- Home
- Sports
- Cricket
- బుల్లెట్టు బండి వాడుతున్న రమీజ్ రాజా.. ఆర్థిక సంక్షోభం గుర్తుచేస్తున్న పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్
బుల్లెట్టు బండి వాడుతున్న రమీజ్ రాజా.. ఆర్థిక సంక్షోభం గుర్తుచేస్తున్న పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్
PCB Chief:పీసీబీ బోర్డు చైర్మన్ పదవిలో ఉన్న రమీజ్ రాజా.. సాధారణ కార్లలో కాకుండా బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యం ఉన్న వాహనాన్ని వాడుతున్నాడట. మాంద్యం నీడలు కమ్ముకుంటున్న పాకిస్తాన్ లో..

భారతదేశానికి ఇరుగుపొరుగుగా ఉన్న దేశాలు శ్రీలంక, పాకిస్తాన్. ఇప్పటికే శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. ఇక పాకిస్తాన్ కు కూడా మాంద్యం నీడలు కమ్ముకుంటున్నాయి. ఖర్చులను తగ్గించుకోవడానికి టీ తాగొద్దని.. వంట నూనె అతిగా వాడొద్దని ఆ దేశం ఇప్పటికే ప్రజలకు సూచనలిస్తున్నది.
ఒకవైపు దేశం ఆర్థిక మాంద్యానికి దగ్గరగా వెళ్తు ఖర్చులు తగ్గించుకుంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ రమీజ్ రాజా మాత్రం తన సౌకర్యాలకు లోటు లేకుండా చూసుకుంటున్నాడట..
పీసీబీ బోర్డు చైర్మన్ పదవిలో ఉన్న రమీజ్ రాజా.. సాధారణ కార్లలో కాకుండా బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యం ఉన్న వాహనాన్ని వాడుతున్నాడట. బోర్డు లో మిగతా సభ్యులెవరూ బుల్లెట్ ప్రూఫ్ వాడకున్నా రమీజ్ రాజా మాత్రం తగ్గేదేలే అంటున్నాడు.
ఈ విషయాన్ని స్వయంగా అతడే పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ కమిటీ ముందు చెప్పాడని సమాచారం. క్రికెట్ కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు, బోర్డు పనితీరు, ఇతరత్రా విషయాలకు సంబంధించి రమీజ్ రాజా.. పీసీబీకి సంబంధించిన పలు విషయాలను నేషనల్ అసెంబ్లీ ముందుంచాడు.
ఈ మేరకు అతడు తాను భద్రతా కారణాల రీత్యా బుల్లెట్ ప్రూఫ్ వాడుతున్నట్టు వెల్లడించాడని సమాచారం. ‘డైలీ అలవెన్స్ లు, హోటల్, ట్రావెల్ ఖర్చులు పీసీబీ చైర్మెన్ కు సర్వీస్ రూల్స్ కిందే అందుతున్నాయి. అతడు తన భద్రత నిమిత్తం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వాడుతున్నాడు..’ అని పీసీబీకి చెందిన ఓ ప్రతినిధి తెలిపాడు. అవి మినహా అతడు తీసుకుంటున్న మిగతా తాయిళాలకు సంబంధించి బోర్డుకు భారమేమీ కాదని చెప్పుకుంటున్నట్టు తెలుస్తున్నది.
పీసీబీ లో రమీజ్ రాజా ఒక్కడే బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వాడుతున్నాడని.. ఇతరులంతా సాధారణ కార్లలోనే బోర్డులో పని చూసుకుంటున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక 2021 లో పీసీబీ చైర్మెన్ గా నియమితుడైన రమీజ్ రాజా పనితీరు.. గత ఏడాది కాలంలో పాకిస్తాన్ జట్టు అందుకున్న విజయాలపై నేషనల్ అసెంబ్లీ సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది.
ఇదిలాఉండగా రమీజ్ రాజా పీసీబీ చీఫ్ గా వచ్చి ఒరగబెట్టిందేమీ లేదని పాకిస్తాన్ ఫ్యాన్స్ తో పాటు మాజీ క్రికెటర్లు గత కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు దేశం ఆర్థిక మాంద్యం కోరల్లోకి వెళ్తుంటే రమీజ్ మాత్రం.. వృథా ఖర్చులతో బోర్డు ఆదాయాన్ని కొల్లగొడుతున్నాయని పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.