పృథ్వీ షా, సర్ఫరాజ్‌లని కాదని, శుబ్‌మన్ గిల్‌పై ఎందుకింత ప్రేమ... టీమిండియాలోకి రావాలంటే అదొక్కటే గతా...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ జరుగుతుండగానే ఆ తర్వాత జరిగే బంగ్లాదేశ్, న్యూజిలాండ్ టూర్లకు జట్లను ప్రకటించింది బీసీసీఐ. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన శుబ్‌మన్ గిల్, న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు ఎంపిక చేసిన జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. ఇది సోషల్ మీడియాలో కొత్త చర్చను లేవనెత్తింది.
శుబ్‌మన్ గిల్‌కి అవకాశం ఇచ్చిన సెలక్టర్లు, దేశవాళీ టోర్నీల్లో అదరగొడుతున్న పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్‌లను పక్కనబెట్టడం తీవ్ర వివాదాస్పదమైంది. అప్పుడెప్పుడు 2020 చివర్లో ఆడిలైడ్‌లో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో (0,4) విఫలమైన పృథ్వీ షా... ఆ తర్వాత సెలక్టర్ల నమ్మకాన్ని దక్కించుకోలేకపోతున్నాడు.
మరోవైపు వరుసగా ఫెయిల్ అవుతున్న కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి ప్లేయర్లకు అవకాశాల మీద అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్న సెలక్టర్లు, టీమిండియా మేనేజ్‌మెంట్... టన్నుల్లో టాలెంట్ ఉందని విమర్శకులతో ప్రశంసలు దక్కించుకున్న పృథ్వీ షాని పట్టించుకోకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది...
Sarfaraz Khan
పృథ్వీ షా కంటే ఎక్కువగా ఈసారి రంజీ, ఇరానీ ట్రోఫీలో రికార్డు పర్ఫామెన్స్‌తో దుమ్ముదులిపి టెస్టు టీమ్‌లో చోటు దక్కించుకోవడం పక్కా అనిపించుకున్నాడు సర్ఫరాజ్ ఖాన్. అయితే అతన్ని కూడా పట్టించుకోలేదు సెలక్టర్లు. గత 21 ఇన్నింగ్స్‌ల్లో 9 సెంచరీలు, అందులో ఓ త్రిబుల్ సెంచరీ, రెండు డబుల్ సెంచరీలు బాదాడు సర్ఫరాజ్ ఖాన్..
2021-21 రంజీ సీజన్‌లో 982 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్.. 2019లో రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి రెడ్ బాల్ క్రికెట్‌లో రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. అయితే సెలక్టర్ల దృష్టిలో మాత్రం పడలేకపోతున్నాడు ఈ ముంబై చిన్నోడు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో 34.5 సగటుతో 483 పరుగులు చేశాడు శుబ్‌మన్ గిల్. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతకుముందు సీజన్లలో శుబ్‌మన్ గిల్ ఆట టెస్టులను తలపించేది. 40 బంతులాడి 50 పరుగులు చేస్తూ ప్రేక్షకులు విసుగు తెప్పించేవాడు...
ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగా భారత టెస్టు టీమ్‌లో చోటు దక్కించుకున్న శుబ్‌మన్ గిల్‌కి టీ20 టీమ్‌లో చోటు దక్కడానికి ఈ సీజన్‌లో అతను చూపించిన ఐపీఎల్ పర్ఫామెన్సే ప్రధాన కారణం. గుజరాత్ టైటాన్స్‌కి మారిన తర్వాత గేరు మార్చి వేగంగా పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, ఐపీఎల్ 2022 టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Prithvi Shaw
మిగిలిన ఇద్దరినీ సెలక్టర్లు పట్టించుకోకపోవడానికి కూడా ఇదే కారణం. గాయం కారణంగా ఐపీఎల్ 2022 సీజన్ మధ్యలో తప్పుకున్న పృథ్వీ షా 10 ఇన్నింగ్స్‌ల్లో 283 పరుగులు చేశాడు... అయితే దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ ఆలీ, విజయ్ హాజరే ట్రోఫీల్లో పృథ్వీ షా మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు.
సర్ఫరాజ్ ఖాన్‌కి ఐపీఎల్‌కి వచ్చిన అవకాశాలు చాలా తక్కువ. అప్పుడప్పుడు వచ్చిన ఆ ఛాన్సులను ఈ ప్యాకెట్ డైనమైట్ సరిగ్గా వాడుకోలేకపోయాడు. అయితే ఈ ఇద్దరూ దేశవాళీ టోర్నీల్లో దుమ్మురేపే పర్ఫామెన్స్ ఇచ్చారు. అయినా సెలక్టర్లు వీరిని పట్టించుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది...
టీమిండియాలోకి రావాలంటే ఇంతకుముందు దేశవాళీ టోర్నీల పర్ఫామెన్స్‌నే ప్రామాణికంగా తీసుకునేవాళ్లు. ఇప్పుడు మాత్రం కేవలం ఐపీఎల్ పర్ఫామెన్సే ప్రామాణికంగా మారిపోయినట్టు తెలుస్తోంది. మరికొందరేమో టాలెంట్ ఎంతున్నా ఫిట్‌నెస్ లేకపోవడం వల్లే పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ టీమ్‌లోకి రాలేకపోతున్నారని కామెంట్లు చేస్తున్నారు..