- Home
- Sports
- Cricket
- ద్రావిడ్ వచ్చినా రాలేదు, రోహిత్ కెప్టెన్ అయినా కావట్లేదు... టీమిండియా, ఐసీసీ టైటిల్ గెలవాలంటే ఏం చేయాలి...
ద్రావిడ్ వచ్చినా రాలేదు, రోహిత్ కెప్టెన్ అయినా కావట్లేదు... టీమిండియా, ఐసీసీ టైటిల్ గెలవాలంటే ఏం చేయాలి...
2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేకపోయింది టీమిండియా. ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్లు మారినా ఐసీసీ కల మాత్రం నెరవేరడం లేదు. భారీ అంచనాలతో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మొదలెట్టిన భారత జట్టు, వరుసగా రెండోసారి రన్నరప్‌గానే నిలిచింది..

Rohit and Pujara
ఐపీఎల్ ట్రాక్ రికార్డుతో టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ, ఈ మ్యాచ్‌కి ముందు 8 ఫైనల్స్ ఆడితే ఒక్కదాంట్లో కూడా ఓడిపోలేదు. కెప్టెన్‌గా రోహిత్‌కి ఫైనల్స్ ఉన్న ట్రాక్ రికార్డు చూసి, టీమిండియా ఈసారి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ నెగ్గడం గ్యారెంటీ అనుకున్నారంతా..
అదీకాకుండా ఐపీఎల్ 2023 సీజన్‌లో శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ పరుగుల వర్షం కురిపించారు. శుబ్‌మన్ గిల్, వరుసగా 3 సెంచరీలు బాది 890 పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేశాడు. అయితే ఇంగ్లాండ్‌లో మరోసారి అట్టర్ ఫ్లాప్ అయ్యి, రెండు సీజన్లలో కలిపి 31 పరుగులే చేశాడు..
IND vs AUS
రెండో ఇన్నింగ్స్‌లో కామెరూన్ గ్రీన్ పట్టిన క్యాచ్‌పై వివాదం రేగినా, ఆ షాట్ ఆడడం ముమ్మాటికీ తప్పే. శుబ్‌మన్ గిల్ నాటౌట్‌గా నిలిచి ఉంటే ఎంత స్కోరు చేసేవాడో తెలీదు కానీ ఇంగ్లాండ్‌లో మనోడి రికార్డు మాత్రం అస్సలు బాలేదు..
ఐపీఎల్‌లో వరుసగా రెండు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ కూడా మరోసారి టీమ్‌కి అవసరం అయినప్పుడు చేతులు ఎత్తేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, రెండో ఇన్నింగ్స్‌లో 49 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచినా... రాంగ్ టైమ్‌లో అవుటయ్యి టీమ్‌ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేశాడు..
Australia v India
ఇంతకుముందు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమ్, ఐసీసీ టోర్నీల్లో ఫెయిల్ అయిన ప్రతీసారీ... ఐపీఎల్‌లో ఐదు టైటిల్స్ నెగ్గిన రోహిత్ శర్మకు కెప్టెన్సీ అప్పగించాలని డిమాండ్ వినిపించేది. ఇప్పుడు రోహిత్ శర్మనే కెప్టెన్...
రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా ఉన్నప్పుడు టీమిండియా ఓడిన ప్రతీసారీ తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొనేవాడు. రవిశాస్త్రిని తప్పించి, రాహుల్ ద్రావిడ్‌కి కోచ్ బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్ వినిపించేది. ఇప్పుడు రాహుల్ ద్రావిడే టీమిండియా హెడ్ కోచ్...
కెప్టెన్ మారినా, హెడ్ కోచ్ మారినా టీమిండియా రాత మారడం మారలేదు. ప్రతీసారీ టీమిండియా, ఐసీసీ టోర్నీల్లో ఫెయిల్ అయినప్పుడు ఐపీఎల్‌పైన విమర్శలు వస్తాయి. ఈసారి వస్తున్నాయి..
మనోళ్లు ఐపీఎల్‌కి ఇచ్చిన ప్రాధాన్యం, ఐసీసీ టోర్నీలకు ఇవ్వడం లేదన్నది ఎవ్వరూ కాదనలేని నిజం. ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్ మ్యాచులు ఓడిపోతే మొహం వాడిపోయి, ఏడ్చేసే విరాట్ కోహ్లీ... ఐసీసీ టోర్నీల్లో టీమిండియా విఫలమైనప్పుడు పెద్దగా బాధపడడం కనిపించడం లేదు..
అలాగే ఐపీఎల్ 2023 సీజన్‌లో అదరగొట్టిన మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా అండ్ కో... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో నూరు శాతం అయితే పర్ఫామెన్స్ ఇవ్వలేదు. కారణం మనీ మాత్రమేనా...
ఐపీఎల్ వచ్చాక ప్లేయర్లలో దేశం తరుపున ఆడాలనే కసి తగ్గిపోవడమే దీనికి కారణమా. లేక ఐపీఎల్ కారణంగా విదేశీ ప్లేయర్లతో స్నేహం పెరిగి, వారి చేతుల్లో ఓడిపోయినా గెలుపోటములు సహజం అని సర్దుకుపోతున్నారా...
ఇక్కడ టీమిండియాకి కానీ, బీసీసీఐకి కానీ ఇప్పుడొచ్చిన నష్టం ఏమీ లేదు... నష్టపోయింది ఎవరైనా ఉంటే... మనవాళ్లు గెలుస్తారు? మన పరువు నిలబెడతారని తెగ ఎమోషనల్ అయిపోయి, చదువు, పనులు, కెరీర్ పక్కనబెట్టి రాత్రిదాకా మ్యాచ్ చూసిన టీమిండియా ప్రేక్షకులు మాత్రమే.