IPL 2022: గత సీజన్ లో రూ. 15 కోట్లతో రికార్డు ధర.. ఇప్పుడు వేలంలో కూడా లేడు..
IPL 2022 Auction: గతేడాది ఐపీఎల్ వేలం సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడి అత్యధిక ధర దక్కించుకున్న న్యూజిలాండ్ ఆటగాడు జెమీసన్.. ఈసారి జాబితాలో కనిపించలేదు.

బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లవుతాయి అంటే ఇదేనేమో.. ఐపీఎల్ లో అయితే ఇది బాగా వర్తిస్తుంది. ఎందుకంటే ఇక్కడ గత రికార్డులు అవసరం లేదు. గతంలో ఆ ఆటగాడు వీర బాదుడు బాదినా... నిప్పులు చెరిగే బంతులతో చెలరేగినా అవసరం లేదు. ఆ సీజన్ వరకు తమకు పనికొస్తాడా..? లేదా..? అనేదే ముఖ్యం.
గతేడాది ఐపీఎల్ వేలం సందర్భంగా అత్యధిక ధర దక్కించుకున్న (బౌలర్ల జాబితాలో) న్యూజిలాండ్ ఆటగాడు కైల్ జెమీసన్.. పరిస్థితి దాదాపు ఇదే విధంగా ఉంది. ఈసారి వేలానికి ముందు విడుదల చేసిన తుది జాబితాలో అతడి పేరే కనిపించలేదు.
ఫిబ్రవరి 12,13 న బెంగళూరు వేదికగా జరిగే ఐపీఎల్ మెగా వేలానికి సంబంధించి బీసీసీఐ తుది జాబితాను ఖరారు చేసింది. 1,200 మందికి పైగా క్రికెటర్లు.. తమ పేరును నమోదు చేసుకోగా అందులో 590 మంది ఆటగాళ్లను బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది.
మొత్తం 590 మంది ఆటగాళ్లలో భారత క్రికెటర్లే 370 (క్యాప్డ్, అన్ క్యాప్డ్) ఉన్నారు. 220 మంది విదేశాలకు చెందిన ఆటగాళ్లున్నారు. విదేశీ ఆటగాళ్ల జాబితాలో జెమీసన్ పేరు లేదు.
ఐపీఎల్ లో ఆడేందుకు న్యూజిలాండ్ నుంచి 24 మంది ఆటగాళ్లు రిజిష్టర్ చేసుకున్నారు. వీరిలో జెమీసన్ లేడు. గతేడాది ఐపీఎల్ వేలం సందర్భంగా జెమీసన్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రూ. 15 కోట్లు పెట్టి దక్కించుకున్న విషయం తెలిసిందే.
ఆ సీజన్ లో బౌలర్ల జాబితాలో అత్యధిక ధర పలికిన ఆటగాడు జెమీసనే కావడం గమనార్హం. కానీ ఈసారి అతడిని ఆర్సీబీ రిటైన్ చేసుకోకపోగా.. వేలంలో కూడా దక్కించుకునేందుకు అంతగా ఆసక్తి చూపలేదు
భారత యువ పేసర్ మహ్మద్ సిరాజ్ ను రిటెన్షన్ లో దక్కించుకున్న ఆర్సీబీ.. మీడియం పేసర్ హర్షల్ పటేల్ ను వేలంలో తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది.
గత సీజన్ లో ఆర్సీబీ తరఫున ఆడుతూ జెమీసన్ పెద్దగా రాణించలేదు. తొమ్మిది మ్యాచులలో 9 వికెట్లు పడగొట్టాడు. 28 ఓవర్లు వేసి భారీగా పరుగులిచ్చుకున్నాడు.