- Home
- Sports
- Cricket
- IND vs PAK: దాయాది దేశాల ద్వైపాక్షిక సిరీస్ పై నిర్ణయించాల్సింది వాళ్లే : కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
IND vs PAK: దాయాది దేశాల ద్వైపాక్షిక సిరీస్ పై నిర్ణయించాల్సింది వాళ్లే : కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Kapil Dev on Ind-Pak Series: దాయాది దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు లేక రెండు దేశాల క్రికెట్ అభిమానులు అసలైన ఆట మజాను మిస్ అవుతున్నారనేది చాలాకాలంగా వినిపిస్తున్న మాట..

భారత్-పాక్ ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ ల నిర్వహణ అనేది ఎంత కష్టమైన వ్యవహారమో అందరికీ తెలిసిందే. ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణిస్తున్న తరుణంలో దాయాది దేశాలు ఐసీసీ ఈవెంట్లలో మినహా ప్రత్యక్షంగా పోరాడటం లేదు.
ఇటీవలే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు రమీజ్ రాజా.. ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్ లు కలిసి నాలుగు దేశాల టీ20 సిరీస్ కు ప్లాన్ చేశాడు. కానీ దీనిని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తిరస్కరించింది.
ఈ నేపథ్యంలో భారత మాజీ సారథి, దేశానికి తొలి వన్డే ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ తో ఆడేందుకు ఆటగాళ్లు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారని అయితే దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం ప్రభుత్వమే అని కుండబద్దలు కొట్టారు.
కపిల్ దేవ్ మాట్లాడుతూ... ‘ఈ విషయం (ఇండియా-పాక్ ద్వైపాక్షిక సిరీస్) లో తుది నిర్ణయం తీసుకోవాల్సింది బోర్డులు కాదు. ప్రభుత్వాలు. క్రికెట్ కంటే దేశం గొప్పది. అన్నింటికంటే దేశం పాలసీ ముఖ్యమైనది. జాతీయ ప్రయోజనాలను మనం కూడా పాటించాలి.
పాకిస్తాన్ తో ఆడేందుకు ఆటగాళ్లెప్పుడూ సిద్ధంగానే ఉన్నారు. అయితే దానిపై అంతిమ నిర్ణయం ప్రభుత్వానిదే కాబట్టి మనం దానికి కట్టుబడి ఉండాలి..’ అని హర్యానా హరికేన్ తెలిపారు.
బీసీసీఐ యువ ఆటగాళ్లకు సౌకర్యాలు కల్పించడంలో ఎనలేని కృషి చేస్తున్నదని కపిల్ దేవ్ కొనియాడారు. ‘భారత క్రికెట్ మౌళిక సదుపాయాల మీద దృష్టి పెట్టడం అభినందనీయం. ఇది యువ క్రికెటర్లకు ఎంతో లాభిస్తుంది..’ అని చెప్పారు.
ఇక భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్ విషయానికొస్తే ఇరు దేశాలు 2012-13 లో ఆఖరుసారి ఆడాయి. ఆ తర్వాత ఐసీసీ, ఆసియా కప్ వంటి ఈవెంట్లలో మినహా ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. చివరిసారిగా 2021 టీ20 ప్రపంచకప్ లో భారత్-పాక్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో పాక్ నే విజయం వరించింది.
ఇక ఈ ఏడాది కూడా అక్టోబర్ నుంచి ఆస్ట్రేలియాలో జరుగబోయే పొట్టి ప్రపంచకప్ లో భారత్-పాక్ లు మరోసారి తలపడబోతున్నాయి. అక్టోబర్ 23న ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది.