- Home
- Sports
- Cricket
- Sourav Ganguly: ఆ విషయంలో నేను చెప్పేదేం లేదు.. ప్రజలకే వదిలేస్తున్నా.. కీలక వ్యాఖ్యలు చేసిన దాదా..
Sourav Ganguly: ఆ విషయంలో నేను చెప్పేదేం లేదు.. ప్రజలకే వదిలేస్తున్నా.. కీలక వ్యాఖ్యలు చేసిన దాదా..
Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ 2019 అక్టోబర్ 23న పదవీ బాధ్యతలు స్వీకరించాడు. ఈ ఏడాది సెప్టెంబర్ దాకా అతడు ఆ పదవిలో కొనసాగుతాడు. కానీ కొంతకాలంగా..

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడిగా రెండున్నరేండ్లుగా సేవలందిస్తున్న టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ తన లెగసీ (వారసత్వం) పై కీలక వ్యాఖ్యలు చేశాడు.
సుమారు రెండేండ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని శాసిస్తున్న సమయంలో కీలక టోర్నీలు నిర్వహించడంలో సఫలమైన దాదా.. తన పనితీరు గురించి తాను చెప్పేది కాదని అన్నాడు.
ఇదే విషయమై ఇటీవలే తనను కలిసిన మీడియా ప్రతినిధులతో గంగూలీ మాట్లాడుతూ.. ‘నా లెగసీ గురించా..? ఏం చెప్పాలి..? అది నేను చెప్పేది కాదు. ఏం జరుగుతుందో చూద్దాం. అది నిర్ణయించాల్సింది మీరు..
కానీ గడిచిన రెండేండ్లుగా కరోనా విపత్కర పరిస్థితులలో కూడా మేం (బీసీసీఐ) పలు కీలక టోర్నీలను విజయవంతంగా నిర్వహించాం...’ అని అన్నాడు.
2019 అక్టోబర్ 23న బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన దాదా.. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఆ పదవిలో కొనసాగుతాడు. గంగూలీ పదవిలోకి వచ్చిన తర్వాత నాలుగు నెలలకే ప్రపంచవ్యాప్తంతా కరోనా కారణంగా క్రికెట్ మ్యాచుల నిర్వహణ అగమ్యగోచరంగా మారింది.
కానీ బయో బబుల్స్, కఠిన ఆంక్షల మధ్య పలు సిరీస్ లతో పాటు రెండు ఐపీఎల్ సీజన్లను కూడా విజయవంతంగా నిర్వహించింది బీసీసీఐ. గతేడాది వరకు అంతా సవ్యంగానే సాగినా.. 2021 సెప్టెంబర్ లో టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి వైదొలిగిన తర్వాత భారత క్రికెట్ లో పెనుమార్పులు సంభవించాయి.
గంగూలీ-కోహ్లి ల మధ్య దూరం పెరిగి ఇద్దరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. గత డిసెంబర్ లో కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం.. ఒకరిమీద ఒకరు చేసుకున్న వ్యాఖ్యలతో బీసీసీఐ ప్రతిష్ట గంగలో కలిసింది.