అశ్విన్ దెబ్బకు భారత్-బంగ్లాదేశ్ టెస్టులో సచిన్ సహా దిగ్గజ ప్లేయర్ల రికార్డులు బ్రేక్
IND vs BAN : భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంతకుముందు భారత్ తరఫున 100వ టెస్టులో బాల్ తో అద్భుతం చేశాడు. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో జరిగిన తన 101వ టెస్టులో బ్యాట్ తో దుమ్మురేపాడు. తన కెరీర్ లో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదుచేస్తూ రికార్డుల మోత మోగించాడు.
Ravichandran Ashwin, Ashwin, Sachin Tendulkar
Ravichandran Ashwin: రవిచంద్రన్ అశ్విన్ అంటే మొదట గుర్తుకువచ్చేది అద్భుతమైన స్పిన్ బౌలింగ్. కానీ, అతను బ్యాట్ తో కూడా అద్భుతాలు చేయగల ప్లేయర్. చాలా సార్లు తన బాల్ తో పాటు బ్యాట్ పవర్ ను కూడా చూపించాడు. మరోసారి భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్టులో కూడా దుమ్మురేపే ఇన్నింగ్స్ తో రికార్డుల మోత మోగించాడు.
ప్రత్యర్థి జట్లను ఎదుర్కోవడానికి పగలు రాత్రి ప్రణాళికలు సిద్ధం చేసుకునే ప్లేయర్లలో ముందుంటాడు అశ్విన్. బంగ్లాదేశ్ తో టెస్టు మ్యాచ్ కు కూడా ఇలాంటిదే చేసి ఉండవచ్చు. కానీ, బంగ్లాదేశ్ కు పెద్ద పీడకలగా మారుతాడని ఎవరూ అనుకోని ఉండరు.
చెన్నైలోని చెపాక్‌లో ఈ సారి తన అద్భుతమైన బ్యాటింగ్ తో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇదివరకు 8వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి అత్యధిక సెంచరీలతో ప్రపంచ రికార్డు సాధించిన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ డేనియల్ వెట్టోరీ రికార్డును అశ్విన్ సమం చేశాడు.
భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో గురువారం ప్రారంభం అయింది. బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్ కు దిగింది. అయితే, బంగ్లాదేశ్ అద్భుతమైన బౌలింగ్ లో మ్యాచ్ ఆరంభంలోనే భారత్ ను దెబ్బకొట్టింది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, కేఎల్ రాహుల్ వంటి స్టార్ ప్లేయర్లను పెద్ద ఇన్నింగ్స్ లు ఆడనీయకుండా త్వరగానే పెవిలియన్ కు పంపడంలో బంగ్లాదేశ్ సక్సెస్ అయింది. అయితే, తమ బౌలింగ్ ను చీల్చిచెండాడటానికి ఇంకా భారత జట్టులో స్టార్లు ఉన్నారని ఊహించలేకపోయింది.
స్టార్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాటపట్టగా, 7 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన సెంచరీ సాధించి బంగ్లాదేశ్ జట్టును చెడుగుడు ఆడుకున్నాడు. కొత్త రికార్డులను సాధించాడు. బంగ్లాదేశ్‌పై అశ్విన్ 108 బంతుల్లో సెంచరీ చేశాడు.
టీమిండియా గ్రేట్ బ్యాటర్ల బ్యాట్లు సైలెంట్ గా ఉన్న సమయంలో అశ్విన్ అద్భుత బ్యాటింగ్ తో సెంచరీ కొట్టాడు. అతను తన టెస్టు కెరీర్‌లో ఆరో సెంచరీ సాధించాడు. భారత గడ్డపై అశ్విన్‌కి ఇది నాలుగో సెంచరీ.
8వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్ చివరి సెషన్‌లో మ్యాచ్‌ను మొత్తం మార్చిపడేశాడు. టీమ్ ఇండియా 250 పరుగులకు చేరుకోవడం కష్టంగా అనిపించినా, తొలి రోజు ఆట ముగిసే సమయానికి అశ్విన్ జట్టును 339 పరుగులకు తీసుకెళ్లాడు.
న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు డేనియల్ వెట్టోరీ కూడా చాలాసార్లు ప్రత్యర్థి జట్లకు పీడకలగా మారి బ్యాటింగ్ చేశాడు. అతని సెంచరీ రికార్డులను ఈ మ్యాచ్‌లో అశ్విన్ సమం చేశాడు. వెట్టోరి 8వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు టెస్టుల్లో అత్యధికంగా 4 సెంచరీలు సాధించాడు. ఇప్పుడు అశ్విన్ కూడా ఈ స్థానాన్ని సాధించాడు. మరో సెంచరీ సాధిస్తే వెట్టోరి రికార్డును అశ్విన్ బ్రేక్ చేస్తాడు.
మ్యాచ్‌కు ముందు ఒక ఇంటర్వ్యూలో, అశ్విన్ ఒక రికార్డు గురించి మాట్లాడాడు. అది ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టడం. దానిని సాధించలేకపోయినా సూపర్ సెంచరీతో రికార్డుల మోత మోగించాడు. అలాగే, అశ్విన్ కెరీర్ లో ఇది ఫాస్టెస్ట్ సెంచరీ కూడా. అశ్విన్‌కు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మద్దతు లభించింది.
మరో ఎండ్ నుంచి జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. రోజు ఆట ముగిసే సమయానికి వీరిద్దరి మధ్య 195 పరుగుల భాగస్వామ్యం ఉంది. జడేజా 86 పరుగులతో క్రీజులో ఉండగా, అశ్విన్ 102 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ భాగస్వామ్యం సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బ్రేక్ చేసింది. బంగ్లాదేశ్‌పై 7వ నంబర్‌కు ఇది అతిపెద్ద టెస్ట్ భాగస్వామ్యంగా నిలిచింది. అంతకుముందు సచిన్, జహీర్ ఖాన్ మధ్య 133 పరుగుల భాగస్వామ్యం ఉంది.