9 నెలలు కోలువకడం కష్టమే..! మరి వన్డే ప్రపంచకప్ వరకైనా పంత్ వస్తాడా..?
Rishabh Pant: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ప్రమాదంపై బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. ప్రస్తుతం అతడు ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.
గత శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన భారత జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గాయమైనప్పట్నుంచీ డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందిన పంత్ కు మెరుగైన చికిత్స కోసం బీసీసీఐ.. ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ ద్వారా బుధవారం ముంబైకి తరలించింది.
ప్రముఖ వైద్యుడు దిన్షా పరదివాలా నేతృత్వంలోని వైద్య బృందం పంత్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నది. మోకాలికి శస్త్రచికిత్స చేసిన తర్వాత పంత్ ను లండన్ కు పంపనున్నట్టు సమాచారం.
లండన్ లో అతడికి రెండు సార్లు మోకాలి, చీలమండ కు రెండు సార్లు సర్జరీ చేయాల్సి ఉంటుందని.. ఇదే జరిగితే అతడు సుమారు 9 నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉండాల్సిందేనని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. అప్పటివరకు కూడా అతడు పూర్తిస్థాయిలో కోలుకుంటాడా..? లేదా..? అన్నది అనుమానమే.
ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘డెహ్రాడూన్ లో పంత్ ను చూడటానికి ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. దీంతో అతడికి విశ్రాంతి ఉండటం లేదు. మెరుగైన చికిత్స కోసం రిషభ్ ను ముంబైకి మార్చాం. ఇక్కడ హై సెక్యూరిటీ మధ్య పంత్ ను వైద్యులు పర్యవేక్షిస్తారు. కేవలం అతడి కుటుంబసభ్యులను మాత్రమే పంత్ తో ఉండటానికి అనుమతిస్తారు. ప్రస్తుతం అతడి ఒంటి మీద ఉన్న గాయాలు మానిన తర్వాత తదుపరి చికిత్సపై వైద్యులు నిర్ణయం తీసుకుంటారు..’ అని తెలిపాడు.
ఇప్పటికే ఫిబ్రవరిలో జరుగబోయే ఆస్ట్రేలియా సిరీస్ తో పాటు ఐపీఎల్ మిస్ అయిన పంత్ తొమ్మిది నెలల దాకా క్రికెట్ ఆడకుండా ఉంటే పలు సిరీస్ లు కోల్పోవాల్సి వస్తుంది. వాటిలో ముఖ్యమైనవి.. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, ఇండియా వర్సెస్ ఆసీస్, ఐపీఎల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్ (భారత్ క్వాలిఫై అయితే), వెస్టిండీస్ పర్యటన (జూలైలో) కు పంత్ మిస్ అవుతాడు.
అంతేగాక ఈ ఏడాది జరుగబోయే ఆసియా కప్ లో కూడా పంత్ ఆడతాడా..? లేదా..? అన్నంది అనుమానమే. ఆసియా కప్ ముగిసిన తర్వాత భారత్ లో వన్డే ప్రపంచకప్ ఉంది. ఈ ఆరేడు నెలల్లో పంత్ కు సర్జరీలు విజయవంతమై తర్వాత అతడు పూర్తి ఫిట్నెస్ సాధిస్తే తప్ప అతడు వన్డే వరల్డ్ కప్ లో ఆడేది అనుమానంగానే ఉంది.