వాళ్లు షమీ కంటే గొప్ప బౌలర్లా..? టీ20లలో అతడిని ఎందుకు ఆడించట్లేదు..? : దిగ్గజ క్రికెటర్ ఆగ్రహం
Mohammed Shami: టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ ప్రస్తుతం ప్రపంచపు అత్యుత్తమ బౌలర్లలో ఒకడని.. అటువంటి బౌలర్ ను టీ20లలో పక్కనబెట్టడమేమిటని భారత క్రికెట్ దిగ్గజం మదన్ లాల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
భారత వెటరన్ పేసర్ మహ్మద్ షమీని టీ20లలో ఆడించకపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్, 1983 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడు మదన్ లాల్ సెలక్టర్ల పై ప్రశ్నల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో షమీ.. అత్యుత్తమ బౌలర్లలో ఒకడని, ఈ ఫార్మాట్ లో పరుగులు నియంత్రించేవారికంటే వికెట్లు తీసే బౌలర్లు భారత జట్టుకు అవసరమని అన్నాడు.
మదన్ లాల్ మాట్లాడుతూ.. ‘త్వరలో ఆస్ట్రేలియా వేదికగా జరుగబోయే టీ20 ప్రపంచకప్ జట్టులో షమీ తప్పకుండా ఉండాలి. బుమ్రా తర్వాత అతడు టీమిండియాకు ఉన్న నాణ్యమైన బౌలర్. టీ20 అంటేనే బ్యాటర్లకు అనుకూలంగా ఉండేది. ఈ ఫార్మాట్ లో బ్యాటర్లు వీరవిహారం చేస్తారు. వారిని పరుగులు చేయకుండా అడ్డుకునే బౌలర్లతో ఇక్కడ పెద్దగా ఉపయోగం లేదు.
సదరు బ్యాటర్లను సమర్థవంతంగా అడ్డుకుని వికెట్లు తీసే బౌలర్లు కావాలి. ఆ సత్తా షమీలో పుష్కలంగా ఉంది. రాబోయే ప్రపంచకప్ లో షమీని జట్టులోకి తీసుకోకుంటే సెలక్టర్లు పెద్ద తప్పు చేసినట్టే. ఆస్ట్రేలియా పిచ్ లపై షమీకి మంచి రికార్డు ఉంది. అక్కడ పిచ్ లు ఎలా స్పందిస్తాయో అతడికి అవగాహన ఉంది.
అసలు షమీని టీ20లలో ఎందుకు ఆడించడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. ప్రస్తుతం జట్టులో ఉన్న బౌలర్లు షమీ కంటే గొప్పగా బౌలింగ్ చేస్తారా..? ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో షమీ ఒకడన్న విషయాన్ని మరిచిపోరాదు..’ అని మదన్ లాల్ అన్నాడు.
గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత షమీ మళ్లీ టీ20 జట్టులో చోటు దక్కించుకోలేదు. టెస్టులు, వన్డేలలో తప్పకుండా ఉంటున్న షమీ.. టీ20లలో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు. రెండు నెలల క్రితం ముగిసిన ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతూ 16 మ్యాచ్ లలో 20 వికెట్లు తీసినా షమీకి మాత్రం జాతీయ జట్టులో చోటు దక్కలేదు.
ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ - 2022లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా గాయపడటంతో షమీకి అవకాశం దక్కుతుందని అంతా భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం అసలు ఆ ఆప్షనే పెట్టుకోలేదు. భువనేశ్వర్ కు జతగా అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్, దీపక్ చాహర్ లను ఎంపిక చేశారు.
రాబోయే టీ20 ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని జట్టును ఎంపికచేస్తున్న సెలక్టర్లు ఇప్పటికే షమీని ఆ జాబితాను తీసేశామని ఎప్పుడో సిగ్నల్ ఇచ్చారు. మరి షమీని టీ20 ప్రపంచకప్ లో తీసుకుంటారా..? లేదా..? అనేది సెప్టెంబర్ 15 తర్వాత తేలనుంది. ప్రపంచకప్ కోసం జట్టును ఎంపిక చేసేందుకు గాను సెలక్టర్లు వచ్చే నెల 15న సమావేశం కానున్నారు.