ఐపీఎల్ 2026: ఐదుగురు స్టార్ ప్లేయర్లకు ముంబై ఇండియన్స్ షాక్
Mumbai Indians: ఐపీఎల్ 2026 మినీ వేలం ముందు ముంబై ఇండియన్స్ ఐదుగురు ఆటగాళ్లను విడుదల చేయనుంది. అందులో 9.25 కోట్ల రూపాయల బౌలర్ దీపక్ చాహర్ కూడా ఉన్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ముంబై ఇండియన్స్ నుంచి ఐదుగురికి ఎగ్జిట్ సిగ్నల్ !
ఐపీఎల్ 2026 సీజన్ కోసం అన్ని ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ రెండో వారంలో మినీ వేలం జరగనుంది. దీనికి ముందే, అంటే నవంబర్ 15 లోపు జట్లు రిటైన్ చేసిన ప్లేయర్ల జాబితాను ప్రకటించాలి. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి తన జట్టులో కొంత మార్పులు చేయాలని భావిస్తోంది. గత సీజన్‌లో హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ప్లే ఆఫ్‌కి చేరినా, గుజరాత్ టైటాన్స్ చేతిలో ఎలిమినేటర్‌లో ఓడిపోయింది. ఈసారి జట్టు స్క్వాడ్‌లో కొత్త బ్లెండ్ ఇవ్వాలని యాజమాన్యం ఆలోచిస్తోంది.
1. ఆఫ్ఘన్ లెగ్ స్పిన్నర్‌కు ముంబై ఇండియన్స్ బై బై
ఆఫ్ఘానిస్తాన్ లెగ్ స్పిన్నర్ ఏ.ఎం. గజన్‌ఫర్ ఐపీఎల్ 2026కు ముందు ముంబై ఇండియన్స్ నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025లో ఆయన ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ముంబై ఆయనను ₹4.8 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ మిచెల్ సాంట్నర్ స్పిన్ విభాగాన్ని ముందుండి నడిపించడంతో, అలాగే యువ స్పిన్నర్ల మంచి ప్రదర్శనతో, గజన్‌ఫర్ బెంచ్‌కే పరిమితమయ్యారు. అంతర్జాతీయ అనుభవం తక్కువగా ఉండటంతో, అలాగే ఇటీవల టోర్నమెంట్లలో మెరుగైన ప్రదర్శన ఇవ్వకపోవడంతో ఆయనను ముంబై కొనసాగించే అవకాశాలు తగ్గిపోయాయి.
2. ఇంగ్లండ్ పేసర్ రీస్ టాప్లీ ముంబై నుంచి అవుట్ !
ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ రీస్ టాప్లీ కూడా రిలీజ్ జాబితాలో ఉండవచ్చు. ఐపీఎల్ 2025లో ఆయన కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడారు. ట్రెంట్ బౌల్ట్, బుమ్రా వంటి ఫ్రంట్‌లైన్ పేసర్లతో కలిసి ఫాస్ట్ అటాక్ ముందుండడంతో టాప్లీకి తక్కువ అవకాశం దక్కింది. ఆయనను ముంబై ఇండియన్స్ ₹75 లక్షలకు కొనుగోలు చేసింది. పరిమిత పాత్ర కారణంగా ఆయనను విడుదల చేయడం ద్వారా జట్టు కొత్త ఫాస్ట్ బౌలర్ల వైపు చూడవచ్చు.
3. బ్యాకప్ బౌలర్‌గా మాత్రమే మిగిలిన సౌతాఫ్రిక స్టార్ లిజాద్ విలియమ్స్
సౌతాఫ్రికన్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ లిజాద్ విలియమ్స్ ఐపీఎల్ 2025లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆయనను ముంబై ఇండియన్స్ ₹75 లక్షలకు తీసుకుంది. అయితే మొత్తం సీజన్‌లో ఆయన నెట్ ప్రాక్టీస్ సెషన్‌లలో మాత్రమే పాల్గొన్నారు. ఫీల్డ్‌లో అవకాశాలు దొరకకపోవడంతో, ఫ్రాంచైజీ ఆయన స్థానంలో కొత్త యువ బౌలర్లను పరీక్షించే అవకాశం ఉంది.
4. 9.25 కోట్ల బౌలర్ దీపక్ చాహర్ ను రిలీజ్ చేసేనా?
చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో ఆరు సంవత్సరాలు ఆడిన తర్వాత దీపక్ చాహర్ 2025లో ముంబై ఇండియన్స్‌లో చేరాడు. జట్టు ఆయనకు భారీ మొత్తం చెల్లించింది. ₹9.25 కోట్లకు సొంతం చేసుకుంది. కానీ ఆయన ప్రదర్శన ఆ అంచనాలకు సరిపోలలేదు. మొత్తం 14 మ్యాచ్‌ల్లో కేవలం 11 వికెట్లు మాత్రమే తీశాడు. ఈ నేపథ్యంలో జట్టు ట్రెంట్ బౌల్ట్, బుమ్రా వంటి బౌలర్లతో కలిసి పవర్‌ప్లేలో బలమైన కాంబినేషన్ కోసం కొత్త ఆప్షన్లను పరిశీలిస్తోంది.
5. కర్ణ్ శర్మ కు కష్టమే !
సీనియర్ ప్లేయర్, ఇండియన్ లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ కూడా ముంబై ఇండియన్స్ రిలీజ్ జాబితాలో చేరే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025లో ఆయన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం 7 వికెట్లు మాత్రమే సాధించారు. ₹50 లక్షలతో ఆయనను కొనుగోలు చేసిన ముంబై, ఈసారి ఒక యువ స్పిన్నర్‌కు అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తోంది. ఫ్రాంచైజీ స్పిన్ విభాగాన్ని భవిష్యత్ దృష్టితో పునర్నిర్మించేందుకు ప్రయత్నిస్తోంది.
ఇలా మొత్తంగా ఐపీఎల్ 2026 మినీ యాక్షన్ కు ముందు ముంబై ఇండియన్స్ భారీ నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఈ ఐదుగురు ఆటగాళ్లను రిలీజ్ చేయడం ద్వారా జట్టులోకి కొత్త ప్లేయర్లను తీసుకునే అవకాశాలు పెరుగుతాయి. ఫ్రాంచైజీ ఈ సీజన్‌లో స్థిరమైన ప్రదర్శనలతో పాటు టైటిల్ టార్గెట్ గా వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది.