చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ఆస్ట్రేలియా, భారత్ తర్వాత దాయాదిదే రికార్డు..
Pakistan 500th ODI Win: పాకిస్తాన్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్ తో స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ ను గెలుచుకుని..

స్వదేశంలో న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో పాకిస్తాన్ తొలి మ్యాచ్ లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు వన్డేలలో ఇది 500 వ విజయం కావడం గమానార్హం. తద్వారా ఆ జట్టు ఆస్ట్రేలియా, భారత్ తర్వాత మూడో స్థానంలో నిలిచింది.
Pakistan vs New Zealand
రావాల్పిండి వేదికగా నిన్న జరిగిన తొలి వన్డే లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 288 పరుగులు చేసింది. డారిల్ మిచెల్.. (113) సెంచరీతో చెలరేగగా ఓపెనర్ విల్ యంగ్.. 86 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రౌఫ్ లు తలా రెండు వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. 48.3 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్ ఫకర్ జమాన్ సెంచరీ (117) చేయగా ఇమామ్ ఉల్ హక్ (60), బాబర్ ఆజమ్ (49), మహ్మద్ రిజ్వాన్ (42 నాటౌట్) లు రాణించారు. కాగా ఈ విజయంతో పాకిస్తాన్ వన్డేలలో 500వ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన దేశాలు రెండే రెండు.
ఆస్ట్రేలియా.. తన వన్డే క్రికెట్ చరిత్రలో 978 మ్యాచ్ లు ఆడి 594 విజయాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. టీమిండియా.. 1,029 మ్యాచ్ లలో 539 మ్యాచ్ లలో గెలిచి రెండో స్థానంలో ఉంది. ఆసీస్ 341 వన్డేలు ఓడిపోగా భారత్ 438 మ్యాచ్ లలో ఓడింది.
ఈ జాబితాలో పాకిస్తాన్.. 949 మ్యాచ్ లు ఆడి 500 విజయాలు, 420 పరాజయాలు పొందింది. 9 మ్యాచ్ లలో టై కాగా.. 20 ఫలితం తేలలేదు. పాకిస్తాన్ తర్వాత వెస్టిండీస్ (854 మ్యాచ్ లు 411 విజయాలు), సౌతాఫ్రికా (654 మ్యాచ్ లు, 399 విజయాలు) టాప్ -5లో ఉన్నాయి. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్.. 739 వన్డేలు ఆడి 392 విజయాలు సాధించి ఏడో స్థానంలో నిలిచింది.
కాగా పాకిస్తాన్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్.. వన్డే సిరీస్ కంటే ముందు జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 2-2 తో సమం చేసింది. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు.ఇక ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా తొలి వన్డేను పాకిస్తాన్ గెలుచుకుంది. రెండో వన్డే రావల్పిండి వేదికగానే రేపు (ఏప్రిల్ 29) జరుగనుంది.