెస్ట్. గత కొంతకాలంగా జైత్రయాత్ర సాగిస్తున్న టీమిండియా, బీసీసీఐ ప్రయాణం ఇలాగే సాగిపోయే దిశగా వాళ్లు కృషి చేయాలి. బీసీసీఐ సమర్థులైన నాయకుల చేతిలో ఉంది. రాబోయే కాలంలో భారత క్రికెట్ మరింత స్ట్రాంగ్ గా తయారవుతుంది..’ అని తెలిపాడు.
ముంబైలో ముగిసిన ఏజీఎంలో పాల్గొన్న దాదా పైవిధంగా స్పందించడం గమనార్హం. అయితే బీసీసీఐ అధ్యక్ష పీఠం దక్కకున్నా తనకు ఐసీసీకి అయినా పంపించాలని దాదా పెట్టుకున్న వినతిని ‘బీసీసీఐ పెద్దలు’ అంతగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. నేటి సమావేశంలో అసలు ఈ విషయమే చర్చలోకి రాలేదని తెలుస్తున్నది.
ఇదిలాఉండగా తనకు బీసీసీఐ అగ్రస్థానం దక్కకున్నా తిరిగి బోర్డులో చక్రం తిప్పేందుకు దాదా మాస్టర్ ప్లాన్ వేశాడు. గతంలో ఐదేండ్ల పాటు అధ్యక్షుడిగా పని చేసిన బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసేందుకు దాదా సన్నద్ధమవుతున్నాడు. ఇందుకు సంబంధించి.. ఈనెల 22న నామినేషన్ కూడా వేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.