- Home
- Sports
- Cricket
- ఏం పర్లేదు.. అద్దాలేగా పగలగొట్టు అనేది.. తల్లి మద్దతు గురించి ఉమ్రాన్ భావోద్వేగ వ్యాఖ్యలు
ఏం పర్లేదు.. అద్దాలేగా పగలగొట్టు అనేది.. తల్లి మద్దతు గురించి ఉమ్రాన్ భావోద్వేగ వ్యాఖ్యలు
Umran Malik: టీమిండియా నయా పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్-15లో అదరగొట్టి ఏకంగా జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఈ క్రమంలో అతడు తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్-15లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడి అద్భుతమైన ప్రదర్శనలతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన జమ్మూ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్.. బాల్యం నుంచి ఇక్కడి వరకు తన క్రికెట్ ప్రయాణంలో తల్లిదండ్రులు ఎలా మద్దతునిచ్చారనేదానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఓ జాతీయ పత్రికతో ఉమ్రాన్ మాలిక్ మాట్లాడుతూ... ‘నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర ప్లాస్టిక్ బాల్ తో క్రికెట్ ఆడేవాడిని. మా చుట్టుపక్కల ఇంటి కిటికీ అద్దాలను తరుచూ పగులుతుండేవి. దాంతో నాకు రోజూ తిట్లు తప్పేవికావు.
కానీ ఎంతమంది తిడుతున్నా మా అమ్మ నన్ను ఎప్పుడూ క్రికెట్ ఆడొద్దని చెప్పేది కాదు. అదీగాక.. ‘ఆడు పగలగొట్టు.. ఏం పర్లేదు..’ అని చెబుతుండేది. ఆమె నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది..’ అని చెప్పాడు.
ఇక తన తండ్రి గురించి మాట్లాడుతూ.. ‘మాది మధ్యతరగతి కుటుంబం. మా నాన్న మా ఊళ్లో కూరగాయలు, పండ్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే నేను ఐపీఎల్ లో ఆడినంత మాత్రానో.. టీమిండియాకు ఆడితేనో మా నాన్న మా వ్యాపారాన్ని వదిలేయలేదు.
ఆయన ఇంకా షాప్ లో పనిచేస్తూనే ఉన్నాడు. నేను టీమిండియాకు ఆడినా ఆయన తన పనిని ఆపడు. ఎందుకంటే మా నాన్న ఎప్పుడూ ఒక మాట చెబుతుంటాడు. మనం ఎంత ఎదిగినా ఎక్కడ్నుంచి వచ్చామన్నదే నిత్యం గుర్తుంచుకోవాలి.. అని పదే పదే మాతో అంటుంటాడు.
మా నాన్నే కాదు, మా తాత, మామయ్యలు కూడా ఇప్పటికీ అదే వ్యాపారం చేస్తున్నారు. మా నాన్నను గర్వపడేలా చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది...’ అని తెలిపాడు.
ఇక తన ఫేవరేట్ బౌలర్ గురించి కూడా ఉమ్రాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నా బౌలింగ్ శైలి సహజంగా వచ్చిందే. ఎవరినీ కాపీ కొట్టలేదు. నేను వకార్ యూనిస్ ను ఫాలో కాను. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ ల బౌలింగ్ అంటే నాకు ఇష్టం. నేను క్రికెట్ లో ఓనమాలు దిద్దేప్పట్నుంచే వారిని ఫాలో అవుతున్నాను..’ అని తెలిపాడు.
తనను ఆదరిస్తున్నవారందరికీ ఉమ్రాన్ కృతజ్ఞతలు తెలిపాడు. ‘నాకు వస్తున్న మద్దతు, నాపై కురిపిస్తున్న ప్రేమకు నేను వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను. నన్ను చూడటానికి నా కుటుంబసభ్యులు, సన్నిహితులు మా ఇంటికి వస్తున్నారు..’ అని వ్యాఖ్యానించాడు.