- Home
- Sports
- Cricket
- కోహ్లీ అఫ్గాన్‌పై సెంచరీ చేసినా పండుగలా జరుపుకున్నారు.. బాబర్ చేస్తే పట్టించుకోరా? మళ్లీ గెలికిన రమీజ్ రాజా
కోహ్లీ అఫ్గాన్‌పై సెంచరీ చేసినా పండుగలా జరుపుకున్నారు.. బాబర్ చేస్తే పట్టించుకోరా? మళ్లీ గెలికిన రమీజ్ రాజా
Ramiz Raja: తమ జట్టు ప్రదర్శన గురించి చెప్పమంటే ఇతర జట్లను మరీ ముఖ్యంగా భారత జట్టును చర్చలోకి లాగడం అలవాటుగా మార్చుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మెన్ రమీజ్ రాజా తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసి అబాసుపాలయ్యాడు.

గత కొంతకాలంగా పాకిస్తాన్ క్రికెట్, ఆ జట్టు ఆటగాళ్ల గురించి ఏం చర్చ జరిగిందో తెలియదు గానీ ప్రతీ చర్చలో తరుచుగా వినిపించే పేరు మాత్రం పీసీబీ చైర్మెన్ రమీజ్ రాజాది. అవసరమున్నా లేకున్నా ఓ చర్చను లేవనెత్తడం.. ఆ తర్వాత అబాసుపాలవడం ఆయన అలవాటుగా మార్చుకున్నారేమో అనిపిస్తున్నది.
పాకిస్తాన్ గురించి చెప్పమంటే.. భారత జట్టును సీన్ లోకి లాగడం.. తర్వాత తిట్లు తినడం ఆయనకే దక్కింది. ఇటీవలే.. బిలియన్ డాలర్స్ జట్టును ప్రపంచకప్ లో ఓడించామని ఆ క్రెడిట్ మాకే ఇవ్వాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన ఇప్పుడు విరాట్ కోహ్లీ మీద పడ్డాడు.
ఓ టీవీ చర్చలో పాల్గొన్న రమీజ్ రాజా.. మూడేండ్ల తర్వాత విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే ఆ దేశంలోని మీడియా, క్రికెట్ అభిమానులు దానిని పండుగలా చేసుకున్నారని, కానీ పాక్ లో మాత్రం బాబర్ ఆజమ్ సెంచరీ చేస్తే ఎవరూ పట్టించుకోలేదని ఆరోపిస్తూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
బాబర్ తో పాటు పాకిస్తాన్ జట్టుకు అభిమానులు, మీడియా మద్దతునివ్వాలని కోరాడు. కోహ్లీ, టీమిండియాకు ఇండియాలో దక్కుతున్న మద్దతును ప్రస్తావిస్తూ.. ‘ఇండియాలో చూడండి. కోహ్లీ అఫ్గానిస్తాన్ మీద సెంచరీ చేసినా దానిని మీడియా పండుగలా చేసుకుంది. అసలు కోహ్లీ సెంచరీ చేసింది అఫ్గాన్ మీద.. అది కూడా అఫ్గాన్ ఫీల్డర్లు నాలుగు క్యాచ్ లు మిస్ చేశారు. దానికి అక్కడ వేడుకలా చేసుకున్నారు.
కానీ పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ ఇంగ్లాండ్ మీద సెంచరీ (రెండో టీ20లో) చేసినా స్ట్రైక్ రేట్ గురించి చర్చలు జరుపుతున్నారు. ఇదేం పద్ధతి. జట్టుకు మద్దతునివ్వాల్సిందిపోయి ఈ చర్చలెందుకు..?’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అయితే రమీజ్ కామెంట్స్ కు ఇండియా నుంచి కాదు ఏకంగా సదరు టీవీ ఛానెల్ యాంకరే కౌంటర్ ఇచ్చింది. ‘క్యాచ్ లు మిస్ అయ్యాయని మీరు అంటున్నారు. కానీ అది కుద్రత్ కా నిజాం (ప్రకృతి నియమం) లో భాగం కదా. ఎందుకంటే ఇప్పుడు ఈ పదం (కుద్రత్ కా నిజాం) బాగా ఫేమస్ కదా..’ అని కౌంటర్ ఇచ్చింది.
టీవీ యాంకర్ ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా అటు రమీజ్ రాజాతో పాటుగా పాక్ హెడ్ కోచ్ సక్లయిన్ ముస్తాక్ కు కూడా కౌంటర్ ఇచ్చింది. ఇటీవల ఇంగ్లాండ్ తో పాకిస్తాన్ ఏడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 4-3తో ఓడినప్పుడు ముస్తాక్ స్పందిస్తూ.. ఓటములనేవి కుద్రత్ కా నిజాం వంటివని కామెంట్ చేశాడు.