ఉమెన్స్ ఐపీఎల్‌లో ఫ్రాంచైజీ కొనేందుకు ఆసక్తి చూపుతున్న విరాట్ కోహ్లీ టీమ్..
Women's IPL 2023: వచ్చే ఏడాది ప్రారంభంకానున్న మహిళల ఐపీఎల్ కోసం బీసీసీఐ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నది. ఐదు లేదా ఆరు జట్లతో ఈ టోర్నీని మార్చిలో జరిపేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.

ఇండియాలో 2007లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పురుషుల ఫ్రాంచైజీ ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. నేడు దాని విలువ సుమారు రూ. 50 వేల కోట్ల పైమాటే. పురుషుల ఐపీఎల్ ను విజయవంతంగా నిర్వహిస్తున్న బీసీసీఐ.. త్వరలోనే మహిళల ఐపీఎల్ ను ప్రారంభించేందుకు సిద్దమవుతున్నది.
2023 ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఉమెన్స్ ఐపీఎల్ ను నిర్వహించేందుకు బీసీసీఐ గ్రౌండ్ వర్క్ చేస్తున్నది. తొలుత ఆరు జట్లతో ఆడించాలని చూసినా తాజా రిపోర్టుల ప్రకారం ఐదు జట్లతోనే ఈ ఈవెంట్ ను నిర్వించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు నిర్వాహకులు. అయితే ఐపీఎల్ లో మాదిరిగానే నగారాల బేస్ మీద ఇస్తారా..? లేక జోన్ ల బేస్ లో ఇస్తారా..? అనేది తేలాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ఉమెన్స్ ఐపీఎల్ లో కూడా ఫ్రాంచైజీలను దక్కించుకోవడానికి ప్రస్తుతం ఐపీఎల్ లో చక్రం తిప్పుతున్న ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. తాజా రిపోర్టుల ప్రకారం.. విరాట్ కోహ్లీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కూడా ఈ లీగ్ లో ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నది.
ఉమెన్స్ ఐపీఎల్ లో ఫ్రాంచైజీని దక్కించుకునేందుకు సిద్ధమవుతున్న ఆర్సీబీ.. ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నది. ఆ జట్టు టీమ్ డైరెక్టర్ గా ఉన్న మైక్ హెసన్ ప్రస్తుతం మహిళా క్రికెటర్ల వేటలో పడ్డాడు. బెంగళూరు వేదికగా జరుగుతున్న సీనియర్స్ ఉమెన్స్ టీ20 ఛాంపియన్షిప్ లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్ కు హాజరయ్యాడు. ఎవరెవరు బాగా ఆడుతున్నారు..? అనే విషయాలను పరిశీలిస్తున్నాడు.
ఇదే విషయమై ఆర్సీబీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘మేం ఉమెన్స్ ఐపీఎల్ లో ఫ్రాంచైజీని దక్కించుకోవడానికి ఆసక్తిగా ఉన్నాం. దేశవాళీతో పాటు అంతర్జాతీయంగా ఆడుతున్న క్రికెటర్లపై మేం దృష్టి సారించాం. మా టీమ్ డైరెక్టర్ మైక్ హెసెన్ ఇప్పటికే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న సీనియర్ ఉమెన్స్ టీ20 ఛాంపియన్షిప్ మ్యాచ్ లను దగ్గరగా గమనిస్తున్నాడు.
అయితే ఉమెన్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీని దక్కించుకోవడమనేది మా చేతుల్లో లేదు. అది బీసీసీఐ, ఐపీఎల్ అపెక్స్ కమిటీ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంది. మహిళల ఐపీఎల్ లో ఫ్రాంచైజీని దక్కించుకోవడానికి ఐపీఎల్ ఫ్రాంచైజీలకు అవకాశమిస్తారా..? లేదా..? లేక వాళ్లు మరేదైనా ప్రాసెస్ ను తీసుకొస్తార..? అనేది చూసి దానిని బట్టి ముందుకు సాగుతాం..’ అని తెలిపాడు.
గత నెల ముంబై వేదికగా ముగిసిన బీసీసీఐ ఏజీఎంలో ఉమెన్స్ ఐపీఎల్ గురించిన చర్చ జరిగింది. లీగ్ నిర్వహణ, ఫ్రాంచైజీలు, ఆటగాళ్ల వేలానికి సంబంధించిన విషయాలు ఇందులో చర్చలోకి వచ్చాయి. దీనిపై ఐపీఎల్ కొత్త పాలకమండలి ఏర్పాటయ్యాక పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.