పాపం స్కూల్ పిల్లలు.. జాగ్రత్తగా డీల్ చేయండి : పోలీసులను కోరిన రాణా భార్య
IPL 2023: ఐపీఎల్ -16 లో కోల్కతా నైట్ రైడర్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్న నితీశ్ రాణా భార్య కారును ఇటీవల ఇద్దరు యువకులు వెంబడించిన విషయం తెలిసిందే.

కోల్కతా నైట్ రైడర్స్ సారథి నితీశ్ రాణా భార్య సాచీ మార్వా కారును ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టిన నిందితులపై ఆమె జాలి చూపించింది. వారిని ఏమీ అనవద్దని.. జాగ్రత్తగా డీల్ చేయాలని పోలీసులను కోరింది. రెండ్రోజుల క్రితం ఢిల్లీలో తన కారులో ఇంటికి తిరిగివస్తుండగా సాచిని ఇద్దరు యువకులు వెంబడించడంతో ఆమె ఇబ్బందిపడింది.
ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె ఇన్స్టాలో పోస్టు చేస్తూ.. ఈ ఇద్దరూ తనను వెంబడించారని, ఈ విషయాన్ని పోలీసులకు చెబితే వారు తేలికగా తీసుకున్నారని పోస్టు చేసిన విషయం విదితమే. పోలీసులు ఈ విషయాన్ని మరిచిపోండని అన్నారని, ఇకపై జరిగితే ఆ బైక్ నెంబర్ నోట్ చేసుకోవాలని సూచించినట్టు తెలిపింది.
అయితే తాజాగా పోలీసులు వారిని వీడియో ఫుటేజీల ఆధారంగా పట్టుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మార్వా స్పందించింది. వారి బ్యాక్‌గ్రౌండ్ ఎంక్వైరీ చేసిన ఆమె వాళ్లిద్దరూ స్కూల్ లో చదివే విద్యార్థులని తెలుసుకున్నది.
తాజాగా ఆమె.. ‘వాళ్లిద్దరూ స్కూల్ పిల్లలని తెలిసింది. తెలిసీ తెలియని వయసులో ఇలా చేసి ఉంటారని వారితో కఠినంగా వ్యవహరించొద్దు. వారిని మందలించి వదిలేయండి. వాళ్ల తప్పును వాళ్లు తెలుసుకుంటారు..’అని ఇన్స్టా స్టోరీస్ లో రాసుకొచ్చింది.
కాగా ఐపీఎల్ లో కేకేఆర్ రెగ్యులర్ శ్రేయాస్ అయ్యర్ కు గాయం కావడంతో ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్న నితీశ్ రాణా.. జట్టును విజయవంతంగా నడిపించడంలో విఫలమవుతున్నాడు. ఈ సీజన్ లో కేకేఆర్.. 10 మ్యాచ్ లు ఆడి నాలుగు మాత్రమే గెలిచి ఆరింట్లో ఓడి 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. కేకేఆర్ మే 8న పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది.