- Home
- Sports
- Cricket
- Ind Vs NZ: ఒకే రూంలో ఐదేండ్లుగా సావాసం.. ఆ పక్కింటి దోస్తులే ఇప్పుడు టీమిండియా క్రికెటర్లు..
Ind Vs NZ: ఒకే రూంలో ఐదేండ్లుగా సావాసం.. ఆ పక్కింటి దోస్తులే ఇప్పుడు టీమిండియా క్రికెటర్లు..
India Vs New Zealand: భారత క్రికెట్ జట్టులో స్నేహితులకు కొదవలేదు. నాటి తరం నుంచి నేటి దాకా చాలా మంది ఫీల్డ్ లోనే గాక గ్రౌండ్ బయట కూడా ఎంతో సన్నిహితంగా ఉన్నారు. కివీస్ తో సిరీస్ కు గాను టీమిండియాకు ఎంపికైన యువ ఆటగాళ్లలో ఇద్దరు ఆటగాళ్లు అదేబాటలో పయనిస్తున్నారు.

టీ20 ప్రపంచకప్ లో పేలవ ప్రదర్శన అనంతరం టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. కొత్త కెప్టెన్.. కొత్త కోచ్.. కొత్త ఆటగాళ్లతో కొత్త శకానికి నాంది పలకడానికి రోహిత్ సేన సిద్ధమవుతున్నది. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ తో పాటు రాబోయే మెగా ఈవెంట్లకు భారత జట్టును తయారుచేసేందుకు ద్రావిడ్ మార్గనిర్దేశనంలో టీమిండియా సన్నద్ధమవుతున్నది.
అయితే.. కివీస్ తో సిరీస్ కు గాను టీమిండియాకు ఎంపికైన యువ ఆటగాళ్లలో ఇద్దరికి భారత భవిష్యత్ స్టార్లుగా మారే అవకాశం ఉంది. నేడు కివీస్ తో జరిగే మ్యాచ్ లో వారిని తుది జట్టులోకి తీసుకోవడం కూడా లాంఛనమే.. వాళ్లే వెంకటేష్ అయ్యర్-అవేశ్ ఖాన్ లు.
ఈ ఇద్దరూ చిన్నప్పట్నుంచే స్నేహితులు. మధ్యప్రదేశ్ కు చెందిన ఈ యువ క్రికెటర్ల ఇల్లు కూడా పక్కపక్కనే. ఇద్దరూ కలిసి దాదాపు ఒకే సమయంలో క్రికెట్ ఆడటం ఆరంభించారు. ఇప్పుడు ఇద్దరూ ఒకేసారి టీమిండియా తరఫున ఆడుతుండటం గమనార్హం.
భారత క్రికెట్లో స్నేహితులకు కొదవలేదు. నాటి తరం నుంచి నేటి దాకా చాలా మంది ఫీల్డ్ లోనే గాక గ్రౌండ్ బయట కూడా ఎంతో సన్నిహితంగా ఉన్నారు. సౌరవ్ గంగూలీ-ద్రావిడ్.. ధోని-రైనా.. కెఎల్ రాహుల్-మయాంక్ అగర్వాల్ లు జాన్ జిగ్రీ దోస్తులు. ఇప్పుడు వీరి బాటలో అవేశ్-అయ్యర్ లు చేరడం విశేషం.
కివీస్ తో సిరీస్ కు తాను ఎంపికైనట్టు అవేశే తనకు చెప్పినట్టు అయ్యర్ తెలిపాడు. అయ్యర్ ఓ గదిలో ఉండగా.. తన ఇంటికి వచ్చిన అవేశ్ ఈ విషయం చెప్పగానే అతడు ‘మరి నీవో..?’అని అడిగాడట. తాను కూడా ఎంపికయ్యానని అవేశ్ చెప్పడంతో అయ్యర్ ఆనందానికి అవధుల్లేవట. తాను జట్టులోకి ఎంపికైన దానికంటే అవేశ్ ను ఎంపిక చేయడం తనకు సంతోషం కలిగించిందని అయ్యర్ చెప్పాడు.
చిన్నప్పట్నుంచి వివిధ స్థాయిలలో కలిసి ఆడిన ఈ జంట.. మధ్యప్రదేశ్ రంజీ జట్టుకు కలిసి ఆడారు. దాదాపు ఐదేండ్ల పాటు అవేశ్-అయ్యర్ లు ఒకే గదిని పంచుకున్నారట. క్రికెట్ ఆడటానికి అవేశ్ ఎంత కష్టపడ్డాడో తాను కండ్లారా చూశానని అయ్యర్ తెలిపాడు.
మధ్యప్రదేశ్ తరఫున అదరగొట్టిన ఈ జంట.. ఐపీఎల్ లో మాత్రం వేర్వేరు జట్లకు ఆడుతున్నారు. అవేశ్ ఖాన్ ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిథ్యం వహిస్తుండగా అయ్యర్.. కోల్కతా నైట్ రైడర్స్ కు ఆడుతున్నాడు. ఐపీఎల్ రెండో దశ వరకు అయ్యర్ పెద్దగా ఎవరికీ తెలియదు. అవేశ్ పరిస్థితి అంతే. కొద్దిరోజుల క్రితం ఇంగ్లాండ్ తో అర్థాంతరంగా ముగిసిన టెస్టు సిరీస్ లో అవేశ్ నెట్ బౌలర్ గా ఎంపికైనా అతడి గురించి తెలిసినవాళ్లు చాలా తక్కువ. కానీ నెల రోజుల్లోనే వారి పేర్లు దేశవ్యాప్తంగా మార్మోగిపోయాయి.
ఐపీఎల్ లో ఈ ఇద్దరూ అదరగొట్టే ప్రదర్శనలతో టీమిండియాలోకి స్థానం దక్కించుకున్నారు. టీమిండియాకు నిఖార్సైన ఆల్ రౌండర్ కొరత వేధిస్తున్న నేపథ్యంలో అయ్యర్ ఆ బాధ్యతను మోయాలని అభిమానులు భావిస్తున్నారు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ తో పాటు మీడియం పేసర్ అయిన అయ్యర్.. మంచి ఫినిషర్ కూడా. ఓపెనింగ్ గా బరిలోకి దిగే అతడు.. ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగలనని అంటున్నాడు.