మరో ఏడాది ఆడతానేమో.. ఆ తర్వాత కష్టం..!! రిటైర్మెంట్ హింట్ ఇచ్చిన వార్నర్ భాయ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు గతంలో సారథిగా పనిచేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆటకు రిటైర్మెంట్ చెప్పనున్నాడా..? అంటే తాజాగా అతడి ప్రకటన చూస్తే అదే అనిపిస్తున్నది.

గతంలో హైదరాబాద్ తరఫున ఆడి ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే తాను ఆట నుంచి రిటైర్ అవనున్నట్టు హింట్ ఇచ్చాడు. స్వదేశంలో ముగిసిన టీ20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా లీగ్ స్టేజ్ నుంచే వెనుదిరిగిన నేపథ్యంలో వార్నర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఆస్ట్రేలియాలోని ట్రిపుల్ ఎమ్స్ డెడ్ సెట్ లెజెండ్స్ షోలో వార్నర్ మాట్లాడుతూ.. ‘నేనింకా మరో ఏడాది పాటు మాత్రమే టెస్టు క్రికెట్ ఆడతానేమో. వచ్చే టీ20 ప్రపంచకప్ (2024) కు సన్నద్ధమయ్యేందుకు ఇప్పట్నించే సిద్ధపడాలి.. అందుకు ఇదొక్కటే మార్గంగా ఉంది..’ అని తెలిపాడు.
2011లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వార్నర్.. ఆస్ట్రేలియా తరఫున 96 టెస్టులు, 138 వన్డేలు 99 టీ20లు ఆడాడు. టెస్టులలో 7,817 పరుగులు సాధించాడు. టెస్టులలో 46.52 సగటుతో 24 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు చేశాడు.
ఇక 138 వన్డేలలో 44.60 సగటుతో 5,799 పరుగులు చేసిన వార్నర్.. 99 టీ20లలో 32.88 సగటుతో 2,894 రన్స్ చేశాడు. వార్నర్ చెప్పినదాని ప్రకారం చూస్తే అతడు వచ్చే ఏడాది భారత్ లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్ తో పాటు భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగాల్సి ఉన్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (టెస్టు సిరీస్) లో ఆడి టెస్టు క్రికెట్ నుంచి నిష్క్రమించే అవకాశముంది.
వయసు మీద పడుతుండటం, వైట్ బాల్ క్రికెట్ (టీ20) కు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా వార్నర్.. సాంప్రదాయక టెస్టుల నుంచి తప్పుకోనున్నాడని తెలుస్తున్నది. వ్యక్తిగతంగా తనకు టెస్టుల కంటే వైట్ బాల్ క్రికెట్ నే ఎక్కువగా ఇష్టపడతానని వార్నర్ తెలిపాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (2023 ఫిబ్రవరి, మార్చి) తో పాటు ఇంగ్లాండ్ లో జరిగే యాషెస్ సిరీస్ (2023 జూన్, జులై) లలో ఆడి ఆ తర్వాత ఆటకు గుడ్ బై చెప్పనున్నాడని ఆస్ట్రేలియా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.