మేం అలా చేయలేదు.. అందుకే వరుసగా గెలుస్తున్నాం.. గుజరాత్ ఆల్ రౌండర్ కామెంట్స్
IPL 2022: ఐపీఎల్ లో అడుగుపెట్టిన తొలి ఏడాదే సంచలనాలు సృష్టిస్తున్న గుజరాత్ టైటాన్స్ లీగ్ దశలో సమిష్టిగా ఆడి టాప్ లో నిలిచింది. ఇటీవలే ముగిసిన క్వాలిఫైయర్-1 లో రాజస్తాన్ ను ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది.

ఐపీఎల్ - 15 లో ఎవరూ ఊహించిన విధంగా ఆడుతున్న తొలి సీజన్ లోనే ఫైనల్ కు చేరింది గుజరాత్ టైటాన్స్. హార్ధిక్ పాండ్యా సారథ్యంతో పాటు ఆశిష్ నెహ్రా కోచింగ్.. ఆటగాళ్ల సమిష్టితత్వమే తమను ముందుకు నడిపిస్తుందని అంటున్నాడు ఆ జట్టు ఆల్ రౌండర్ రాహుల్ తెవాటియా.
తాజాగా టైమ్స్ నౌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ‘మా జట్టు ఏ ఒక్క ఆటగాడిపై ఆధారపడలేదు. మేం సమిష్టిగా ఆడుతున్నాం. అదే మా జట్టును ఇతర జట్లతో ప్రత్యేకంగా నిలుపుతున్నది.
టీమ్ లో మంచి వాతావరణముంది. కోచ్ గా ఆశిష్ నెహ్రా, కెప్టెన్ గా హార్ధిక్ పాండ్యా కూల్ గా ఉంటూ పని కానిచ్చేస్తున్నారు. ఆటగాళ్లపై ఒత్తిడి తీసుకురావడం చేయడం లేదు. అదే మా సక్సెస్ మంత్ర’ అని తెలిపాడు.
తెవాటియా చెప్పినట్టు.. గుజరాత్ టైటాన్స్ తరఫున అవసరమొచ్చినప్పుడల్లా ఆటగాళ్లంతా సమిష్టిగా రాణిస్తున్నారు. బ్యాటింగ్ లో గిల్, సాహా, హార్ధిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ లు కలిసికట్టుగా ఆడుతున్నారు. వీరిలో ఒకరు విఫలమైనా మరొకరు రాణిస్తూ జట్టుకు విజయాలు అందిస్తున్నారు.
బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా షమీ, ఫెర్గూసన్, రషీద్ ఖాన్ లు ప్రత్యర్థి జట్లను కట్టడి చేస్తున్నారు. బౌలర్లు విఫలమైన చోట బ్యాటర్లు విజృంభించి ఆడుతున్నారు.
ఇక తనకు ఒత్తిడిలో ఆడటమే ఇష్టమని తెవాటియా అన్నాడు. డేవిడ్ మిల్లర్ తో కలిసి ఆడటం ఎంతో భాగుందని.. తనతో ఆడే వాళ్లకు పూర్తి కంఫర్ట్ ఇస్తాడని మిల్లర్ ను కొనియాడాడు. అతడి వల్లే తాను క్రీజులోకి వచ్చినప్పుడు పని సులువవుతుందని తెలిపాడు.
ఈ సీజన్ లో తెవాటియా 12 ఇన్నింగ్స్ లలో 217 పరుగులు చేశాడు. ఓటమి తప్పదనుకున్న హైదరాబాద్ తో మ్యాచ్ లో తెవాటియా అద్భుతమే చేశాడు. రషీద్ ఖాన్ తోడుగా గుజరాత్ కు విజయాన్ని అందించాడు.
ఇప్పటివరకు లీగ్ స్టేజ్ లో 14 మ్యాచులు ఆడిన గుజరాత్ పదింటిలో గెలిచింది. ఇక ప్లేఆఫ్స్ లో క్వాలిఫైయర్ లో కూడా రాజస్తాన్ రాయల్స్ పై ఘన విజయం సాధించింది. మే 29న అహ్మదాబాద్ లో జరుగబోయే ఫైనల్ లో నేడు రాజస్తాన్ రాయల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగబోయే మ్యాచ్ విజేతతో తలపడుతుంది.