GT vs RCB: డకౌట్లలో ఆర్సీబీ చెత్త రికార్డు.. ఈ సీజన్ లో తొలి జట్టు..
TATA IPL 2022 GT vs RCB: ఎప్పుడెలా ఆడతారో తెలియని జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. బాగా ఆడుతారనుకుంటే వంద కూడా కొట్టరు. అదే ఈ మ్యాచ్ లో కష్టమే అనుకుంటే రెండు వందల టార్గెట్ అయినా ఊది పడేస్తారు. ఆ జట్టు తాజా ఐపీఎల్ లో ఓ చెత్త రికార్డు నమోదు చేసింది.

ఐపీఎల్-2022 లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ ఆడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎవరూ కోరుకోని చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. సరైన ఓపెనింగ్ జోడీ లేక తంటాలు పడుతున్న ఆర్సీబీ.. డకౌట్లలో చెత్త రికార్డు నమోదు చేసింది.
ఈ సీజన్ లో పదో మ్యాచ్ ఆడుతున్న డుప్లెసిస్ సేన.. గడిచిన ఆరు మ్యాచులలో ఓపెనింగ్ జోడీ 15 పరుగులు కూడా చేయలేకపోయింది. అంతేగాక టాప్-3 బ్యాటర్లు ఆరుసార్లు డకౌట్ అయ్యారు.
గత సీజన్ లో దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి లు నిలకడైన ఆటతీరుతో రాణించగా ఈసారి మాత్రం ఆర్సీబీలో ఆ లయ తప్పింది. ఈ సీజన్ తొలి నాలుగు మ్యాచులలో 50, 1, 55, 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది ఆర్సీబీ.
కానీ ఆ తర్వాత వరుసగా 14, 5, 7, 5, 10, 11 పరుగులకే ఓపెనింగ్ జోడీలో ఎవరో ఒకరు నిష్క్రమించారు. గుజారత్ టైటాన్స్ తో మ్యాచ్ లో కూడా 11 పరుగుల వద్ద డుప్లెసిస్ డకౌట్ గా వెనుదిరిగి నిరాశపరిచాడు. గత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన డుప్లెసిస్.. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉండటం గమనార్హం.కానీ ఇప్పుడు మాత్రం ఆ ఫామ్ ను కొనసాగించలేకపోతున్నాడు.
ఓపెనింగ్ జొడీతో పాటు టాప్-3 బ్యాటర్లు కూడా ఆర్సీబీకి పెద్ద తలనొప్పిగా మారారు. ఈ సీజన్ లో టాప్-3 బ్యాటర్లు ఆరుసార్లు డకౌట్ అయ్యారు. వీరిలో అనూజ్ రావత్ మూడు సార్లు, విరాట్ కోహ్లి రెండు సార్లు, డుప్లెసిస్ ఒకసారి సున్నాకే నిష్క్రమించాడు.
దీంతో ఐపీఎల్-2022 సీజన్ లో ఒక జట్టు తరఫున టాప్- 3 బ్యాటర్లు ఎక్కువ సార్లు డకౌట్ అయిన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. కాగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లి ఎట్టకేలకు హాఫ్ సెంచరీ సాధించాడు.
ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (58), రజత్ పాటిదార్ (52), మ్యాక్స్వెల్ (33) రాణించారు.