ఏడాదిలో ఏడు ఓపెనింగ్ జంటలు.. ప్రపంచకప్ కు సన్నద్ధమయ్యే పద్ధతి ఇదేనా..?
Team India Opening Pairs: భారత జట్టులో గత కొంతకాలంగా గాయాలు, కరోనా, ఫిట్నెస్ కారణంగా ఓపెనింగ్ కు ఎవరు వస్తున్నారో.. ఎవరు ఏ ఏ స్థానంలో బ్యాటింగ్ కు దిగుతున్నారో గందరగోళంగా ఉంది.

సచిన్ టెండూల్కర్-గంగూలీ.. వీరేంద్ర సెహ్వాగ్-సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్-రోహిత్ శర్మ వంటి ప్రపంచ అగ్రశ్రేణి ఓపెనింగ్ జోడిలను అందించిన భారత జట్టు ఏడాది కాలంగా నిఖార్సైన, గాయాలు లేని, ఫిట్నెస్ కాపాడుకునే ఓపెనర్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది.
ధావన్ ఫామ్ కోల్పోయి జట్టులో స్థానం కోల్పోయాక రోహిత్ తో కెఎల్ రాహుల్ కొన్నాళ్ల పాటు ఓపెనర్ గా కొనసాగాడు. కానీ ఇటీవల కాలంలో అతడు కూడా గాయాల బారిన పడుతూ జట్టులోకి వస్తూ పోతూ ఉండటం వల్ల నిలకడ లోపించింది.
దీంతో ఈ ఏడాది కాలంలో టీ20 ఫార్మాట్ లో భారత జట్టు ఏకంగా ఏడు ఓపెనింగ్ జోడీలను మార్చింది. అసలే అక్టోబర్ నుంచి టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో టీమిండియా ఇప్పటికీ ఓపెనింగ్ లోటును పూడ్చుకోలేదు. సిరీస్ కు ఒకరు.. కాదు కాదు మ్యాచ్ కు ఒకరు చొప్పున ఓపెనర్లను మార్చుతూనే ఉంది.
టీ20 ఫార్మాట్ లో గడిచిన ఏడాదికాలంగా చూస్తే.. కెఎల్ రాహుల్-రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్-ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ-ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్-ఇషాన్ కిషన్, సంజూ శాంసన్-రోహిత్ శర్మ, దీపక్ హుడా-ఇషాన్ కిషన్, ఇషాన్ కిషన్-సంజూ శాంసన్ లు మారారు.
పనిభారం, గాయాలు, ఫిట్నెస్ లేమి కారణంగా ఓపెనర్లలో ఎవరో ఒకరు అందుబాటులో లేకపోవడంతో జట్టు మేనేజ్మెంట్ కు వేరే ఆప్షన్ లేకుండా ఎవర్ని పడితే వారిని ఓపెనింగ్ కు పంపుతున్నది.
బ్యాటింగ్ చేసే జట్టుకు ఓపెనర్లు చాలా కీలకం. వాళ్లు కుదురుకుని నిలకడగా రాణిస్తేనే తర్వాత వచ్చే బ్యాటర్ల మీద ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా టీ20లలో తొలి పవర్ ప్లేలో ఓపెనర్లే కీలకం. వారు ధాటిగా ఆడి ప్రత్యర్థి మీద పై చేయి సాధిస్తేనే తర్వాత వచ్చేవాళ్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలుగుతారు.
కానీ ప్రస్తుతం భారత జట్టు పరిస్థితి చూస్తుంటే నిలకడగా ఆడే ఓపెనర్లే కనిపించడం లేదు. రోహిత్ శర్మ ఓ సిరీస్ ఆడుతూ మరో సిరీస్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు. కెఎల్ రాహుల్ గాయాలతో సావాసం చేస్తున్నాడు.
ఇషాన్ కిషన్ అడపా దడపా రాణిస్తున్నా అతడు టీ20 ప్రపంచకప్ జట్టులో ఉంటాడా..? ఉండడా..? అన్నది అనుమానమే. రుతురాజ్, శాంసన్ ల పరిస్థితీ అంతే. మరి టీమిండియాకు నిఖార్సైన ఓపెనింగ్ జోడీ వచ్చేదెప్పు..? దీనికి సెలక్లర్లే సమాధానం చెప్పాలి.