- Home
- Sports
- Cricket
- కోహ్లీ నోబాల్ వివాదంపై అక్తర్ ట్వీట్.. భారత్‌కు అనుకూలంగా వ్యవహరించారంటూ అంపైర్లపై సెటైర్లు
కోహ్లీ నోబాల్ వివాదంపై అక్తర్ ట్వీట్.. భారత్‌కు అనుకూలంగా వ్యవహరించారంటూ అంపైర్లపై సెటైర్లు
IND vs PAK: ఇండియా-పాకిస్తాన్ మధ్య ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా ముగిసిన హైఓల్టేజీ మ్యాచ్ లో భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో ఆఖరి ఓవర్లో జరిగిన డ్రామా అంతా ఇంతా కాదు.

మెల్‌బోర్న్ లో 90వేల ప్రేక్షకుల నడుమ ఆదివారం ముగిసిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లో ఛేదనలో మొనగాడు విరాట్ కోహ్లీ మెరుపులతో భారత జట్టు చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇన్నింగ్స్ చివరివరకూ క్రీజులో ఉన్న కోహ్లీ.. కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
అయితే భారత ఇన్నింగ్స్ చివరి ఓవర్లో మహ్మద్ నవాజ్ వేసిన నాలుగో బంతిపై వివాదం చెలరేగింది. అది హైట్ నోబాల్ అని కోహ్లీ అంపైర్లను కోరగా.. నిర్ణయం భారత్ కు అనుకూలంగా వచ్చింది. దీంతో భారత్ ఛేదనలో ఎక్స్ట్రా బాల్ వచ్చేసరికి విజయం సులువైంది.
ఇదిలాఉండగా ఇది నోబాల్ అని కోహ్లీ కోరగా అంపైర్లు దానికి ఒప్పుకున్నారు. పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ ఇతర ఆటగాళ్లు దానిని వారించినా నడుము కంటే ఎత్తుగా రావడంతో అది హైట్ నోబాల్ అని అంపైర్లు వాళ్లకు సర్ది చెప్పారు. ఈ బంతికి కోహ్లీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాత బంతి వికెట్లకు తాకినా కోహ్లీ 3 పరుగులు తీశాడు. కానీ నోబాల్ తర్వాత బాల్ ఎలాగూ ఫ్రీహిట్ గనక వికెట్లు పడ్డా ఔట్ గా ప్రకటించరు.
ఇక నోబాల్ వివాదంపై తాజాగా పాకిస్తాన్ మాజీ పేసర్ షోయభ్ అక్తర్ అంపైర్లను టార్గెట్ గా చేసుకుని ఓ ట్వీట్ చేశాడు. ‘అంపైర్ భయ్యో.. మీ ఆలోచనలకు ఓ నమస్కారం.. ఈ ఆలోచనలతో ఈ రాత్రికి మీకు భోజనం పక్కా..’ అని నోబాల్ కు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ రాసుకొచ్చాడు.
అక్తర్ తో పాటు పాకిస్తాన్ ఫ్యాన్స్ కూడా అంపైర్ల నిర్ణయానికి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. అంపైర్లు భారత్ కు అనుకూలంగా వ్యవహరించారని.. బీసీసీఐ ఐసీసీని కంట్రోల్ చేయడం వల్లే వారికి అనుకూలంగా నిర్ణయాలు వచ్చాయని వాపోతున్నారు.
దీనికి ఇండియా ఫ్యాన్స్ కూడా కౌంటర్లు ఇస్తున్నారు. నడుము కంటే ఎత్తుగా వచ్చిన బంతిని ఎక్కడైనా నోబాల్ అనే అంటారని.. నోబాల్ తర్వాత ఫ్రీహిట్ కు రనౌట్ తప్ప క్యాచ్, బౌల్డ్ ఉండదని పాకిస్తాన్ క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ కు తెలియదా..? అని కౌంటర్ ఇస్తున్నారు.