- Home
- Sports
- Cricket
- మరో స్టార్ క్రికెటర్‌ను వదులుకున్న న్యూజిలాండ్.. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి గప్తిల్‌కు విడుదల
మరో స్టార్ క్రికెటర్‌ను వదులుకున్న న్యూజిలాండ్.. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి గప్తిల్‌కు విడుదల
New Zealand Cricket: న్యూజిలాండ్ క్రికెట్ లో ఫ్రాంచైజీ క్రికెట్ చిచ్చు పెడుతున్నది. ట్రెంట్ బౌల్ట్ తో మొదలైన ట్రెండ్ ను కొనసాగిస్తూ తాజాగా మార్టిన్ గప్తిల్ కూడా సెంట్రల్ కాంట్రాక్టును వదులుకున్నాడు.

న్యూజిలాండ్ క్రికెట్‌లో మరో భారీ కుదుపు. వివిధ దేశాలలో పెరుగుతున్న ఫ్రాంచైజీ క్రికెట్ కారణంగా న్యూజిలాండ్ క్రికెటర్లు తమ దేశంతో బంధాన్ని (కాంట్రాక్టులను) తెంచుకుంటున్నారు. ఇదివరకే ఈ జాబితాలో సీనియర్ పేసర్ ట్రెంట్ బౌల్ట్, ఆల్ రౌండర్ జేమ్స్ నీషమ్ ఉండగా తాజాగా మరో స్టార్ క్రికెటర్ కూడా చేరాడు.
కివీస్ స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ కూడా తాజాగా సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో అతడి అంతర్జాతీయ కెరీర్ కు దాదాపు ఎండ్ కార్డ్ పడ్డట్టే. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి విడుదల అయ్యారంటే ఆ జట్టు తరఫున ఆడేది బోర్డు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.
న్యూజిలాండ్ లో ఈ ట్రెండ్ ను వెటరన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ స్టార్ట్ చేశాడు. కొద్దిరోజుల క్రితం బౌల్ట్.. తనను సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించాలని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డును కోరాడు. దీంతో పరిణామాలను అంచనా వేయని న్యూజిలాండ్ బోర్డు.. బౌల్ట్ ను కాంట్రాక్టు నుంచి తప్పించింది.
ఇదే అదునుగా జేమ్స్ నీషమ్ కూడా సెంట్రల్ కాంట్రాక్టును వదులుకున్నాడు. ఇప్పుడు గప్తిల్ కూడా ఈ ఇద్దరిబాటలోనే పయనించాడు. సెంట్రల్ కాంట్రాక్టు వదులుకున్నా బౌల్ట్, నీషమ్ లు ఇటీవలే ముగిసిన ప్రపంచకప్ ఆడారు. అయితే వరల్డ్ కప్ ముగిశాక భారత్ తో ముగిసిన టీ20 సిరీస్ లో మాత్రం బౌల్ట్ ను పక్కనబెట్టింది న్యూజిలాండ్ బోర్డు.
మార్టిన్ గప్తిల్ టీ20 ప్రపంచకప్ ఆడకపోగా భారత్ తో సిరీస్ కు కూడా ఎంపిక చేయలేదు. యువ ఆటగాడు ఫిన్ అలెన్ ను ప్రోత్సహించేందుకు గాను గప్తిల్ ను పక్కనబెడుతున్నది బోర్డు. దీంతో జాతీయ జట్టులో తనకు చోటు కష్టమేనని భావించిన గప్తిల్.. కాంట్రాక్టు నుంచి తప్పించాలని బోర్డును కోరడంతో దానికి బోర్డు కూడా అంగీకారం తెలిపింది.
గప్తిల్ కు పరిమిత ఓవర్ల క్రికెట్ లో మంచి రికార్డులు ఉన్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల తర్వాత టీ20 లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ అతడే కావడం గమనార్హం. న్యూజిలాండ్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ అతడే. వన్డే క్రికెట్ లో కూడా గప్తిల్.. న్యూజిలాండ్ తరఫున మూడో టాప్ స్కోరర్ గా ఉన్నాడు.
మొత్తంగా న్యూజిలాండ్ తరఫున ఇప్పటివరకు 47 టెస్టులు ఆడిన గప్తిల్ 2,586 పరుగులు చేశాడు. 198 వన్డేలలో 7,346 రన్స్ సాధించాడు. ఇందులో 18 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలున్నాయి. అతడి అత్యధిక స్కోరు 237 నాటౌట్ గా ఉంది. ఇక 121 టీ20లలో 3,497 పరుగులు చేశాడు. టీ20లలో గప్తిల్ రెండు సెంచరీలు కొట్టాడు.