- Home
- Sports
- Cricket
- కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి వారి జీవితాలను నాశనం చేయకండి : వేలానికి ముందు ఫ్రాంచైజీలకు గవాస్కర్ వార్నింగ్
కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి వారి జీవితాలను నాశనం చేయకండి : వేలానికి ముందు ఫ్రాంచైజీలకు గవాస్కర్ వార్నింగ్
IPL2022 Auction: మరో రెండ్రోజుల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్-15 వ సీజన్ కు గాను మెగా వేలం (ఫిబ్రవరి 12,13) నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

క్యాష్ రిచ్ లీగ్ గా గుర్తింపు పొందిన ఐపీఎల్ లో.. ఫ్రాంచైజీలు అనామక ప్లేయర్లకు కూడా తాము గతంలో చూడనంతగా చెల్లించి దక్కించుకుంటున్నాయి. దీంతో సదరు ఆటగాళ్ల జీవితం నాశనమవుతుందంటున్నాడు సన్నీ..
మెగా వేలానికి రెండ్రోజుల ముందు ఓ పత్రికకు కాలమ్ రాస్తూ.. ‘ఈ వారాంతం మెగా వేలం జరుగనున్నది. ఇటీవలే అండర్-19 ప్రపంచకప్ గెలిచిన మన కుర్రాళ్లు ఐపీఎల్ లో ఆడటానికి ఉత్సాహంగా ఉన్నారు.
అయితే అండర్-19 లో గెలిచినంత మాత్రానా ఐపీఎల్ లో, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కినట్టు కాదనే విషయాన్ని వాళ్లు మరిచిపోకూడదు. రెండింటికీ చాలా తేడా ఉంది.
ఈ విషయంలో ఫ్రాంచైజీలు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. అన్ క్యాప్డ్ (ఇంతవరకు జాతీయ జట్టుకు ఆడని ఆటగాళ్లు) ప్లేయర్లకు కోటి రూపాయల కంటే ఎక్కువ చెల్లించొద్దు. వాళ్లకు ఆటతో పాటు డబ్బు విలువ కూడా తెలియాలి.
ఓవర్ నైట్ లో కోటీశ్వరులు కావడం వల్ల వాళ్లు కూడా కెరీర్ పై దృష్టి పెట్టలేకపోతున్నారు. డబ్బు మోజులో పడి కెరీర్ లను నాశనం చేసుకుంటున్నారు. దూరపు కొండలు నునుపు అన్న మాదిరిగా.. ఐపీఎల్ లో వారికి అధికంగా డబ్బు దక్కగానే.. తమను తాము గొప్ప ఆటగాళ్లుగా ఊహించుకుని బోల్తా పడుతున్నారు.
తేరగా వచ్చిన డబ్బుతో ప్రతిభావంతులైన ఎంతో మంది యువకులు తమ కెరీర్లను నాశనం చేసుకుంటున్నారు. వాళ్లకు ఇచ్చే కాంట్రాక్టులపై ఓ కన్నేసి ఉంచండి. ఒక్కసారిగా వారికి కోట్లకు కోట్లు ఇవ్వకుండా.. ముందుగా వాళ్లకు ఆటగాళ్లుగా అవకాశాలివ్వండి. ఎదగనివ్వండి.. ’ అని సూచించాడు.
కాగా.. లక్నో సూపర్ జెయింట్స్ ఇటీవల రిటైన్ చేసుకున్న స్పిన్నర్ రవి బిష్ణోయ్.. అన్ క్యాప్డ్ ఆటగాడే. 2020 అండర్-19 ప్రపంచకప్ లో మెరిసిన తర్వాత అతడిని పంజాబ్ దక్కించుకుంది. ఆ తర్వాత ఈ సీజన్ లో రవిని.. లక్నో జట్టు ఏకంగా రూ. 4 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది.
రవితో పాటు ఇటీవలే ముగిసిన అండర్-19 ప్రపంచకప్ లోని సారథి యశ్ ధుల్ తో పాటు రాజవర్ధన్ హంగర్గేకర్, హర్నూర్ సింగ్, నిశాంత్ సింధు, రాజ్ బవ, రవికుమార్ వంటి ఆటగాళ్లపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్నేశాయి. వారికి వేలంలో మంచి ధర దక్కే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో సన్నీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.